విజయవాడ: పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం అధికార కూటమి పార్టీలు పోలీసు, అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరిస్తున్నాయని వైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలు పూర్తిగా స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ఎన్నికల కమిషన్ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్యే కల్పలతారెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి తదితరులతో కూడిన బృందం వైఎస్సార్‌సీపీ నాయకుల బృందం వినతిపత్రం సమర్పించింది. సమస్యాత్మక, సున్నితమైన గ్రామాల్లో అభ్యర్థులకు జిల్లా కలెక్టరేట్లలో కూడా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని సీసీ కెమెరాల నిఘాలో నిర్వహించడంతో పాటు వెబ్‌కాస్టింగ్ చేపట్టి, ఫుటేజీని భద్రపరచాలని విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాల నేపథ్యంలో కదిరి నియోజకవర్గంలోని టై అయిన ఎంపీటీసీ స్థానాల్లో ఎంపీపీ ఎన్నికల సమయంలో ప్రత్యేక భద్రత కల్పించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ప్రజాప్రతినిధులను హౌస్ అరెస్టులు చేయడం, నామినేషన్ పత్రాలను చింపడం, తప్పుడు కేసులతో భయభ్రాంతులకు గురిచేయడం వంటి చర్యలను అరికట్టాలని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ ఈ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా చూడాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. నాయకులు ఎవరెవరు ఏం మాట్లాడారంటే... కలెక్టరేట్లలోనూ నామినేషన్లు స్వీకరించాలి - వెలంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలు, అధికార పార్టీ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరుపై వైఎస్సార్‌సీపీ తరఫున రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేశాం. సమస్యాత్మక ప్రాంతాల్లో అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకునేలా జిల్లా కలెక్టరేట్లలో కూడా నామినేషన్లు స్వీకరించే సౌకర్యం కల్పించాలని కోరడం జరిగింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని సీసీ కెమెరాలతో పర్యవేక్షించి, ఫుటేజీని భద్రపరచడంతో పాటు వెబ్‌కాస్టింగ్ కూడా నిర్వహించాలి. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులకు పోలీసు రక్షణ కల్పించాల్సి ఉండగా, కొందరు పోలీసులు వారిని బెదిరించడం, తప్పుడు కేసులు పెట్టడం దురదృష్టకరం. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకపోయినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు సీఐ, డీఎస్పీ, ఎస్‌ఐ స్థాయి అధికారులు ఎందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారో చెప్పాలి. అధికారులకు ప్రజాస్వామ్యబద్ధంగా విధులు నిర్వహించాల్సిన బాధ్యత ఉందే తప్ప అధికార పార్టీకి బానిసలుగా పనిచేయాల్సిన అవసరం లేదు. ఈ అక్రమాలకు కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నాం. కదిరిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలకు రక్షణ కల్పించాలి - మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అధికార యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. సమస్యాత్మక, సున్నితమైన గ్రామాల్లో అభ్యర్థులు స్థానికంగా నామినేషన్లు వేయలేని పరిస్థితులు ఉంటే జిల్లా కలెక్టరేట్లలో నామినేషన్లు స్వీకరించేలా ప్రత్యామ్నాయ అవకాశం కల్పించాలని కోరాం. కదిరి నియోజకవర్గంలోని తలుపుల, కదిరి రూరల్ ప్రాంతాల్లో ఎంపీటీసీ స్థానాలు సమానంగా రావడంతో ఎంపీపీ ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలకు పోలీసు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశాం. ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, మొత్తం ఓటింగ్ ప్రక్రియను చిత్రీకరించి ఫుటేజీని భద్రపరచాలని డిమాండ్ చేశాం. ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యేలు, నాయకులను హౌస్ అరెస్టులు చేస్తూ అభ్యర్థులకు అండగా నిలవకుండా అడ్డుకోవడం సరికాదని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరగా, తగిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హామీ ఇచ్చింది. స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసే వాతావరణం కల్పించాలి - కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ రాష్ట్రంలో జరగబోయే పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రం అందజేశాం. అభ్యర్థులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునే వాతావరణం కల్పించాలని కోరాం. స్థానికంగా నామినేషన్లు వేయడానికి ఇబ్బందులు ఎదురైతే జిల్లా కలెక్టరేట్లలో కూడా నామినేషన్లు సమర్పించే ప్రత్యామ్నాయ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశాం. గత ఎంపీటీసీ ఎన్నికల్లో కదిరి రూరల్‌లో ఐదు స్థానాలు వైఎస్సార్‌సీపీకి, ఐదు స్థానాలు టీడీపీకి రాగా, తలుపుల మండలంలో ఆరు స్థానాలు చొప్పున రెండు పార్టీలకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎంపీపీ ఎన్నికల సమయంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పారదర్శకంగా ఓటింగ్ నిర్వహించాలని కోరాం. ఇప్పటికే పలుచోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని, వారికి తగిన భద్రత కల్పించాలని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం. గత ఎన్నికల్లో జరిగిన హౌస్ అరెస్టులు, నామినేషన్ పత్రాల చింపివేత, దౌర్జన్యాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం కార్యదర్శి హామీ ఇచ్చారు.