తాడేపల్లి: రాష్ట్రంలో ఓవైపు తుఫాన్లు, మరోవైపు కరవుతో రైతులు అల్లాడిపోతుంటే కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు మండిపడ్డారు. అర్నబ్, మురసు తుఫానుల్లో సాయం అటుంచి, కనీసం గతంలో మొంథా తుపాన్ బాధితులకు సైతం ఇప్పటికీ సాయం అందించలేని దుస్ధితిలో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం ఉందని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో జగన్‌గారి హయాంలో రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి, ఉచిత పంటల బీమా ఇచ్చి, ఆర్బీకే ల ద్వారా అన్ని విధాలా ఆదుకుంటే.. ఇప్పుడు వాటిని కనీసం కొనసాగించలేని స్దితిలో కూటమి ప్రభుత్వం ఉండటం దారుణమని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రేగిడి లక్ష్మణరావు ఆక్షేపించారు. ప్రెస్ మీట్ లో రేగిడి లక్ష్మణరావు ఇంకేమన్నారంటే..: కూటమి పాలనలో అల్లాడుతున్న రైతులు: వెన్నుపోటు పార్టీ కూటమి పాలనలో రైతుల అగచాట్లు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో అతివృష్టి. లేకపోతే అనావృష్టి. ఇటు తీవ్ర కరవు, అటు తుఫాన్లతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఎక్కడికి వెళ్లినా ఫొటోషూట్లకు పరిమితం అవుతున్నారు. రైతులకు ఇవ్వాల్సిన గిట్టుబాటు ధరలు, ఉచిత బీమా పథకం, ఇన్ పుట్ సబ్సిడీల గురించి మాట్లాడకుండా వారి దగ్గరికి కేవలం షో చేస్తున్నారు. గతంలో మొంథా తుఫాన్ సమయంలో రైతుల్ని ఆదుకుంటామని చెప్పి, ఇప్పటికీ ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. 2026 జూన్–ఆగస్టు మధ్య రాష్ట్రంలో సాధారణంగా 424.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 197.6 మిల్లీమీటర్లు మాత్రమే పడింది. అంటే 53.4 శాతం వర్షపాత లోటు కనిపిస్తోంది. ఇంత తీవ్ర పరిస్ధితుల్లో రైతుల్ని ఆదుకునేందుకు చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు, ఎలాంటి ప్యాకేజీలు ఇస్తున్నారో చెప్పాలి. కరువు. భారీ వర్షాలతో కుదేలైనా రైతుల్ని ఆదుకోరా?: 21 జిల్లాల్లో 388 మండలాల్ని కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. 283 మండలాలు అతి తీవ్ర కరువు ఉందని, 105 మండలాల్లో మధ్యస్థ కరువు ఉందని మీరే ప్రకటించారు. మరి అక్కడ రైతులకు మీరు ఏం పరిహారం ప్రకటించారు. ఎలా ఆదుకున్నారో చెప్పాలి. సెప్టెంబర్ 12 నాటికే రాష్ట్రంలో 2.44 లక్షల హెక్టార్లలో పంటలు వర్షాభావంతో నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. 582 హెక్టార్లలో పంటలు పూర్తిగా నష్టపోయినట్లు గుర్తించారు. వీటిపై చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి. మరోవైపు వరుసగా తుఫాన్లు వస్తున్నాయి. అర్నబ్, మురసు తుఫాన్లు వచ్చాయి, మరో తుఫాన్ వచ్చేందుకు సిద్దంగా ఉంది. అర్నబ్ తుఫాన్ వల్ల 4 లక్షల 61 వేల 194 హెక్టార్లలో వ్యవసాయ పంటలకు, మరో 29,960 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగినట్లు నవంబర్ 10న అధికారులు ప్రకటించారు. వీటిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి. అంటే వరి, ఉద్యాన పంటలు పండించే రైతులకు దాదాపు 4.91 లక్షల హెక్టార్లలో నష్టం జరిగింది. వీరి జీవనోపాధికి మీరు ఏం భరోసా కల్పిస్తారు. రైతులంటే చంద్రబాబుకు ఇంత చిన్నచూపు ఎందుకు? రైతులకు అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ల బాధ ఇంకెవరికి చెప్పుకోవాలని రేగిడి లక్ష్మణరావు అన్నారు.