తాడేపల్లి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని, ఫీజుల ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి రాష్ట్రంలో నెలకొందని వైఎస్సార్సీపీ స్టూడెంట్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ 12న చిత్తూరు జిల్లా ఎస్వీసెట్ కాలేజీలో సీఎస్సీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఫీజుల ఒత్తిడితో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 11 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి 13 త్రైమాసికాల ఫీజులు, స్కాలర్షిప్లు కలిపి రూ.12,400 కోట్ల బకాయిలు పేరుకుపోయినా ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించింది కేవలం రూ.2,800 కోట్లేనని విమర్శించారు. ఇంకా రూ.9,600 కోట్లు పెండింగ్‌లో ఉండటంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లించకపోతే హాల్‌టికెట్లు ఇవ్వబోమని, పరీక్షలు, ప్రాక్టికల్స్‌కు అనుమతించబోమని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన అంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు, నారా లోకేష్‌లు విద్యార్థుల చదువులే పూర్తికాకుండా ఉంటే ఎవరికి ఉద్యోగాలు కల్పిస్తారని ప్రశ్నించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ గారు ప్రతి త్రైమాసికానికి క్రమం తప్పకుండా ఫీజులు చెల్లిస్తూ, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా ఐదేళ్లలో రూ.18 వేల కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారని గుర్తుచేశారు. నాడు- నేడు, విద్యా సంస్కరణలతో విద్యారంగాన్ని బలోపేతం చేసిన గత ప్రభుత్వానికి, నేడు ఫీజుల బకాయిలతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎస్వీసెట్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై సమగ్ర విచారణ జరిపించాలని, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల పూర్తి వివరాలను ప్రభుత్వం తక్షణమే బహిర్గతం చేసి, పెండింగ్ నిధులన్నీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల బలవన్మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, లేనిపక్షంలో విద్యార్థుల పక్షాన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రవిచంద్ర హెచ్చరించారు.