ప్రాణాంతక ఎస్‌ఎంఏ వ్యాధితో బాధ పడుతున్న బాలుడికి వైయస్సార్‌సీపీ చేయూత 

 

 పార్టీ తరఫున సాయం చేస్తామని హామీ ఇచ్చిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

 వివరాలు వెల్లడించిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో, బాలుడి తల్లిదండ్రులు, పార్టీ నాయకుడు పి.నర్సింహారెడ్డితో సహా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి 

తాడేపల్లి:     ప్రాణాంతక జన్యుపరమైన వ్యాధి స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోఫీ (ఎస్‌ఎంఏ)తో బాధ పడుతున్న ప్రొద్దుటూరుకు చెందిన ఏడాదిన్నర వయసున్న బాలుడు వర్షిత్‌కు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. బాలుడి ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన చికిత్సకు పార్టీ తరఫున ఆర్థిక సాయం అందించాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. 
    వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి నేతృత్వంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన బాలుడి తల్లిదండ్రులు కాశీ విశ్వనాథ్, బాల లింగమ్మ తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి, చికిత్సకు అవసరమైన ఖర్చుల వివరాలను శ్రీ వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. రెండేళ్ల వయసు దాటక ముందే మలేషియాలో ప్రత్యేక ఇంజెక్షన్‌ వేయాలని, అందుకు సుమారు రూ.1.40 కోట్ల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పిన విషయాన్ని తెలిపారు. కాగా, ఇప్పటికే దాతల సహకారంతో రూ.50 లక్షలు సమకూరాయని వివరించారు.
    చిన్నారి తల్లిదండ్రులతో ఆప్యాయంగా మాట్లాడిన శ్రీ వైయస్‌ జగన్, వారికి ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు పార్టీ పరంగా సహకారం అందిస్తామని చెప్పారు.
    శ్రీ వైయస్‌ జగన్‌తో భేటీ అనంతరం, బాలుడి తల్లిదండ్రులతో సహా, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మీడియాతో మాట్లాడారు.
    చిన్నారి కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, కనీసం ఆసుపత్రులకు వెళ్లేందుకు కూడా స్తోమత లేని పరిస్థితి ఉందని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. మంత్రి నారా లోకేష్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్‌ను కలిసినా పేద తల్లిదండ్రుల ఆవేదన కూడా ఆలకించలేదని, అందుకే తాము చొరవ చూపామని చెప్పారు. హైదరాబాద్‌ వైద్యులతో పాటు మలేషియాలోని వైద్యులను సంప్రదించి, చిన్నారికి చికిత్స అందించే దిశగా అపాయింట్‌మెంట్, పాస్‌పోర్టులు, ఇతర ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. డిసెంబర్‌ 21న జగన్‌గారి పుట్టినరోజు సందర్భంగా చిన్నారికి ఇంజెక్షన్‌ అందించేలా మలేషియా వైద్యులతో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు. చిన్నారి వర్షిత్‌కు మెరుగైన చికిత్స అందించి ఆరోగ్యంగా ఎదిగేలా చేయడమే తమ లక్ష్యమని రాచమల్లు శివప్రసాదరెడ్డి వివరించారు.

Back to Top