తాడేపల్లి: ప్రాణాంతక జన్యుపరమైన వ్యాధి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్‌ఎంఏ)తో బాధపడుతున్న ప్రొద్దుటూరుకు చెందిన ఏడాదిన్నర వయసున్న చిన్నారి వర్షిత్‌కు వైయస్ఆర్‌సీపీ అండగా నిలిచింది. చిన్నారి చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్ ఖర్చులను పార్టీ తరఫున భరిస్తామని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. వైయస్ జగన్‌ను వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి కలిసి చిన్నారి ఆరోగ్య పరిస్థితి, చికిత్సకు అవసరమైన ఖర్చుల వివరాలను వివరించారు. రెండేళ్ల వయసు దాటకముందే మలేషియాలో ప్రత్యేక ఇంజెక్షన్ అందించాలని వైద్యులు సూచించారని, చికిత్సకు సుమారు రూ.1.40 కోట్ల వరకు ఖర్చవుతుందని రాచమల్లు తెలిపారు. ఇప్పటికే దాతల సహకారంతో రూ.50 లక్షలు సమకూరాయని వివరించారు. చిన్నారి తల్లిదండ్రులు బాలలింగమ్మ, కాశీవిశ్వనాథ్‌తో వైయస్ జగన్ ఆప్యాయంగా మాట్లాడి ధైర్యం చెప్పారు. మిగిలిన మొత్తాన్ని సమకూర్చేందుకు వైయస్ఆర్‌సీపీ తన వంతు సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. పేద చిన్నారి కుటుంబాన్ని ఆదుకోని మంత్రులు చిన్నారి కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉందని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. మంత్రి నారా లోకేష్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్‌ను కలిసినా స్పందన లేకపోవడంతో దాతల సహకారంతో చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్, మలేషియాలోని వైద్యులను సంప్రదించి చికిత్సకు సంబంధించిన అపాయింట్‌మెంట్, పాస్‌పోర్టులు తదితర ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. డిసెంబర్ 21న వైయస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా చిన్నారికి ఇంజెక్షన్ అందించేలా మలేషియా వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు రాచమల్లు వెల్లడించారు. వైయస్ఆర్‌సీపీ అందించే సాయంతో పాటు దాతలు అందించిన విరాళాలు పోగా మిగిలిన మొత్తాన్ని తానే భరిస్తానని హామీ ఇచ్చారు. చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు దాతలు ముందుకు రావాలి చిన్నారి వర్షిత్‌కు మెరుగైన చికిత్స అందించి ఆరోగ్యంగా ఎదిగేలా చేయడమే లక్ష్యమని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. చిన్నారి పరిస్థితిని అర్థం చేసుకుని దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. మానవీయ దృక్పథంతో చేపట్టిన ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.