బాబు మరో ‘రియాల్టీ షో’

విశాఖ వేదికగా ఏటా పాత పెట్టుబడులతో హంగామా

రెండున్నర ఏళ్లలోనే రూ.30 లక్షల కోట్లు తీసుకొచ్చానంటూ ప్రచారం 

నాలుగు సీఐఐ సదస్సుల ద్వారా రూ.32.85 లక్షల కోట్లు పెట్టుబడులంటూ బుకాయింపు 

అదే నిజమైతే ఆ పెట్టుబడులెక్కడ? ఎంతమందికి ఉపాధి కల్పించావు బాబూ? 

గత ప్రభుత్వ హయాంలోనే వచ్చిన పాత పెట్టుబడులనే కొత్తవిగా చిత్రీకరిస్తూ అడ్డంగా దొరికిన బాబు సర్కారు

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలోనే రెన్యూ పవర్, ఏబీసీ, హీరో ఫ్యూచర్స్, ఎన్టీపీసీతో కుదిరిన పెట్టుబడుల ఒప్పందాలు  

అమరావతి: ఒకవైపు యువతకు ఉద్యోగాలు,  ప్రతినెలా రూ.3 వేల చొప్పున ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి ఎగ్గొట్టి.. మరోవైపు పెట్టుబడుల ఆకర్షణ అంటూ విశాఖ వేదికగా మరోసారి రియాల్టీ షో కార్య­క్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు.  గత ప్రభుత్వ హయాంలోనే కుదిరిన పాత ఒప్పందాలనే మళ్లీ తెరపైకి తెచ్చి చంద్రబాబు సర్కార్‌ తిరిగి ఒప్పందాలు చేసుకోవడం పట్ల తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. 

 నవంబర్‌ 12, 13వ తేదీల్లో విశాఖ వేదికగా నిర్వహించనున్న భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) భాగస్వామ్య సదస్సు కోసం గత రెండు నెలలుగా దేశ విదేశాల్లో రోడ్‌షోల పేరుతో మభ్యపుచ్చే యత్నా­లకు తెర తీసినట్లు చర్చ జరుగుతోంది. గత రెండున్నరేళ్లలో రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయంటూ చేసుకుంటున్న ప్రచారంలో నిజం లేదని పేర్కొంటున్నారు. గతేడాది సీఐఐ భాగస్వామ్య సదస్సు కంటే ఒక రోజు ముందుగానే పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకొని ప్రచారం చేసుకున్న చంద్రబాబు సర్కారు ఈదఫా ప్రాంతీయ సదస్సులంటూ పలు పట్టణాల్లో సమావేశాలు నిర్వహించింది.  

ఆ పెట్టుబడులెక్కడ? 
రెడీ.. స్టార్ట్‌ కెమెరా.. యాక్షన్‌...! అంటూ సీఐఐ పార్టనర్‌ షిప్‌ సమ్మిట్‌ పేరుతో పాత పెట్టుబడులనే కొత్తవిగా చిత్రీకరించేందుకు సీఎం చంద్రబాబు సమాయత్తమయ్యారు. చంద్రబాబు అధికారంలో ఉండగా 2016, 2017, 2018, 2025లో సీఐఐ భాగస్వామ్య సదస్సులు జరగగా తాజాగా ఐదో­సారి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నాలుగు సదస్సుల ద్వారా సుమారు 2,374 ఒప్పందాల ద్వారా కుదుర్చుకున్న రూ.32.85 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ? ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పించావు బాబూ? అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు చెబుతున్నట్లుగా నిజంగానే అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తే ఏపీ ఏకంగా 7.8 శాతం నిరుద్యోగంతో దేశ సగటు 5.8 శాతంతో పోలిస్తే అత్యంత దారుణంగా ఎందుకు ఉంటుందంటూ నిలదీస్తున్నారు.  

మ్యాప్‌లు చూడండి

పాత ఒప్పందాలతో అడ్డంగా దొరికిన బాబు 
2023లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో కుదిరిన ఒప్పందాలనే తిరిగి గత సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా చేసుకుంటూ, రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను తెచ్చినట్లు బుకాయిస్తూ చంద్రబాబు సర్కారు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌ సీపీ హయాంలో 2023లో నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్టీపీసీ) ప్రకటించిన రూ.2.35 లక్షల కోట్ల పెట్టుబడుల తర్వాత అతిపెద్ద పెట్టుబడి ఒప్పందంగా నిలిచిన ఏబీసీ లిమిటెడ్‌ రూ.1,20,000 కోట్ల ఒప్పందాన్ని చంద్రబాబు సీఎం కాగానే తిరిగి కుదుర్చుకొని దాన్ని కొత్త ఒప్పందంగా ప్రచారం చేసుకున్నారు. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో హీరో ఫ్యూచర్స్‌తో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న దృశ్యం (ఫైల్‌) 

» వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం చేసుకున్న హీరో ఫ్యూచర్‌ ఎనర్జీస్‌ ఇప్పుడు ఆ పెట్టుబడిని ఏకంగా రూ.15,000 కోట్లకు తగ్గిస్తూ చంద్రబాబు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం గమనార్హం.    

హీరో ఫ్యూచర్‌ ఎనర్జీస్‌ సంస్థ సీఎండీ రాహుల్‌ ముంజాల్‌తో గత ఏడాది మళ్లీ విశాఖపట్నంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న సీఎం చంద్రబాబు 

ఏబీసీ గ్రూపునకు చెందిన ఏబీసీ క్లీన్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎవ్రెన్‌), యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్స్‌ రూ.1,10,250 కోట్ల పెట్టుబడులతోపాటు రెన్యూ పవర్‌ రాష్ట్రంలో రూ.97,500 కోట్ల పెట్టుబడులు పెట్టేలా గత ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకుంటే.. చంద్రబాబు సర్కారు అదే ఒప్పందాన్ని రూ.82,000 కోట్లకు చేసుకోవడం ద్వారా అభాసుపాలైంది. అలాగే గతంలో రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం చేసుకున్న హీరో ఫ్యూచర్‌ ఎనర్జీస్‌ ఇప్పుడు ఆ పెట్టుబడిని ఏకంగా రూ.15,000 కోట్లకు తగ్గిస్తూ ఒప్పందం చేసుకోవడం చంద్రబాబు నిర్వాకాలకు నిదర్శనం. ఇలా గత ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందాలనే తిరిగి చేసుకుంటూ చంద్రబాబు సర్కారు చేసుకుంటున్న ప్రచారాన్ని చూసి పారిశ్రామిక వర్గాలు విస్తుపోతున్నాయి.  

 2014–2019 మధ్య చంద్రబాబు హయాంలో మొత్తం 327 ప్రాజెక్టులకు ఒప్పందాలు జరగ్గా వాటిలో కేవలం 13శాతం మాత్రమే సాకారమైనట్టు పరిశ్రమల శాఖ డాక్యుమెంట్‌లో పేర్కొన్న భాగం   

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 2023లో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 91 శాతం వాస్తవరూపం దాల్చినట్టు పరిశ్రమల శాఖ అధికారులు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం  

ఆర్టీఐతో వాస్తవాలు బహిర్గతం 
చంద్రబాబు సర్కార్‌ డొల్ల పెట్టుబడుల ఒప్పందాల గుట్టును సమాచార హక్కు చట్టం బహిర్గతం చేసింది.. 2017, 2018, 2023లో విశాఖ పెట్టుబడుల సదస్సులో పరిశ్రమల శాఖ కుదుర్చుకున్న  ఒప్పందాలపై ఓ సామాజిక కార్యకర్త వివరాలు కోరగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 2017, 2018లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పరిశ్రమల శాఖలో కుదిరిన ఒప్పందాల్లో కనీసం 13 శాతం కూడా వాస్తవ రూపంలోకి రాలేదని వెల్లడైంది.మరోవైపు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో 2023లో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో కుదిరిన ఒప్పందాల్లో 91 శాతానికిపైగా అమల్లోకి  వచ్చినట్లు తేలడం గమనార్హం.  

వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన ఒప్పందంపై నాటి సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ అనంతరం రెన్యూ పవర్‌ చైర్మన్, సీఈవో సుమంత్‌ సిన్హా పోస్టు   , వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంతో ఒప్పందం మేరకు విశాఖలో ఎన్టీపీసీ హైడ్రోజన్‌ హబ్‌ పనులు మొదలు పెడుతున్నట్టు పేర్కొన్న వార్తా కథనం 

Back to Top