విజయనగరం: విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గరివిడి జడ్పీటీసీ బొత్స పూజిత, గుర్ల జడ్పీటీసీ సంగంరెడ్డి వెంకటలక్ష్మి జిల్లా పరిషత్ సీఈవో చేతుల మీదుగా సంబంధిత ధ్రువపత్రాలను అందుకున్నారు. ఈ కార్యక్రమానికి వైయస్ఆర్సీపీ యువ నాయకుడు డాక్టర్ బొత్స సందీప్, వైయస్ఆర్సీపీ నాయకురాలు శోభా స్వాతిరాణి, కేసలి అప్పారావు తదితరులు హాజరై పూజిత, వెంకటలక్ష్మిలకు అభినందనలు తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని డాక్టర్ బొత్స సందీప్ ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. జడ్పీటీసీలుగా గెలుపొంది ధ్రువపత్రాలు అందుకున్న పూజిత, వెంకటలక్ష్మి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మెరుగైన సేవలు అందించాలని శోభా స్వాతిరాణి కోరారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రాంతీయ అభివృద్ధికి కృషి చేస్తారనే నమ్మకం ఉందన్నారు. కార్యక్రమంలో పలువురు వైయస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.