తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని పలు జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు కలిశారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల తీరు, ఎన్నికల సందర్భంగా ఎదురైన పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ కేడర్ కసితో, గట్టిగా పోరాడిందని వైయస్ జగన్ అన్నారు. 2024 ఎన్నికలతో పోలిస్తే వైయస్ఆర్‌సీపీ ఓటింగ్ శాతం పెరిగిందని వైయస్ జగన్ వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలోనూ అరాచకాలు, అన్యాయాలు జరిగినప్పటికీ ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా జరిగి ఉంటే వైయస్ఆర్‌సీపీకి అనుకూలంగా మరింత భారీ ఓటింగ్ నమోదయ్యేదని పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమాలను ప్రజలంతా చూశారని, వారికి కూడా పరిస్థితులు బాగా అర్థమయ్యాయని వైయస్ జగన్ అన్నారు. ఎన్నికల అక్రమాల్లో చంద్రబాబు సరికొత్త పద్ధతులను తీసుకొచ్చారని, వైయస్ఆర్‌సీపీ విజయాలు సాధించిన చోట కూడా ఫలితాలను తారుమారు చేసే ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. గతంలో స్థానిక ఎన్నికలపై వైయస్ఆర్‌సీపీపై నిందలు మోపి, ఇప్పుడు జరిగిన అరాచకాలను సమర్థించుకోవడం విడ్డూరమన్నారు. పార్టీ నాయకులు తమ రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికల అక్రమాలను ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. లెక్కింపు కేంద్రాల్లో ఏజెంట్లకు బదులు బౌన్సర్లను ఏర్పాటు చేశారని, అభ్యర్థుల బంధువులను కిడ్నాప్ చేసి నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి తెచ్చారని తెలిపారు. లెక్కింపు సమయంలో చెల్లని ఓట్ల పేరుతో వైయస్ఆర్‌సీపీ ఓట్లు తొలగించడం, కరెంటు ఆపి ఫలితాలను తారుమారు చేయడం, వైయస్ఆర్‌సీపీ గెలిచిన చోట పదేపదే రీకౌంటింగ్‌లు నిర్వహించడం వంటి అక్రమాలు జరిగాయని నాయకులు తెలిపారు. వైయస్ఆర్‌సీపీ కోరిన చోట రీకౌంటింగ్ చేయకుండా, అధికార పార్టీకి అనుకూలంగా అదనపు బ్యాలెట్ పేపర్లు ఇచ్చి గెలిపించేలా అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. దాడులు, అక్రమాలు ఎన్ని ఎదురైనా వైయస్ఆర్‌సీపీ కేడర్ వెనక్కి తగ్గకుండా పోరాడిందని, ఈ ఎన్నికల్లో చంద్రబాబు చేయించిన దాడుల కారణంగా గ్రామ గ్రామానా బాధితులు ఉన్నారని నాయకులు వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.