వైయ‌స్ జగన్‌కు సైదాపురం జెడ్పీటీసీ స్థానం కానుక

కూటమి కుట్రలను తిప్పికొట్టి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి వెందోటి సునీత ఘన విజయం 

నెల్లూరు జిల్లా: సైదాపురం మండల జెడ్పీటీసీ స్థానాన్ని వైయ‌స్ఆర్‌సీపీ కైవసం చేసుకోవడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎస్టీ మహిళకు రిజర్వైన ఈ స్థానంలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి వెందోటి సునీత అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. ఈ విజయాన్ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా అందిస్తున్నామని పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

ఎంఏ, బీఈడీ విద్యార్హతలు కలిగిన వెందోటి సునీతకు సైదాపురానికి చెందిన రాజేష్‌తో వివాహమైంది. రాజేష్‌ మొదటి నుంచి సైదాపురం వైయ‌స్ఆర్‌సీపీ కన్వీనర్‌ మన్నారపు రవికుమార్‌ యాదవ్‌ అనుచరుడిగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జెడ్పీటీసీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్‌ కావడంతో పార్టీ నాయకత్వం సునీతను అభ్యర్థిగా నిలబెట్టింది.

వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆశీస్సులతో బరిలోకి దిగిన సునీతకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక శ్రేణులు అండగా నిలిచారు. ఎన్నికల సమయంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ సమష్టిగా పనిచేసి సైదాపురం జెడ్పీటీసీ స్థానాన్ని వైయ‌స్ఆర్‌సీపీ ఖాతాలోకి తీసుకొచ్చారు. అధికార పార్టీ నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజల మద్దతుతో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి విజయం సాధించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సైదాపురం జెడ్పీటీసీ విజయం ఒక్కరి గెలుపు కాదని, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలు వైయ‌స్ జగన్‌పై చూపుతున్న ఆదరణకు ఈ విజయం మరో సంకేతమని, సైదాపురం జెడ్పీటీసీ స్థానాన్ని ఆయనకు కానుకగా అందిస్తున్నామని తెలిపారు. సైదాపురంలో వైయ‌స్ఆర్‌సీపీ జెండాను మరోసారి ఎగురవేసిన ఈ విజయం పార్టీ శ్రేణులకు మరింత ధైర్యాన్ని ఇచ్చింది. అధికార పార్టీ ఒత్తిళ్లు, అడ్డంకులను ఎదుర్కొని వైయ‌స్ఆర్‌సీపీ సాధించిన ఈ గెలుపు గ్రామీణ స్థాయిలో పార్టీకి ఉన్న ప్రజాబలాన్ని చాటిచెబుతోందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. 

Back to Top