సర్పంచ్ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారులకు అండగా ఉంటాం

ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి

 
 వైయ‌స్ఆర్ జిల్లా, బద్వేల్: పోరుమామిళ్లలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో బద్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రారంభం నుంచి మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వరకు వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు అనేక ఇబ్బందులు, బెదిరింపులు, రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కొన్నారని ఆయన పేర్కొన్నారు.

టీడీపీ ఇన్‌చార్జి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ వర్గాలు పోలీసుల సహకారంతో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించివేయడం, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఘటనలకు పాల్పడ్డాయని గోవిందరెడ్డి ఆరోపించారు. కలసపాడు, కాశినాయన, బి.కోడూరు, గోపవరం మండలాల్లో అభ్యర్థులను ప్రచారం నుంచి పోలింగ్ వరకు ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. కలసపాడులో పోలింగ్‌కు ముందు రోజు పుత్తా నరసింహారెడ్డి, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో చేరుకుని అభ్యర్థులను భయపెట్టడం, ఏజెంట్లను బయటకు పంపించడం, ఎన్నికల పత్రాలను చించివేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని చెప్పారు.

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించాల్సిందని గోవిందరెడ్డి అన్నారు. ప్రజలపై నమ్మకం ఉంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించి ప్రజల తీర్పును స్వీకరించాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ, జడ్పీటీసీ పదవులను ఏకగ్రీవం చేసుకునేందుకు రూ.50 లక్షల నుంచి రూ.6 కోట్ల వరకు ముడుపులు చెల్లించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని, పదవులను డబ్బుతో దక్కించుకోవాలనే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.

రానున్న సర్పంచ్ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారులకు పార్టీ అండగా ఉంటుందని గోవిందరెడ్డి స్పష్టం చేశారు. నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను బరిలో నిలిపి వారి విజయానికి సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు. సర్పంచ్ ఎన్నికలు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు, దౌర్జన్యాలు లేకుండా ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Back to Top