తాడేపల్లి: రాజధాని భవనాల అద్దాలు ఏర్పాటు చేయడానికి రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు, పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలనే ఆలోచన లేదా అని వైయస్సార్‌సీపీ డాక్టర్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వమే భూమిని కేటాయించి, ఇప్పటివరకు ప్రజాధనంతో నిర్మాణాలు జరిపినప్పటికీ.. మళ్లీ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అదనంగా రూ.1,630 కోట్లు ఇస్తామనడం వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు. కాలేజీలు ప్రైవేట్ పరం చేసి, సీట్ల ఫీజులు, మెయింటెనెన్స్ వాళ్లే చూసుకున్నా.. జీతాలు ప్రభుత్వమే ఇస్తామనడం, పైగా వేల కోట్లు ఫండ్స్ రూపంలో కట్టబెట్టడం ఏ రకమైన పాలన అని ప్రశ్నించారు. ఇదంతా లోకేష్ అండ్ కో కిక్ బ్యాక్స్ దండుకోవడానికి వేస్తున్న పథకమేనని ధ్వజమెత్తారు. జగన్ గారు ఒక్కో మెడికల్ కాలేజీకి 50 ఎకరాల చొప్పున భూములు కేటాయించి, సుమారు రూ.500 కోట్ల చొప్పున నిధులు సమకూర్చి, 17 మెడికల్ కాలేజీల పనులు ప్రారంభించి 8 కాలేజీలను పూర్తి చేశారని.. అలాంటి ప్రజోపయోగ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం, మిగిలిన 9 మెడికల్ కాలేజీలను పూర్తి చేయకుండా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. వైయస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఈ ప్రైవేటీకరణ నిర్ణయాలన్నింటినీ రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నడిపిస్తుందని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... అసెంబ్లీ భవనం అద్దాలకు పెట్టిన ఖర్చు ప్రజారోగ్యం కోసం పెట్టలేరా? : జగన్ గారు పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి, సుమారు 2,000 అదనపు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించారు. ఒక్కో మెడికల్ కాలేజీకి సుమారు 50 ఎకరాల భూమిని సేకరించి, నర్సింగ్, డెంటల్, ఫిజియోథెరపీ, మెడికల్ టెక్నీషియన్ల శిక్షణ, ల్యాబ్‌లు, సిబ్బంది నివాసాలు వంటి అనుబంధ వైద్య సదుపాయాలను ఒకే ప్రాంగణంలో అభివృద్ధి చేయాలని దూరదృష్టితో ప్రణాళిక రూపొందించారు. ఒక్కో కాలేజీకి సుమారు రూ.500 కోట్ల చొప్పున నిధులు సమకూర్చి, ప్రభుత్వమే భూములు సేకరించి నిర్మాణ పనులు ప్రారంభించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే 5 కాలేజీలు ప్రారంభం కాగా, నిర్మాణం ముగింపు దశకొచ్చిన మరో 3 కాలేజీలు కూడా తర్వాత రోజుల్లో ప్రారంభమయ్యాయి. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన చంద్రబాబు, మిగిలిన 9 మెడికల్ కాలేజీలను పూర్తి చేయకుండా ప్రైవేట్ వ్యక్తులకు 66 ఏళ్ల పాటు లీజుకు అప్పగించేందుకు సిద్ధమవడం సిగ్గుచేటు. రాజధాని భవనాల అద్దాల కోసం ఖర్చు చేయాలనుకుంటున్న రూ.2,500 కోట్లలో కొంత మొత్తాన్ని మెడికల్ కాలేజీలకు కేటాయిస్తే పేదలకు వైద్య సేవలు అందించే వ్యవస్థ మరింత బలోపేతం కాదా? చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్ల ప్రయాణాలపై చేస్తున్న దుబారా ఖర్చులను తగ్గించినా మెడికల్ కాలేజీల నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చవచ్చు. ప్రజల ఆరోగ్యం కంటే రాజధాని భవనాల అద్దాల ఆడంబరాలే మీకు ముఖ్యమా ? కనీసం ఆ రూ.1,630 కోట్లు 9 కాలేజీలకు వెచ్చించినా..: గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వమే భూములు సేకరించి, ఇప్పటికే నిర్మాణాల కోసం వేల కోట్లు ఖర్చు చేసిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడమే కాకుండా, వాటి నిర్వహణ కోసం మళ్లీ ప్రభుత్వమే రూ.1,630 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వడం విచిత్రమైన నిర్ణయం. ఈ రూ.1,630 కోట్లను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడానికి బదులుగా మిగిలిన తొమ్మిది మెడికల్ కాలేజీల నిర్మాణానికి వినియోగిస్తే ఒక్కో కాలేజీకి సుమారు రూ.200 కోట్ల చొప్పున కేటాయించి ప్రభుత్వమే పూర్తి చేయవచ్చు. పైగా మొదటి రెండేళ్లు బోధన, బోధనేతర సిబ్బంది జీతాలను కూడా ప్రభుత్వమే చెల్లించేందుకు సిద్ధమవుతోంది. అలాంటప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాల్సిన అవసరం ఏముంది? ఒక్కో కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే, మేనేజ్‌మెంట్ కోటా ద్వారా వచ్చే ఆదాయంతో పాటు వైద్య సేవలు, ఓపీ, ల్యాబ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని నిర్వహణకు వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ భూములు, ప్రభుత్వ నిధులు, ప్రభుత్వ సిబ్బందితో నడిచే వ్యవస్థలో ప్రయోజనాలు మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు దక్కేలా చేయడం ప్రజాధనాన్ని ప్రైవేటు ప్రయోజనాలకు మళ్లించడమే. ఈ వ్యవహారంలో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, కాంట్రాక్టులు, మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో కిక్‌బ్యాక్‌లు పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనేది స్పష్టంగా తెలిసిపోతుంది. మేమొస్తే వెనక్కి తీసుకుంటాం: ఈ కాలేజీల ద్వారా ఇప్పటికే పేదలకు వైద్య సేవలు అందుతున్నాయి, పిడుగురాళ్ల మెడికల్ కాలేజీలో రోజుకు 700 నుంచి 800 మంది వరకు ఓపీకి వస్తుండగా, ఇతర కాలేజీల్లో 1,000 నుంచి 1,500 మంది వరకు ఓపీ, 300 నుంచి 400 మంది వరకు ఇన్‌పేషెంట్లు ఉంటున్నారు. ఇలాంటి ప్రజోపయోగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం పేదల వైద్య హక్కులను దెబ్బతీయడమే. 66 ఏళ్ల లీజు పేరుతో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే నిర్ణయాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రేపు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకుని, ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఆస్తులు ప్రజలకే చెందాలి. అవి పేదల వైద్యానికి ఉపయోగపడాలి తప్ప ప్రైవేట్ వ్యక్తుల లాభాల కోసం కాదని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.