తాడేపల్లి: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా కొణిదలకు విడాకుల వ్యవహారంపై ఎవరూ కూడా బహిరంగంగా, వ్యక్తిగతంగా మాట్లాడవద్దు అని చెప్పడం ద్వారా వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తమ పార్టీ శ్రేణులకు అత్యంత సంస్కారయుతంగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని పార్టీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలు వేరు, వ్యక్తిగత జీవితాలు వేరని బలంగా నమ్మే వ్యక్తి వైయస్ జగన్ అని కొనియాడారు. పవన్ కళ్యాణ్ విడాకుల వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకునే ఆలోచనే చేయకుండా సంయమనం పాటించాలని తమ అధినేత స్పష్టం చేశారన్నారు. అయితే గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వారి ఎల్లో మీడియా వైయస్ జగన్ కుటుంబ అంతర్గత వ్యవహారాలను, ఆస్తి వివాదాలను పట్టుకుని దారుణంగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు వ్యాపారవేత్తగా, సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్న వైయస్ భారతిని సోషల్ మీడియాలో ఎంత నీచంగా ట్రోల్ చేశారో గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. ఇకనైనా కూటమి నేతలు బుద్ధి తెచ్చుకుని, మహిళల జోలికి రావడం మానుకోవాలని ఆమె తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఆమె ఏమన్నారంటే... వైయస్ జగన్ గారి సంస్కారం – మా పార్టీ విధానం: ఎవరి వ్యక్తిగత జీవితాల గురించి మనం మాట్లాడొద్దని మా పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్ గారు మా అందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాజకీయాలు వేరు, వ్యక్తిగత జీవితాలు వేరని బలంగా నమ్మే వ్యక్తి మా నాయకుడు. పవన్ కళ్యాణ్ విడాకుల వ్యవహారం బయటకు రాగానే దానిపై ఎవరూ స్పందించవద్దని ఆదేశించి ఆయన తన ఉన్నతమైన సంస్కారాన్ని చాటుకున్నారు. రాజకీయాల్లో ఎలా హుందాగా, సంస్కారంగా వ్యవహరించాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మా జగన్ గారిని చూసి నేర్చుకోవాలి. వైయస్ భారతి గారిపై నీచమైన ట్రోలింగ్ చేయలేదా?: దేశమంతా గర్వించదగ్గ ఉత్తమ ఇల్లాలు, ఎన్నో పరిశ్రమలను విజయవంతంగా నడుపుతూ, అన్నదానాలు, ఉచిత విద్యాదానాలు చేస్తూ సేవలందిస్తున్న వైయస్ భారతి పై గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంత నీచమైన విమర్శలు చేశారు? ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ సినిమాలు తీయించి, ఎల్లో మీడియా, సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులతో ఎంత పైశాచికంగా ట్రోలింగ్ చేయించారు? జగన్ గారి కుటుంబంలో ఉండే చిన్న చిన్న ఆస్తి వివాదాలను పట్టుకుని ఇంత దారుణంగా మాట్లాడిన మీరు ఒక్కసారైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. మహిళల రక్షణపై పవన్ ద్వంద్వ వైఖరి: మైకుల ముందుకు వస్తే మహిళల రక్షణే నా ప్రథమ కర్తవ్యం అని మాట్లాడే పవన్ కళ్యాణ్, నిజ జీవితంలో మహిళల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో సమాజం అంతా గమనిస్తోంది. జనసేన పార్టీ ఎమ్మెల్యే ఒకరు బరితెగించి మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడితే పవన్ కనీస చర్యలు తీసుకోలేదు. మొక్కుబడిగా సస్పెండ్ చేసి మళ్లీ పక్కనే కూర్చోబెట్టుకున్నారు. మహిళా అధికారుల వెంటపడే కామాంధులు మీ పార్టీలో ఉంటే వారికి ఏం శిక్ష వేశారు? కూటమి పాలనలో వందలాది మంది మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ ఎందుకు నోరు విప్పడం లేదు?. టీడీపీ వేధింపులకు బలైన గీతాంజలి: వైయస్.జగన్ పుణ్యమా అని నా జీవితంలో సొంత ఇల్లు వచ్చిందని అమాయకంగా సంతోషపడిన గీతాంజలి అనే పేద మహిళను టీడీపీ రాక్షసులు వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఆమె కళ్లల్లో ఆనందం చూడలేక అర్ధరాత్రి వేళల్లో కూడా అసభ్యకర మెసేజ్లు పంపి చంపేశారు. మా మాజీ మంత్రులు రోజా, విడదల రజిని క్యారెక్టర్లను అసాసినేట్ చేస్తూ మీ ఐటీడీపీలో పైశాచిక ఆనందం పొందారు. ఇతర పార్టీల మహిళలకు కుటుంబాలు, పిల్లలు, ఆత్మగౌరవం ఉంటాయన్న స్పృహ మీకు లేదా? లడ్డూ వివాదం.. పవన్ రాజకీయ డ్రామాలు: తిరుపతి లడ్డూల విషయంలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తే, పవన్ కళ్యాణ్ దాన్ని భుజాన వేసుకుని మెట్లు కడిగి పెద్ద డ్రామా చేశారు. అయోధ్యకు లక్ష కల్తీ లడ్డూలు వెళ్లాయంటూ తిరుమల పవిత్రతను, వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ప్రపంచవ్యాప్తంగా అపహాస్యం చేశారు. జగన్ గారిపై 'క్రిస్టియన్' అంటూ ముద్ర వేసి తిరుమలలో డిక్లరేషన్ పేరిట రభస సృష్టించారు. తన రాజకీయ స్వార్థం కోసం విదేశీ భార్య అన్నా కొణిదలను తిరుమలకు పంపి, తలనీలాలు తీయించి వీడియోలతో పబ్లిసిటీ చేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్.. తోడబుట్టిన వారికి ఏం చేశారో చెప్పగలరా?: సొంత చెల్లెలికి వందల కోట్ల ఆస్తులు ఇచ్చిన ఉదార హృదయం వైయస్ జగన్ గారిది. మరి చంద్రబాబు నాయుడు తన సొంత చెల్లెళ్లకు కనీసం తలదాచుకోవడానికి ఇల్లు ఇవ్వకుండా, ఒక్క పూట అన్నం పెట్టకుండా రోడ్డున పడేసింది వాస్తవం కాదా? అలాంటి చంద్రబాబు జగన్ గారి కుటుంబం గురించి మాట్లాడటం హాస్యాస్పదం. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని ఎదిగిన చంద్రబాబు రాజకీయ జీవితం, చివరికి ఆ ఆడవాళ్ల ఉసురు తగిలే అంతమవుతుంది. ప్రజా జీవితంలో ఉంటే ఆదర్శంగా ఉండాలి: ఈ నేపధ్యంలో మీరు ఎన్ని విడాకులు ఇస్తారో మీ ఇష్టం.. కానీ ఉప ముఖ్యమంత్రిగా, పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు కనీస నైతికతతో సమాజానికి ఆదర్శంగా బతకడం నేర్చుకోవాలని లక్ష్మీ పార్వతి హితవు పలికారు. చంద్రబాబు అబద్ధాలకు వత్తాసు పలికే తొత్తుగా మారడం మానుకోవాలన్న ఆమె.. ఇప్పటికైనా వైయస్సార్సీపీ మహిళా నేతల వ్యక్తిత్వ హననం ఆపకపోతే, వైయస్ జగన్ కుటుంబంపై అడ్డగోలు విమర్శలు కొనసాగిస్తే ప్రజలే మీకు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.