తాడేపల్లి: నాడు మెగా డీఎస్సీ పేరుతో 17,427 పోస్టుల భర్తీలో నిరుద్యోగులను దగా చేసిన కూటమి ప్రభుత్వం.. నేడు 23 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా కేవలం 2,721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి మరోసారి నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని వైయస్సార్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రోస్టర్ పాయింట్లు ఆలస్యంగా ప్రకటించడం, జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపులో తీవ్ర అసమానతలు, 2025 డీఎస్సీ నియామకాల్లోని అవకతవకలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రెస్‌మీట్‌లో ఎ.రవిచంద్ర ఇంకా ఏం మాట్లాడారంటే..: రోస్టర్ పాయింట్లు లేకుండా డీఎస్సీ దరఖాస్తులా?: ‘2026 డీఎస్సీకి 2,721 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి నవంబరు 11 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టారు. అక్టోబరు 13న షార్ట్ నోటిఫికేషన్, నవంబర్ 3న పూర్తి నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం, రోస్టర్ పాయింట్లను మాత్రం నవంబరు 10న అర్ధరాత్రి ప్రకటించింది. నోటిఫికేషన్ సమయంలోనే రోస్టర్ పాయింట్లు వెల్లడించాల్సి ఉండగా, వాటిని దాచిపెట్టి దరఖాస్తులు స్వీకరించడం అభ్యర్థులను అయోమయానికి, మానసిక ఇబ్బందులకు గురి చేయడమే. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు, ఏ సామాజిక వర్గానికి ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలియకుండా అభ్యర్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? 23 వేలకుపైగా ఖాళీలు ఉంటే 2,721 పోస్టులేనా?: ఈ 2,721 పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ 906, ఎస్‌జీటీ 1,205, స్పెషల్ ఎడ్యుకేషన్ 350, ప్రిన్సిపల్ 30, పీజీటీ 81, టీజీటీ 113, పీడీ 2, పీఈటీ 34 పోస్టులు మాత్రమే ఉన్నాయి. 26 జిల్లాలకు పోస్టులు పంపిణీ చేస్తే 5 జిల్లాలకు ఒక్క పోస్టు కూడా లేదు. మరో 9 జిల్లాలకు సింగిల్ డిజిట్ పోస్టులే వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 23 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్కూల్ ఎడ్యుకేషన్ నివేదిక చెబుతుంటే కేవలం 2,721 పోస్టులతో సరిపెట్టడం ఎందుకు? ఇంకా వచ్చే నెల, డిసెంబరులో వేలాది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్న పరిస్థితిలో ఖాళీలన్నింటినీ భర్తీ చేయకుండా మరోసారి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. 2025 డీఎస్సీ అవకతవకలకు సమాధానం చెప్పాలి: 2025 మెగా డీఎస్సీలో 17,427 పోస్టులు భర్తీ చేశామని చెప్పిన ప్రభుత్వం.. అందులో 421 స్పోర్ట్స్ కోటా పోస్టుల విషయంలో కటాఫ్ మార్కులు, టెట్, బీఈడీ, పరీక్షల వంటి నిబంధనలను ఎందుకు అమలు చేయలేదు? ఇప్పుడు 2026 డీఎస్సీలో మాత్రం ఈ నిబంధనలన్నీ ఎందుకు పెడుతున్నారు? ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 30 శాతం అర్హత మార్కులు తప్పనిసరి చేశారు. గత డీఎస్సీలో ఇదే నిబంధనలు ఎందుకు లేవు? మెగా డీఎస్సీ పేరుతో జరిగిన అవకతవకలకు సమాధానం చెప్పకుండా 2,721 పోస్టులతో మరో ప్రచార ఆర్భాటానికి తెర తీయడం ఆపాలి. 23 వేలకుపైగా ఖాళీలను ఈ డీఎస్సీలోనే చేర్చి పోస్టుల సంఖ్య పెంచాలి. లేకపోతే పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఎ.రవిచంద్ర హెచ్చరించారు.