ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్ అక్ర‌మం, అన్యాయం

అక్ర‌మాలు చేసిన అధికారుల‌ను వ‌దిలేసి ఆయ‌న‌పై క‌క్ష‌సాధింపా? 

బ్యాలెట్ బాక్సును కాపాడినందుకు జైలుకు పంపడం సిగ్గుచేటు  

వైయ‌స్సార్‌సీపీ నాయ‌కులు ధ్వ‌జం 

గుంటూరు జైలులో ఉన్న వైయ‌స్సార్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పరామ‌ర్శించిన 
అనంత‌రం మీడియాతో మాట్లాడిన పార్టీ నాయ‌కులు. 

బ్యాలెట్ బాక్సు అక్రమ తరలింపును అడ్డుకున్నందుకే లేళ్ల అప్పిరెడ్డిపై అక్రమ కేసులు

తప్పు చేసిన అధికారులను వదిలేసి వైయ‌స్సార్‌సీపీ నేతలను జైలుకు పంపడం హేయం 

ఎమ్మెల్సీకి జైలులో క‌నీస భద్రత, స‌దుపాయాలు కల్పించడంలోనూ కుట్ర‌లు

అప్పిరెడ్డిపై కక్షసాధింపు ఆపాలి.. తప్పుడు కేసులు ఎత్తివేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన వైయ‌స్సార్‌సీపీ నాయ‌కులు, ఎమ్మెల్సీలు 

గుంటూరు: ఎన్నికల సమయంలో బ్యాలెట్ బాక్సును అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్న వైయ‌స్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని జైలుకు పంపడం కూటమి ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయాలకు పరాకాష్ట అని వైఎస్సార్‌సీపీ నాయ‌కులు విమర్శించారు. గుంటూరు సబ్‌జైలులో ఉన్న వైయ‌స్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పార్టీ ఎమ్మెల్సీలు పరామర్శించి సంఘీభావం తెలిపారు. అనంత‌రం మాజీ మంత్రి అంబ‌టి రాంబాబుతో క‌లిసి వారు అక్క‌డే మీడియాతో మాట్లాడారు. బ్యాలెట్ బాక్సును బయటకు తీసుకొచ్చిన అధికారులను వదిలేసి, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నించిన వారిపై హత్యాయత్నం వంటి తీవ్రమైన కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులతో గొంతు నొక్కాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షసాధింపులకు ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు. జైలులో ఉన్న ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి చట్టపరంగా దక్కాల్సిన కనీస సౌకర్యాలు, రక్షణ కూడా కల్పించడంలేద‌ని మండిప‌డ్డారు. బాధ్యులైన అధికారుల తీరుపై త్వరలో ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. లేళ్ల అప్పిరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం న్యాయపోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

లేళ్ల అప్పిరెడ్డిని ప‌రామర్శించిన వారిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, త‌ల‌శిల ర‌ఘురాం, వరుదు కళ్యాణి, సిపాయి సుబ్రహ్మణ్యం, కేఆర్‌జే భరత్, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ యాదవ్, రూహుల్లా, కల్పలతా రెడ్డి, మంగమ్మ, ఇసాక్ బాషా, చంద్రగిరి ఏసురత్నం, మురుగుడు హ‌నుమంత‌రావు, రామ‌చంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. 

నాయ‌కులు ఎవ‌రెవ‌రు ఏం మాట్లాడారంటే... 

● అప్పిరెడ్డిపై మంత్రి లోకేష్‌, కేంద్ర మంత్రి పెమ్మ‌సాని కుట్ర‌లు
- అంబటి రాంబాబు, మాజీ మంత్రి 

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అక్రమ కేసులో ఇరికించి గుంటూరు సబ్‌జైలులో పెట్టిన నేపథ్యంలో ఆయనకు సంఘీభావం తెలిపేందుకు మేమంతా వచ్చాము. ఇది పూర్తిగా తప్పుడు కేసు. అప్పిరెడ్డిని గుంటూరులో ఉంచడానికి కూడా ఇష్టపడకుండా రాజమండ్రి లేదా నెల్లూరు జైలుకు తరలించాలని జైలు అధికారులు కోర్టును ఆశ్రయించడం మరింత దారుణం. ఒక ఎమ్మెల్సీకి జైలులో కనీస భద్రత, చట్టప్రకారం కల్పించాల్సిన సౌకర్యాలు కూడా కల్పించలేమని అధికారులు చెప్పడం దారుణం. దీనివెనుక లోకేష్, పెమ్మసాని ఒత్తిళ్లు ఉన్నాయి. బ్యాలెట్ బాక్సును వ్యాన్ నుంచి ఎందుకు దించారు, ఎలాంటి భద్రత లేకుండా ఎందుకు బయటకు తీసుకొచ్చారు అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. బాక్సును కాపాడేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ నాయకులకు జైలు శిక్షలు, బాక్సును పగలగొట్టేందుకు ప్రయత్నించిన వారిపై మాత్రం చర్యలు లేకపోవడం కూటమి ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని బయటపెడుతోంది. 57వ వార్డులో జరిగిన బ్యాలెట్ బాక్సు విధ్వంసం, పోలీసుల వ్యవహారశైలిపై కూడా సమగ్ర విచారణ జరపాలని ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం. అప్పిరెడ్డిపై పెట్టిన తప్పుడు కేసును ఎత్తివేయడంతో పాటు, పక్షపాతంగా వ్యవహరిస్తున్న దర్యాప్తు అధికారిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాము.

● అక్ర‌మాల‌ను అడ్డుకున్న అప్పిరెడ్డిపై కేసు పెట్ట‌డం హేయం
- తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ 

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిది. ఎన్నికల సమయంలో బ్యాలెట్ బాక్సును తీసుకెళ్తున్న వ్యాన్‌ను నల్లపాడు పరిధిలో ఆపి, అందులో నుంచి బాక్సును ఒక సెక్యూరిటీ సిబ్బంది బయటకు తీసుకురావడాన్ని స్థానికులు, వైఎస్సార్‌సీపీ నాయకులు గుర్తించి అడ్డుకున్నారు. బ్యాలెట్ బాక్సును ఎందుకు బయటకు తీస్తున్నారని ప్రశ్నించిన ప్రజలపై పోలీసులు లాఠీచార్జి చేయడం, అక్కడికి వచ్చిన లేళ్ల అప్పిరెడ్డిని అదుపులోకి తీసుకోవడం దారుణం. ఈ ఘటనలో అసలు తప్పు చేసిన పోలింగ్ సిబ్బందిపై, భద్రత కల్పించడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, అక్రమాలను అడ్డుకున్న వారిపైనే హత్యాయత్నం సహా తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. రాత్రి వరకు ఇది చిన్న గొడవేనని చెప్పిన అధికారులు, తెల్లవారేసరికి హ‌త్యాయ‌త్నం, దోపిడీ వంటి తీవ్రమైన సెక్షన్లు ఎలా పెట్టారో సమాధానం చెప్పాలి. లేళ్ల అప్పిరెడ్డి ఒక ప్రజాప్రతినిధి, ప్రస్తుత ఎమ్మెల్సీ. అయినప్పటికీ ఆయన పట్ల జైలు అధికారులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరం. అప్పిరెడ్డిని జైలులో పెట్టడమే కాకుండా అక్కడ కూడా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు చేయడం కూటమి ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయాలకు నిదర్శనం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారు. 

● త‌ప్పు చేసిన అధికారుల‌ను వ‌దిలేసి అప్పిరెడ్డిపై అక్ర‌మ కేసులు
- వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ 

ఎలాంటి తప్పు చేయని ఒక ఎమ్మెల్సీని అక్రమ కేసులో ఇరికించి రిమాండ్ ఖైదీగా జైలులో పెట్టడం దుర్మార్గం. ఎన్నికల సమయంలో వెంగళాయపాలెంలో పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సును తరలిస్తున్న వ్యాన్ నుంచి ఒక బాక్సును బయటకు తీసుకురావడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. బ్యాలెట్ బాక్సును మార్చే ప్రయత్నం జరుగుతోందనే అనుమానంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు దాన్ని అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. తప్పు చేసిన పోలింగ్ అధికారులను, భద్రత కల్పించని పోలీసులను వదిలేసి, తప్పును ప్రశ్నించిన నాయకులపై కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వ దుర్మార్గపు వైఖరికి నిదర్శనం. నామినేషన్ల నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకు అనేక అక్రమాలకు పాల్పడుతూ మహిళలను సైతం వేధించిన ప్రభుత్వం ఇప్పుడు ప్రశ్నించిన వారిని జైలుకు పంపిస్తోంది. ఇలాంటి అక్రమ కేసులకు, అధికార దుర్వినియోగానికి ప్రజలు 2029 ఎన్నికల్లో కచ్చితంగా సమాధానం చెబుతారు.

Back to Top