తాడేపల్లి: పార్ట్నర్షిప్ సమ్మిట్ల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ కేవలం పబ్లిసిటీ, ఈవెంట్ మేనేజ్మెంట్ రాజకీయాలు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2014–19 మధ్యకాలంలో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలంటూ ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండేళ్లలో రెండు సమ్మిట్లు నిర్వహించినా కనీస స్థాయిలో కూడా పెట్టుబడులు గ్రౌండ్ కాలేదని విమర్శించారు. నవంబర్ 2025 సమ్మిట్‌లో చేసుకున్న రూ.12 లక్షల కోట్ల ఒప్పందాల్లో ఎన్ని వాస్తవ రూపం దాల్చాయి, ఎంతమంది యువతకు ఉద్యోగాలిచ్చారో ప్రభుత్వం దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని, ప్రతి గ్రామ సచివాలయంలో ఆ వివరాలను ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. వైయస్ జగన్ హయాంలో పునాది పడి, నిర్మాణం పూర్తయిన రామయ్యపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టులు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులను తమ ఖాతాలో వేసుకుంటూ, విశాఖలో రూ.30 వేల కోట్ల విలువైన 3 వేల ఎకరాల భూములను 99 పైసలకే రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే... పాత పాటే పాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు: రాష్ట్రంలో గడిచిన రెండున్నర సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు, చేస్తున్న కార్యక్రమాలకు ఎక్కడా పొంతన లేదు. విశాఖపట్నంలో జరుగుతున్న పార్ట్నర్షిప్ సమ్మిట్‌ను ప్రజలందరూ కేవలం ఒక ఈవెంట్ కింద మాత్రమే చూస్తున్నారు తప్ప, రాష్ట్రానికి దీనివల్ల ఒరిగింది ఏమీ లేదని యువత భావిస్తోంది. 2014–19 మధ్య 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పి తీరా చూస్తే కనీసం 1 లేదా 2 శాతం కూడా గ్రౌండ్ కాలేదు. గతేడాది నవంబర్ 2025 సమ్మిట్‌లో రూ.12 లక్షల కోట్ల ఎంఓయూలు చేసుకున్నామని చెప్పారు. మళ్లీ ఈరోజు కూడా ఉదయం నుంచి రూ.12 లక్షల కోట్ల ఒప్పందాలు, 20 లక్షల ఉద్యోగాలంటూ పాత పాటే పాడుతున్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రభుత్వ సొమ్ముతో ప్రచారం చేసుకోవడం చంద్రబాబు గారికి వెన్నతో పెట్టిన విద్య. దమ్ముంటే సచివాలయాల్లో జాబ్ డేటా ప్రదర్శించండి: ఈ ఏడాది సమ్మిట్‌ను పక్కన పెడితే, గతేడాది నవంబర్ 2025లో చేసుకున్న ఒప్పందాల్లో ఎన్ని గ్రౌండ్ అయ్యాయి, ఎన్ని సంస్థలు ప్రొడక్షన్లోకి వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారో ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయగలదా? 2024 ఎన్నికల్లో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని కూటమి ప్రభుత్వం యువతకు హామీ ఇచ్చింది. ఈ రెండున్నరేళ్లలో మీ ఎంఓయూల ద్వారా ఫలానా గ్రామంలో ఫలానా యువకుడికి ఉద్యోగం ఇచ్చామని నిరూపిస్తూ ప్రతి సచివాలయంలో ఆ డాక్యుమెంట్‌ను డిస్ప్లే చేయగలరా? అని రాష్ట్ర యువత ప్రశ్నిస్తోంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా తీసుకొచ్చిన ఏ కంపెనీ ఆపరేషన్లోకి వచ్చిందో చెప్పే దమ్ము ధైర్యం మీకుందా?" వైయస్ జగన్ హయాం ప్రాజెక్టులే మీ ప్రచారానికి ఆధారం: నేడు వేదికల మీద తండ్రి, కొడుకులు ఇద్దరూ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, బ్లూ ఎకానమీ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఎవరి హయాంలో జరిగాయి? రామయ్యపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టులకు నిధులు తెచ్చి, ఫైనాన్షియల్ క్లోజర్ చేసి, నిర్మాణాలను ఒక స్థాయికి తెచ్చింది వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వమే. మచిలీపట్నం పోర్టుకు అడ్డంకులు సృష్టించి కోర్టులకు వెళ్లినా, 2023 మే మాసంలో పునాదులు వేసి నిర్మాణం మొదలుపెట్టాం. 2023 మేలో పునాది వేసి, 2026 నాటికి పూర్తి చేస్తామని చెప్పిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మేమే అందుబాటులోకి తెచ్చాం. వైయస్ జగన్ గారు పూర్తి చేసిన పనులకు మీరు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ మీ ఖాతాలో వేసుకుంటున్నారు. పారిశ్రామిక కారిడార్లలో నాడు ఏపీ నంబర్ వన్: వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉంటే, విశాఖపట్నం-చెన్నై, బెంగళూరు-చెన్నై, బెంగళూరు-హైదరాబాద్ కారిడార్లతో మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'లో వరుసగా మూడు నాలుగేళ్లు ఏపీని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టిన ఘనత జగన్ దే. కానీ నేడు రాష్ట్రంలో నిరుద్యోగ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. ఇదే ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. 99 పైసల భూకేటాయింపులతో రూ.30 వేల కోట్ల స్కామ్: మరోవైపు విశాఖపట్నంలో గడిచిన రెండున్నరేళ్లలో 25 వేల నుంచి 30 వేల కోట్ల రూపాయల విలువైన 3 వేల ఎకరాలకు పైగా భూములను 99 పైసలకే ఊరు పేరు లేని కంపెనీలకు, చంద్రబాబు గారి రియల్ ఎస్టేట్ పార్ట్నర్స్కు కట్టబెట్టారని.. ఇది దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణమని అమర్నాధ్ మండిపడ్డారు. దీనివల్ల రాష్ట్రానికి ఒక్క రూపాయి పెట్టుబడి గానీ, ఒక్కరికి ఉద్యోగం గానీ రాలేదని... సమ్మిట్ అయినా, యోగా అయినా, తుఫాన్ అయినా సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లతో ప్రచారం చేసుకుంటూ ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారని తేల్చి చెప్పారు. సమ్మిట్ ముగిశాక రేపు పూర్తి వివరాలతో ప్రభుత్వం చెప్పిన అబద్ధాలను ప్రజల ముందు ఎండగడతామన్నారు. ఇప్పటికైనా ప్రచార ఆర్బాటాలు మానుకుని, వాస్తవంలోకి వచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించాలని.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు.