విజయవాడ: రాష్ట్రంలో గత విడత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నామినేషన్ కేంద్రాల వద్ద దాడులకు పాల్పడటం, నామినేషన్ పత్రాలను చింపివేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్న నేపధ్యంలో... త్వరలో జరగనున్న మిగిలిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు తగిన రక్షణ కల్పించాలని, గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. కేవలం పల్నాడు జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఎంపీటీసీ స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాని పరిస్థితి ఏర్పడిందని ఎస్ ఈ సీకి గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్, కౌంటింగ్ ప్రతి దశలోనూ పారదర్శకత పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విజయవాడలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని వైయస్సార్సీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి, గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎవరేమన్నారంటే.. పల్నాడులో నామినేషన్ వేయకుండా దాడులు చేశారు - డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఇటీవల నరసరావుపేట నియోజకవర్గంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్లు వేయనీయకుండా వందలాది మంది టీడీపీ గూండాలు కర్రలు, రాళ్లు, రాడ్లతో నామినేషన్ కేంద్రాల వద్దే ఉండి మాపై దాడులకు పాల్పడ్డారు. రొంపిచర్ల మండలంలో నామినేషన్ వేయడానికి వెళ్లిన పొలిమేర నాగిరెడ్డి, పొలిమేర వెంకట్ రెడ్డి, పొలిమేర విజయలక్ష్మిలను కొట్టి వెనక్కి పంపించారు. పల్నాడు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఏకంగా 6 నియోజకవర్గాల్లో ఎంపీటీసీ స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా వేసే పరిస్థితి లేకుండా పోయింది. మాకు రక్షణ కల్పించాలని కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీలకు అర్జీలు ఇచ్చి, ఫోన్లు చేసినా ఫలితం లేకపోయింది. ఈ అరాచకాలపై 23వ తేదీ ఉదయం నుండి నరసరావుపేట పార్టీ కార్యాలయంలో నేను ఆమరణ నిరాహార దీక్షకు దిగితే, నామినేషన్ గడువు ముగిసే సాయంత్రం 5 గంటలకు ముందు, సరిగ్గా 4:20 గంటలకు డీఎస్పీ వచ్చి నామినేషన్ వేయిస్తామని చెప్పారు. కానీ దారిలో టీడీపీ వాళ్లు ట్రాక్టర్లు, జీపులు అడ్డుపెట్టి రాళ్లు విసిరినా, దాడులు చేసినా తమకు సంబంధం లేదని పోలీసులు చేతులెత్తేశారు. ఇప్పుడు రెండో విడతలో నరసరావుపేట మున్సిపాలిటీతో పాటు పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మళ్లీ పాత పద్ధతిలోనే నామినేషన్ కేంద్రాలకు రానీయకుండా అడ్డుకోవడం, బలమైన అభ్యర్థుల నామినేషన్లను స్క్రూటినీలో తిరస్కరించడం, పోలింగ్ మరియు కౌంటింగ్ కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడటం వంటివి జరగకుండా చూడాలి. ఇన్ని అరాచకాలు సృష్టించి గెలవడం అసలు గెలుపేనా అని చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నాను. 'ఇంత గొడవ ఎందుకు, మీరే నేరుగా నామినేట్ చేసుకోండి' అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు అక్రమాలతో గెలిచిన వారందరి చేత 2029లో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీనామాలు చేయించి, తిరిగి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాను. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలి నలమారు చంద్రశేఖర్ రెడ్డి, వైయస్సార్సీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు. మిగిలిపోయిన నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఈ రోజు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 14 నుండి 16 వరకు నామినేషన్లు, 26న పోలింగ్, 30న కౌంటింగ్ జరగనుంది. త్వరలోనే సర్పంచ్ ఎన్నికలకు కూడా షెడ్యూల్ రానుంది. గత విడత ఎన్నికల్లో జరిగిన దౌర్జన్యాలను కమిషనర్ గారికి గుర్తు చేస్తూ, ఈసారైనా ఎన్నికల సంఘం తన బాధ్యతను నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని కోరాం. పోటీ చేయాలనుకునే అభ్యర్థులను ఎక్కడా అడ్డుకోకుండా నామినేషన్లు దాఖలు చేసేలా చూడాలి. గతంలో మాదిరిగా స్క్రూటినీ సమయంలో అక్రమంగా నామినేషన్లను తిరస్కరించకుండా, అభ్యర్థి స్వయంగా వచ్చి ఉపసంహరించుకుంటే తప్ప మరే విధంగానూ నామినేషన్ చెల్లకుండా పోయే పరిస్థితి రాకూడదు. ప్రచార సమయంలోనూ, పోలింగ్ రోజున ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా రక్షణ కల్పించాలి. పోయినసారి టీడీపీ గూండాలతో పాటు కొందరు ఎన్నికల అధికారులు, పోలీసులు కలిసి ఓటర్లను అడ్డుకుని, దాడులు చేసి, తిరిగి బాధితులపైనే అక్రమ కేసులు పెట్టారు. రాబోయే కార్పొరేషన్, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతలను కాపాడేలా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశాం. పక్షపాత అధికారులకు భవిష్యత్తులో శిక్ష తప్పదు. అంకంరెడ్డి నారాయణమూర్తి, వైయస్సార్సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు గత ఎన్నికల్లో నామినేషన్ల నుండి స్క్రూటినీ, ఉపసంహరణ, పోలింగ్, కౌంటింగ్ వరకు ప్రతి దశలోనూ నిబంధనలను ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఆ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, రాబోయే మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లోనైనా ఆ తప్పులు జరగకుండా గ్రామ స్వరాజ్యాన్ని కాపాడాలని కమిషనర్‌ను కోరాం. ఈ సందర్భంగా మూడు ముఖ్య విషయాలను గుర్తు చేస్తున్నాను. మొదటిది.. ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలి. అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సింది పోయి, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే రేపు అది మీ మెడకే చుట్టుకుంటుంది. రెండోది.. ఎన్నికల విధుల్లో పక్షపాతంగా వ్యవహరిస్తున్న అధికారుల వివరాలు మా వద్ద ఉన్నాయి. పారదర్శకంగా ఎన్నికలు జరపకపోతే రేపు వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చి, జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మూడోది.. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు అధికారం ఉందని బరితెగించి, డబ్బు, ప్రలోభాలు, దౌర్జన్యాలతో గెలిచినా ఆ పదవులు నిలబడవు. రేపు ప్రజలే తిరగబడతారు, మీరు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది.