ప్రచార ఆర్బాటంతో ప్రజలకు వంచన

సమ్మిట్స్‌ పేరుతో మభ్య పెడుతున్న కూటమి

పుత్తా శివశంకర్‌ ఫైర్‌

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌.

దారుణంగా దిగజారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి

అందుకు కాగ్, ఈఆర్‌సీ గణాంకాలే సాక్ష్యం

ఆర్థిక క్రమశిక్షణ లోపించి తిరోగమనంలో రాష్ట్రం

కూటమి పాలనపై పుత్తా శివశంకర్‌ ధ్వజం

తాడేపల్లి: వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ ధ్వజమెత్తారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేక కూటమి నేతలు, ఎల్లో మీడియా, లేని అభివృద్ధిని ప్రచారం చేస్తూ ప్రజలను వంచిస్తున్నాయని ఆయన వెల్లడించారు. సమ్మిట్స్, లక్షల కోట్ల పెట్టుబడులంటూ ప్రచారం చేస్తూ, ప్రజలను మభ్యపెడుతూ వాస్తవాలను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన తెలిపారు. అందుకు కాగ్, ఈఆర్‌సీ గణాంకాలే సాక్ష్యమని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పుత్తా శివశంకర్‌ గుర్తు చేశారు.
ప్రెస్‌మీట్‌లో పుత్తా శివశంకర్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

ఆర్థిక దుస్థితికి ఆ మూడు అంశాలే గీటురాయి:
    ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అతలాకుతలమైంది. ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుందా లేక తిరోగమనంలో ఉందా అని తెలుసుకోవడానికి విద్యుత్‌ డిమాండ్, ప్రభుత్వ సొంత పన్నుల  ఆదాయం, నిరుద్యోగ రేటు అనే మూడు ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటి ప్రకారం చూస్తే, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇది ఏదో ఆశామాషీగా మేము చెబుతున్న మాటలు కావు. కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌), రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) గణాంకాలే అందుకు సాక్ష్యం.

తగ్గిన విద్యుత్‌ డిమాండ్‌:
    ఏపీఈఆర్‌సీ లెక్కల ప్రకారం 2023–24లో డిస్కమ్‌ల ద్వారా 71,722 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ విక్రయాలు జరిగితే, 2025–26 ఆర్థిక సంవత్సరానికి అది 70,885 మిలియన్‌ యూనిట్లకు పడిపోయింది. అలాగే విద్యుత్‌ డిస్పాచ్‌ 2023–24లో 79,758 మిలియన్‌ యూనిట్లు ఉండగా, 2025–26 నాటికి 78,546 మిలియన్‌ యూనిట్లకు తగ్గింది. అంటే మా హయాంతో పోలిస్తే నేడు 1,212 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ తగ్గిపోయింది. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు అయితే, ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే విద్యుత్‌ వినియోగం పెరగాలి కానీ తగ్గదు కదా? దీన్నిబట్టే కొత్త పరిశ్రమల స్థాపన అనేది కేవలం ప్రచార ఆర్బాటం మాత్రమేనని స్పష్టమవుతోంది.

0.15 శాతానికి పడిపోయిన సొంత ఆదాయ వృద్ధి:
    ఆర్థిక వ్యవస్థ బాగుంటే రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్‌) కనీసం 10 నుంచి 12 శాతం ఉండాలి. కానీ కాగ్‌ గణాంకాల ప్రకారం 2023–24లో రూ. 85,922.36 కోట్లుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్నుల ఆదాయం 2025–26 నాటికి కేవలం రూ. 86,552 కోట్లకు మాత్రమే చేరింది. అంటే సీఏజీఆర్‌ కేవలం 0.15 శాతం మాత్రమే. రాష్ట్రంలో ఆదాయాలు పూర్తిగా పడిపోయాయని, ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?. 

నిరుద్యోగంలో దేశంలోనే 3వ స్థానం:
    తొలిరోజు నుంచే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని ముఖ్యమంత్రి సహా కూటమి నేతలు ఊదరగొడుతున్నారు. కానీ జాతీయ లేబర్‌ గణాంకాల ప్రకారం 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నిరుద్యోగ రేటులో దేశంలోనే ఏపీ 4వ స్థానంలో ఉండగా, రెండో త్రైమాసికానికి వచ్చేసరికి మరింత దిగజారి 3వ స్థానానికి ఎగబాకింది. నిజంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే.. ఏ గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో ఎవరికి ఉద్యోగాలు వచ్చాయో, పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లింపుల లెక్కలు చూపగలరా? 20 లక్షలు కాదు కదా, కనీసం 20 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన జాబితా అయినా బయటపెట్టగలరా?.

సమ్మిట్స్‌ పేరుతో డైవర్షన్‌ పాలిటిక్స్‌:
    ఎన్నికల హామీల ఎగవేతపై ప్రజల్లో చర్చ జరగకుండా దృష్టి మళ్లించేందుకు సమ్మిట్స్, విదేశీ రోడ్‌ షోల పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఎవరి డబ్బా వారు కొట్టుకోవడం తప్ప వచ్చిన పెట్టుబడులు శూన్యం. రిలయన్స్‌ సంస్థ లక్షల కోట్లు పెట్టుబడి పెడుతోందని ఎల్లో మీడియాలో రాశారు కానీ, కనీసం ఆ సంస్థ ప్రతినిధి వచ్చి ఎంఓయూ చేసుకున్న ఫోటో కూడా లేదు. గ్రోత్‌ ఇంజన్, క్వాంటం, ఏఐ అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని పుత్తా శివశంకర్‌ ఆక్షేపించారు.  
 

Back to Top