నెల్లూరు: కూటమి ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు ఫీజులు చెల్లించలేక బలవన్మరణాలకు పాల్పడే దుస్థితి నెలకొందని వైయస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. అమరావతి నిర్మాణాలకు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న కూటమి ప్రభుత్వం, విద్యార్థుల చదువులను మాత్రం గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. నెల్లూరు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫీజుల ఒత్తిడి కారణంగా చిత్తూరులో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన అత్యంత బాధాకరమన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన పథకాలు సక్రమంగా అమలయ్యాయని, నేడు కూటమి ప్రభుత్వంలో ఆ పథకాలు పూర్తిగా నీరుగారిపోయాయని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు రూ. 9,600 కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్ల కోసం, ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్నా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమై రోడ్డున పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని, లేనిపక్షంలో విద్యార్థులక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం: చిత్తూరు జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఫీజుల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. విద్యార్థులు చదువుకోవాల్సిన వయసులో ఫీజులు కట్టలేక, కళాశాలల ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణాలు తీసుకునే పరిస్థితి రావడం దురదృష్టకరం. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న చంద్రబాబు ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఫీజులు చెల్లించలేదనే కారణంతో హాల్‌టికెట్లు ఇవ్వకుండా, పరీక్షలకు అనుమతించకుండా, సర్టిఫికెట్లు నిలిపివేస్తూ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారు. ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించకపోవడంతో ఆ భారాన్ని పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మోయాల్సి వస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన పథకాల కింద 2024 నుంచి ఇప్పటివరకు సుమారు రూ.9600 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఇంత భారీ మొత్తంలో బకాయిలు పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం ప్రభుత్వానికి తగదు. వెంటనే ఈ బకాయిలన్నీ విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి. హామీ ప్రకారం పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలి: వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకాన్ని వైఎస్ జగన్ గారు సీఎం అయ్యాక దాన్ని మరింత బలోపేతం చేసి విద్యార్థులకు అండగా నిలిచారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో పెట్టిన బకాయిలతో సహా రూ.4,100 కోట్లను 2020 ఏప్రిల్ 28న వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది. ప్రతి త్రైమాసికానికి సుమారు రూ.700 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఏటా వసతి దీవెన కింద రూ.1,100 కోట్లు చెల్లిస్తూ విద్యార్థుల చదువులకు భరోసా కల్పించింది. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు బకాయిలు చెల్లించడం లేదు? టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదు? నాడు–నేడు ద్వారా 45,975 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి, విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి, నేటి ప్రభుత్వానికి మధ్య తేడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిలిచిపోయిన పనులను పూర్తి చేయకుండా, విద్యార్థులకు అవసరమైన కనీస సౌకర్యాలను కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నంపై సమగ్ర విచారణ జరపాలి: చిత్తూరు విద్యార్థి ఆత్మహత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఫీజుల బకాయిల కారణంగా ఏ విద్యార్థికీ హాల్‌టికెట్, సర్టిఫికెట్ నిలిపివేయకుండా ప్రభుత్వం తక్షణ ఆదేశాలు ఇవ్వాలి. పెండింగ్ బకాయిల చెల్లింపునకు స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలి. విద్యార్థుల జీవితాలకు భరోసా కల్పించలేని నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా కొనసాగే అర్హత లేదు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడటంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం, నారా లోకేష్ ఈ పరిస్థితికి బాధ్యత వహించాలి. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ వారి పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.