పంచాయతీ ఎన్నికల్లోనైనా అక్రమాలకు తావివ్వొద్దు

ఎన్నికల వ్యవస్థను దెబ్బతీస్తే రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదం

బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పష్టీకరణ

నంద్యాల జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో డీఐజీ కోయ ప్రవీణ్‌కు వినతిపత్రం అందజేసిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌. ఎమ్మెల్సీ ఇషాక్‌బాషా, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి తదితరులు.

అనంతరం కర్నూలు డీఐజీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌. వైయస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి.

రాబోయే పంచాయతీ ఎన్నికలు న్యాయబద్ధంగా..

చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి

ఆ బాధ్యత ప్రభుత్వంపై ఉంది

తేల్చి చెప్పిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

కర్నూలు: ఎన్నికల వ్యవస్థను దెబ్బతీస్తే రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికలైనా ప్రజాస్వామ్యబద్ధంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో రాజకీయ జోక్యానికి తావులేకుండా ప్రతి అభ్యర్థికి సమాన అవకాశం కల్పించాలని, ప్రజలు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితులు కల్పించాలని కోరారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలు పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
    ఈ మేరకు నంద్యాల జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం డీఐజీ కార్యాలయం వెలుపల మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, నంద్యాల జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మీడియాతో వైయస్సార్‌సీపీ నేతలు ఏమన్నారంటే..
 
వ్యవస్థను దెబ్బతీస్తే తిరిగి సరిచేయడం కష్టం
:బుగ్గన రాజేంద్రనాథ్‌. మాజీ మంత్రి

    ఒకప్పుడు బీహార్, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో హింస, అక్రమాలు జరుగుతాయని వినేవాళ్లం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లోని పరిషత్, మున్సిపాలిటీల్లో కనిపించడం ప్రజాస్వామ్యానికి, రాష్ట్ర భవిష్యత్తుకు, బ్రాండ్‌ ఆంధ్రాకు మంచిది కాదు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలైనా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రాజకీయ నాయకులు, అధికారులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ శాశ్వతంగా ఉండేది వ్యవస్థ మాత్రమే. వ్యవస్థ ఒక్కసారి దెబ్బతింటే దాన్ని తిరిగి సరిచేయడం అంత సులభం కాదు. ప్రజలు కూడా అన్నింటినీ గమనిస్తూనే ఉంటారు. 

వ్యవస్థను కాపాడటం అందరి బాధ్యత:
    ఎన్నికల వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలతో పాటు అధికారులకు, న్యాయ వ్యవస్థకు కూడా ఉంది. ఈ మూడు వ్యవస్థల్లో ఎక్కడ వైఫల్యం జరిగినా దాని ప్రభావం ప్రజాస్వామ్యంపై పడుతుంది. ప్రజలు చూస్తూ ఉంటారు, దెబ్బతిన్న వ్యవస్థను తిరిగి సరిచేయడానికి చాలా సమయం పడుతుంది. అందుకే రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ప్రయోజనం, వ్యవస్థ ప్రయోజనం, రాష్ట్ర ప్రయోజనం కోసం కచ్చితంగా పద్ధతిగా, చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి. ఎన్నికల వ్యవస్థను కాపాడేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి. 

ఫ్రీ అండ్‌ ఫెయిర్‌గా పంచాయతీ ఎన్నికలు జరగాలి
:కాటసాని రాంభూపాల్‌రెడ్డి. నంద్యాల జిల్లా వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు

    గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫ్రీ అండ్‌ ఫెయిర్‌గా జరగాలి. ప్రతి గ్రామంలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి. గత మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కనిపించిన పరిస్థితులు పునరావృతం కాకూడదు. ఈ అంశాలపై డీఐజీకి  వినతిపత్రం ఇచ్చాం. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశం కల్పించాలని, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితులు కల్పించాలని కోరాం. ఫ్యాక్షన్‌∙ప్రభావిత గ్రామాల్లో అన్ని వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడి సమస్యలు పరిష్కరించి ఎన్నికలు నిర్వహించాలి. సమస్య లేని గ్రామాల్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎన్నికలు జరగాలి. ఇది పార్టీ గుర్తుల కోసం చేసే పోరాటం కాదు.. ప్రజల ఓటు హక్కు కోసం చేసే విజ్ఞప్తి. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేలా అధికారులు వ్యవహరించాలి.

Back to Top