కూటమి పాలనలో భ్రష్టు పట్టిన విద్యా వ్యవస్థ.. 

విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం:

ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి. 

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి. 

సీఎం సొంత జిల్లా చిత్తూరులోనే విద్యార్థుల ఆందోళన.. 

రూ. 9,100 కోట్ల ఫీజు బకాయిలు తక్షణమే చెల్లించాలి.  

శాసనమండలిలో ఇచ్చిన హామీని విస్మరించిన విద్యాశాఖ మంత్రి లోకేష్..
 
యాజమాన్యాల వేధింపులను అరికట్టాలి:

కల్పలతా రెడ్డి డిమాండ్. 

తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం వారి భవిష్యత్తుతో ఆడుకుంటోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో  నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఫీజు బకాయిల కారణంగా కళాశాలలకు ఫీజులు కట్టలేక స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులోనే విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. గతంలో శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు సర్టిఫికెట్లు ఆపొద్దని, బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన మాట తప్పారని, ఆయన వైఫల్యం వల్లే నేడు విద్యార్థులు వేధింపులకు గురవుతున్నారని ఆమె ప్రశ్నించారు. తక్షణమే రూ. 9,100 కోట్ల పెండింగ్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 
ఇంకా ఏమన్నారంటే..

సీఎం సొంత జిల్లా చిత్తూరులోనే విద్యార్థుల ఆందోళన:

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాలను వెన్నుపోటు పొడుస్తూ, ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తును కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చింది. దీనికి నిదర్శనం నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో జరిగిన ఘటనే. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, పరీక్షలకు అనుమతించడం లేదని విద్యార్థులు రోడ్డెక్కారు. తన సొంత జిల్లాలో విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే సీఎం చంద్రబాబు గానీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ గానీ కనీసం సమీక్ష నిర్వహించారా? ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసే పరిస్థితికి వచ్చామని విద్యార్థులే స్వయంగా చెబుతుంటే ప్రభుత్వానికి పట్టదా?. 

రూ. 9,100 కోట్ల బకాయిలతో 10 లక్షల మంది విద్యార్థుల అవస్థలు:

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక రోడ్లెక్కారు. చదువులు మధ్యలోనే ఆగిపోతాయేమోనని తల్లిదండ్రులు భయాందోళన చెందుతుండగా, కొందరు విద్యార్థులు కూలీ పనులకు వెళ్లే దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఒకవైపు 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తూ, అమరావతిలో నీళ్లు తోడటానికే వేల కోట్లు ఖర్చు పెడుతోంది. కానీ విద్యా దీవెన, వసతి దీవెన కలిసి మొత్తంగా రూ. 9,100 కోట్ల బకాయిలను చెల్లించడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టిన ప్రభుత్వం ఇదే.

గత ప్రభుత్వంలో ఎక్కడా పెండింగ్ లేకుండా చెల్లింపులు:

వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడా పెండింగ్ లేకుండా సకాలంలో అమలు చేసింది. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో ప్రతి ఏటా విద్యా దీవెన, వసతి దీవెన నిధులను విడుదల చేశారు. చివరి విడత నిధులను కూడా ఎన్నికల కోడ్ సాకుతో అడ్డుకున్నది ఈ కూటమి నేతలే. అధికారంలోకి రాగానే యాజమాన్యాలకు వెంటనే ఫీజులు చెల్లిస్తామని గొప్పలు చెప్పి, నేడు పూర్తిగా చేతులెత్తేశారు.

శాసనమండలిలో ఇచ్చిన హామీ ఏమైంది లోకేష్?:

రాష్ట్రంలో విద్యార్థులు పడుతున్న సమస్యలు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి తెలియదా? సర్టిఫికెట్లు అందకపోవడం వల్ల ఉన్నత చదువులకు, విదేశాల్లో ఎంఎస్ చేయాలనుకునే విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతోంది. గతంలో శాసనమండలిలో మేము ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు.. సర్టిఫికెట్లు ఆపొద్దని యాజమాన్యాలకు ఆదేశాలిచ్చామని, పరీక్షలకు అనుమతిస్తారని మంత్రి లోకేష్ చెప్పారు. మరి నేడు ఎందుకు యాజమాన్యాలు పిల్లలను టార్చర్ చేస్తున్నాయి? ప్రభుత్వం తన వద్ద ఉన్న బకాయిలను చెల్లిస్తేనే కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను వేధించకుండా ఉంటాయి. ఈ వైఫల్యానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే.

బకాయిల చెల్లింపుపై స్పష్టమైన ప్రణాళిక ప్రకటించాలి:

ఒకవైపు లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు అంటూ ప్రచారం చేసుకుంటూ.. మరోవైపు విద్యార్థుల చేతికి సర్టిఫికెట్లు అందకుండా చేస్తే వారికి ఉద్యోగాలు ఎలా వస్తాయి? కూటమి పాలనలో విద్యాశాఖ పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. విద్యా దీవెన, వసతి దీవెన కింద ఎంత మొత్తం బకాయిలు ఉన్నాయో, వాటిని ఏ తేదీలోగా విడుదల చేస్తారో ప్రభుత్వం ఒక నిర్దిష్ట ప్రణాళికను ప్రకటించాలి. చిత్తూరు ఘటనను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని కళాశాలలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ విద్యార్థుల పక్షపాతిగా నిలిచారని కల్పలతా రెడ్డి స్పష్టం చేశారు. 

ఈ నేపథ్యంలో తక్షణమే రూ. 9,100 కోట్ల బకాయిలను చెల్లించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆమె డిమాండ్ చేసారు.

Back to Top