పంచాయ‌తీ ఎన్నిక‌లు నిష్పక్ష‌పాతంగా జ‌రిగేలా చూడాలి

వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలి

 ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలి

 ప్రతిపోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

 వైఎస్సార్‌సీపీ నాయకుల డిమాండ్ 

మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు నేతృత్వంలో ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌ని క‌లిసి డిమాండ్ల‌తో కూడిన విన‌తిప‌త్రం అంద‌జేత  

 విజ‌య‌వాడ‌: రాష్ట్రంలో ఇటీవ‌ల ముగిసిన మున్సిపల్, ప‌రిష‌త్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దాడులు, బెదిరింపులు, పోలీసుల వైఫల్యాలు, ప్రభుత్వ అధికారుల ఏకపక్ష వ్యవహారాలు గ్రామపంచాయతీ ఎన్నికల్లో పునరావృతం కాకుండా చూడాలని వైఎస్సార్‌సీపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ నాయ‌కులు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌ని క‌లిసి అధికార కూట‌మి అక్ర‌మాల‌పై ఫిర్యాదు చేసిన అనంత‌రం అక్క‌డే మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అవి నిరంతరం పనిచేసేలా చూడాలని కోరారు. గతంలో దాడులను ప్రోత్సహించిన మంత్రులపై నియంత్రణ విధించాలని, పోలీసు, రెవెన్యూ, జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గ్రామపంచాయతీ ఏకగ్రీవాల ప్రోత్సాహకాల పేరుతో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులందరూ ఏకగ్రీవం కావాలనే నిబంధన విధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధానాలకు స్వస్తి పలికి, రాబోయే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు స్పష్టం చేశారు. మ‌ల్లాది విష్ణు, అంకంరెడ్డి నారాయ‌ణ మూర్తితోపాటు ఎస్ఈసీని క‌లిసిన వారిలో పార్టీ బూత్ క‌మిటీ రాష్ట్ర అధ్య‌క్షుడు కొండ‌మ‌డుగుల సుధాక‌ర్ రెడ్డి, పార్టీ సంయుక్త కార్య‌ద‌ర్శి నారాయ‌ణ‌రెడ్డి, త‌దిత‌రులు ఉన్నారు. 

నాయ‌కులు ఎవ‌రెవ‌రు ఏం మాట్లాడారంటే...

ఆ జీవో ప్ర‌జాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం
- మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే 

రాష్ట్రంలో ఇటీవ‌ల ముగిసిన మున్సిపల్, ప‌రిష‌త్ ఎన్నికల సందర్భంగా రాయచోటి, జమ్మలమడుగు, పులివెందుల, ప్రొద్దుటూరు, పల్నాడు తదితర ప్రాంతాల్లో గతంలో జరిగిన దాడులు, బెదిరింపులను దృష్టిలో పెట్టుకుని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత కల్పించాలని ఎస్ఈసీ ని కోర‌డం జ‌రిగింది. మున్సిపల్, ప‌రిష‌త్ ఎన్నికల సంద‌ర్భంగా జరిగిన శాంతిభద్రతల ఉల్లంఘనలు, పోలీసుల వైఫల్యాలు, ప్రభుత్వ అధికారుల ఏకపక్ష వ్యవహారాలు గ్రామపంచాయతీ ఎన్నికల్లో పునరావృతం కాకుండా చూడాలని చెప్పాం. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా నామినేషన్లు దాఖలు చేసుకునేలా పోలీసు రక్షణ కల్పించాలి. గతంలో జరిగిన దాడుల్లో మంత్రులే ప్రత్యక్షంగా, మ‌రికొన్ని చోట్ల‌ పరోక్షంగా ప్రోత్సహించిన పరిస్థితులు ఉన్నందున, వారి జోక్యాన్ని అరికట్టి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ గత ఎన్నికల్లో అనేక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పనిచేయలేదు, రికార్డింగ్ కూడా జరగలేదు. ఈసారి ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పనిచేసేలా చూడాలి. పంచాయతీ ఏకగ్రీవాల ప్రోత్సాహకాల పేరుతో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులందరూ ఏకగ్రీవం కావాలనే కొత్త నిబంధన తీసుకురావడం అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీకి పంచాయతీలను పూర్తిగా అప్పగించేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏకగ్రీవ ప్రోత్సాహక నగదును విడతలవారీగా చెల్లిస్తామంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఎస్ఈసీకి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పోలీసుల తీరులో మార్పు రావడం లేదు, దాడులు ఆగడం లేదు. ఇకనైనా పోలీసు, రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగడం లేదని, సెలక్షన్లు జరుగుతున్నాయని, బ్యాలెట్‌తో కాకుండా బుల్లెట్లతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని జాతీయ స్థాయిలో విమర్శలు వస్తున్నా ప్రభుత్వం తీరు మార్చుకోవడం లేదు. కనీసం గ్రామపంచాయతీ ఎన్నికలైనా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.

జీవోతో దౌర్జ‌న్యాల‌కు చ‌ట్ట‌బ‌ద్ద క‌ల్పించిన‌ట్టుంది
- అంకంరెడ్డి నారాయణమూర్తి, పార్టీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు 

రాష్ట్రంలో గత ఎన్నికల సందర్భంగా జరిగిన అక్రమాలు, దాడులు, బెదిరింపులు, అధికారుల ఏకపక్ష వైఖరిపై ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు మరోసారి ఫిర్యాదు చేశాం. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి మార్పు కనిపించడం లేదు, పోలీసుల వ్యవహారశైలి మారడం లేదు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఏకగ్రీవాల పేరుతో అధికార పార్టీ దౌర్జన్యాలకు చట్టబద్ధత కల్పించే ప్రయత్నం జరుగుతోంది. ఎన్నికల కమిషన్ కేవలం సమావేశాలు నిర్వహించడం కాకుండా, రాయలసీమ, పల్నాడు సహా సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతిభద్రతలు కాపాడేలా పోలీసు, రెవెన్యూ అధికారులకు కఠినమైన ఆదేశాలు ఇవ్వాలి. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంది. రాబోయే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం.

Back to Top