విజయవాడ : బాలల దినోత్సవం సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 69వ డివిజన్ లక్ష్మీనగర్ నెహ్రూ బొమ్మ సెంటర్లో భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ విగ్రహానికి వైయస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. “నేటి బాలలే రేపటి పౌరులు. వారి హక్కులు, కలలు, ఆలోచనలకు భద్రత కల్పిస్తూ విద్య, సాధికారత ద్వారా వారిని దేశానికి విలువైన సంపదగా తీర్చిదిద్దాలి” అని అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పిల్లల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పలు సంక్షేమ, విద్యా కార్యక్రమాలను అమలు చేసిందని మల్లాది విష్ణు తెలిపారు. పేద విద్యార్థుల చదువుకు జగనన్న అమ్మఒడి ద్వారా తల్లులకు ఆర్థిక సహాయం, నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి చేపట్టారని వివరించారు. జగనన్న గోరుముద్ద, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించారని తెలిపారు. విద్యా కానుక ద్వారా యూనిఫాం, పుస్తకాలు, బ్యాగులు, షూస్, ట్యాబ్‌లతో విద్యా సామగ్రి అందించామని చెప్పారు. విద్యా దీవెన ద్వారా అర్హులైన విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ తదితర కోర్సులు చదివే విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించామని మల్లాది విష్ణు తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా బాలల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేశామని అన్నారు. రాష్ట్రంలోని బాలబాలికలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మల్లాది విష్ణు.. ప్రతి చిన్నారి ఆరోగ్యంగా, ఆనందంగా, ఉన్నత విద్యను అభ్యసిస్తూ జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ నాయకులు కమిలి రత్నాకర్, కేఎస్ఆర్ నాయుడు, సాంబ, బుజ్జి, అలుగోలు కరుణాకర్, నరసింహారెడ్డి, రాంబాబు, దాసరి చిన్నారావు, మజ్జి కుమార్, శ్రీనివాసరావుతో పాటు స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.