పంచాయతీ ఎన్నికల్లో ఒక్క సర్పంచ్‌, వార్డు స్థానం కూడా పోటీ లేకుండా వదలొద్దు

ప్రతి గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారులు బరిలో ఉండాలి.. సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఒక్క సర్పంచ్‌, వార్డు స్థానం కూడా పోటీ లేకుండా వదలొద్దని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని పార్టీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. శనివారం పార్టీ పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.

 ప్రతి గ్రామంలో బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలి

పంచాయతీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారులు తప్పనిసరిగా పోటీలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సజ్జల సూచించారు. రిజర్వేషన్లు, స్థానిక సామాజిక సమీకరణలు, ప్రజాబలం, నాయకత్వ సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి స్థానంలో గట్టి పోటీ ఇవ్వడం ముఖ్యమని స్పష్టం చేశారు.

 అక్రమాలను ధైర్యంగా ఎదుర్కోవాలి

ఇటీవల జరిగిన మున్సిపల్‌, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు రాజకీయ ప్రత్యర్థులతో పాటు అధికార యంత్రాంగం నుంచి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని సజ్జల పేర్కొన్నారు. నామినేషన్ల అడ్డగింతలు, బెదిరింపులు, పోలీసుల దౌర్జన్యాలు వంటి ఘటనలు ఎదురైతే వెంటనే వీడియోలు, ఫొటోలు, ఇతర ఆధారాలను సేకరించి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

న్యాయపోరాటానికి సిద్ధంగా ఉండాలి

ఎన్నికల అక్రమాలపై ఆధారాలను భద్రపరచడంతో పాటు అవసరమైన చోట న్యాయపోరాటం చేయాలని సజ్జల స్పష్టం చేశారు. మండల స్థాయిలో న్యాయపరమైన అంశాలను సమన్వయం చేసే బాధ్యులను ఏర్పాటు చేయాలని సూచించారు. పార్టీ మీడియా, సోషల్‌ మీడియా వ్యవస్థలను సమర్థంగా వినియోగించి ఎన్నికల అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు.

పరిశీలకులు క్షేత్రస్థాయిలో పూర్తి బాధ్యత తీసుకోవాలి

పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల ప్రక్రియను పర్యవేక్షించాలని సజ్జల ఆదేశించారు. ఎక్కడైనా పోటీ లేకుండా స్థానాలు మిగిలిపోయే పరిస్థితి ఉంటే వెంటనే స్థానిక నాయకులను అప్రమత్తం చేసి సమస్యను పరిష్కరించాలన్నారు. నామినేషన్ల నుంచి ఫలితాల వరకు ప్రతి పరిణామంపై ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం అందించాలని సూచించారు.

పంచాయతీ ఎన్నికలను గ్రామస్థాయిలో పార్టీ బలాన్ని మరింత పెంచుకునే అవకాశంగా వినియోగించుకోవాలని సజ్జల తెలిపారు. రాబోయే పది రోజుల పాటు నామినేషన్ల ప్రక్రియను అత్యంత అప్రమత్తంగా పర్యవేక్షిస్తూ, గ్రామస్థాయి నుంచి పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ యంత్రాంగమంతా సమన్వయంతో పనిచేసి ప్రతి స్థానంలో వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారులు గట్టి పోటీ ఇచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Back to Top