అనంతపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా అభివృద్ధిని పక్కనపెట్టి ఇంకా వైయస్ఆర్‌సీపీపై విమర్శలు చేయడం ఏమిటని అనంతపురం నగర మేయర్ రమేష్ గౌడ్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను ప్రశ్నించారు. నగరంలో రూ.1,400 కోట్ల అభివృద్ధి చేశామని చెబుతున్న ఎమ్మెల్యే ఆ పనులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ చేశారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో రూ.1,045 కోట్ల అభివృద్ధి రమేష్ గౌడ్ మాట్లాడుతూ, “2019 నుంచి 2024 వరకు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నాయకత్వంలో కోవిడ్, వరదలు వంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ అనంతపురం నగరంలో రూ.1,045 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. గుత్తి రోడ్డు విస్తరణకు రూ.90 కోట్లు, ఎన్‌హెచ్-42 అనుసంధానానికి రూ.311 కోట్లు, ప్రధాన రోడ్ల ఆధునీకరణకు రూ.68 కోట్లు, కాలనీల్లో మౌలిక వసతులకు రూ.49.50 కోట్లు ఖర్చు చేశాం” అన్నారు. “సీడీ ఆస్పత్రి పునరుద్ధరణతో పాటు ఆరు వైయస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్లు, విలీన ప్రాంతాల్లో రూ.121 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం. టవర్ క్లాక్ నాలుగు లైన్ల బ్రిడ్జిని కేవలం 18 నెలల్లో నిర్మించాం. ఇవన్నీ వైయస్ఆర్‌సీపీ హయాంలో జరిగిన అభివృద్ధికి నిదర్శనాలు” అని తెలిపారు. రూ.1,400 కోట్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి “కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను రద్దు చేసి, మళ్లీ అవే పనులను తామే చేసినట్లు చెప్పుకోవడం ఏమిటి? రూ.1,400 కోట్లతో అభివృద్ధి చేశామని చెబుతున్న ఎమ్మెల్యే ఆ పనుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలి. దశాబ్దాల కల అయిన అనంతపురం సర్వజనాస్పత్రి విస్తరణకు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం రూ.300 కోట్లతో శ్రీకారం చుడితే ఆ పనులు ఇప్పుడు ఎందుకు నిలిచిపోయాయో సమాధానం చెప్పాలి” అని రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. టవర్ క్లాక్ రోడ్డు 2018లోనే మంజూరైందంటూ ఎమ్మెల్యే చేస్తున్న వాదనకు ఆధారాలు చూపాలని సవాల్ చేశారు. దివంగత నేత అనంత వెంకటరెడ్డి గురించి మాట్లాడే ముందు ఆయన అనంతపురం జిల్లాకు చేసిన సేవలను కూటమిలోని సీనియర్ నేతలు పయ్యావుల కేశవ్, కాలవ శ్రీనివాసులును అడిగి తెలుసుకోవాలని రమేష్ గౌడ్ హితవు పలికారు.