మంగళగిరి: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా జనసేన కార్యకర్తలు చేసిన అత్యంత అసభ్యకర, జుగుప్సాకర వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుల బృందం మంగళగిరిలోని రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆధారాలతో ఫిర్యాదు చేసి 60 గంటలు గడిచినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి, సోషల్ మీడియా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి, పార్టీ ప్యానలిస్టు శైలజారెడ్డి తదితరులు డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో అధికారులకు పెన్‌డ్రైవ్‌లో ఆధారాలను అందజేసి, అనంతరం మీడియాతో మాట్లాడారు. మా సంయమనాన్ని చేతగానితనంగా భావించొద్దు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ “వైయస్ జగన్ గారి ఆదేశాలతో మేము సంయమనం పాటిస్తుంటే మీ పార్టీ సైకోలు బూతులతో రెచ్చిపోతున్నారు. జనసేనకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు మహిళలను కించపరుస్తూ అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. అయినా ఇప్పటికీ కేసు నమోదు చేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత దీనిపై సమాధానం చెప్పాలి. అదే వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అయితే ఎలాంటి సంబంధం లేకపోయినా కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పి వేధిస్తున్నారు. స్వయంగా డీజీపీని కలిసి ఆధారాలు ఇద్దామని వస్తే సెలవు అని చెబుతున్నారు. ఇదేనా డీజీపీ కార్యాలయం పనితీరు? మేము పెన్‌డ్రైవ్‌తో కూడిన ఆధారాలను అధికారులకు అందించి అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకున్నాం. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపై మాట్లాడవద్దని మా నాయకుడు వైయస్ జగన్ గారు ఆదేశిస్తే మేమంతా సంయమనం పాటించాం. మరి మీ పార్టీ సైకోల వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? వారిపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తాం.” మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేసిన వారికి కఠిన శిక్ష తప్పదు: ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి “మా నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిపై, ఏనాడూ రాజకీయాల్లోకి రాని మా భారతమ్మ గారిపై 350 మందితో కూడిన ఎక్స్ స్పేస్‌లో జనసైకోలు అత్యంత నీచాతినీచంగా మాట్లాడారు. సభ్య సమాజం కూడా సిగ్గుపడేలా ఉన్న ఆ వీడియోలను ఎవరూ చూడలేని పరిస్థితి ఉంది. మహిళలను గౌరవిస్తామని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారి కుటుంబ విషయాలపై ఎవరూ మాట్లాడకూడదని మా నాయకుడు జగన్ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు కాబట్టే మేమంతా మౌనంగా ఉన్నాం. మా కార్యకర్తలు చిన్న పోస్ట్ పెడితేనే అరెస్టులు చేస్తున్న పోలీసులు, ఇంత దారుణంగా మాట్లాడిన జనసేన సైకోలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వారికి శిక్ష పడే వరకు మేము విడిచిపెట్టం.” మాకు ఫిర్యాదు చేయాలంటే సెలవులు.. కేసులు పెట్టాలంటే అర్ధరాత్రి కూడా వర్కింగ్ డేనా?: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు “వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు హుందాగా పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆ రోజు సాయంత్రమే జనసేనకు సంబంధించిన ఎక్స్ స్పేస్‌లో 350 మంది కలిసి ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ తలదించుకునే భాషలో మాట్లాడారు. దీనిపై ఫిర్యాదు చేసి 60 గంటలు గడిచినా ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. ఈ మూడేళ్లలో మేము ఎన్నోసార్లు డీజీపీ కార్యాలయానికి వచ్చినా ఆయన అందుబాటులో ఉండరు. మేము ఫిర్యాదు చేయడానికి వస్తే శుక్ర, శని, ఆదివారం సెలవులు అని చెబుతున్నారు. అదే వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను అరెస్టు చేయాలంటే అర్ధరాత్రి కూడా పోలీసులకు వర్కింగ్ డే అవుతుంది. వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై వందల కేసులు పెట్టిన పోలీసులు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు? ఆ 350 మందిపై, ఆర్గనైజర్లపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే వివిధ ఫోరమ్స్‌లో న్యాయపోరాటం చేస్తాం.” జగన్ గారి సంయమనం నీచపు రాజకీయాలకు పనికిరాదు: టీజేఆర్ సుధాకర్ బాబు, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు “ఆంధ్రప్రదేశ్‌లో అసలు డీజీపీ ఉన్నారా? ఉంటే వైయస్ఆర్‌సీపీ నేతలను ఎందుకు కలవడం లేదు? మాజీ ముఖ్యమంత్రి భార్య, చెల్లెలు, తమ్ముడిపై జనసేనకు చెందిన 350 మంది సోషల్ మీడియా వేదికగా దూషణలకు దిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటున్న డీజీపీ, సీఎం, డిప్యూటీ సీఎం ఎందుకు స్పందించడం లేదు? రాష్ట్రంలో శాంతిభద్రతలతో పాటు మహిళల ఆత్మగౌరవ సంక్షోభం ఏర్పడింది. జగన్ కుటుంబ మహిళలను దూషిస్తే చూస్తూ ఊరుకోలేం. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అంశంపై మాకు సంబంధం లేదని మా నాయకుడు చెబితే మేము నోరు మూసుకున్నాం. కానీ వైయస్ జగన్ గారి సంయమనం, సంస్కారం ఈ నీచపు రాజకీయాలకు పనికిరావు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజకీయాలను వారి దారిలోనే ఎదుర్కోవాలి.” ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికే బూతు పురాణం: మనోహర్‌రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు “గత రెండున్నరేళ్లుగా ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా విభాగాలు బూతులు మాట్లాడటానికి, వ్యక్తిత్వ హననానికి లైసెన్సులు తెచ్చుకున్నట్లు ప్రవర్తిస్తున్నాయి. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపై వేల కేసులు పెట్టి, వందల రోజులు అక్రమ నిర్బంధంలో ఉంచుతున్నారు. మేము వందల ఫిర్యాదులు ఇచ్చినా పోలీసులు కనీసం కేసు నమోదు చేయడం లేదు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే కుట్రలో భాగంగానే ఇలాంటి బూతు పురాణాలను ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, రైతుల నష్టపరిహారం, మహిళలపై అఘాయిత్యాలపై వైయస్ఆర్‌సీపీ చేస్తున్న పోరాటాలను పక్కదారి పట్టించడానికే ఈ వ్యవహారాలను తెరపైకి తెస్తున్నారు. పోలీసులు ఇప్పటికైనా కేసులు నమోదు చేయకపోతే కోర్టుల ద్వారా ముద్దాయిలకు శిక్ష పడే వరకు పోరాడుతాం.” అధికార మదంతో విర్రవీగుతున్న కూటమి నేతలు కళ్లు తెరవాలి: శైలజారెడ్డి, పార్టీ ప్యానలిస్టు “పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఇబ్బంది తలెత్తితే పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడవద్దని మా అధినాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు సంస్కారం చూపించారు. కానీ అధికార మదంతో విర్రవీగుతున్న కూటమి నేతలు జగన్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన సతీమణి, చెల్లెలు, కుటుంబ సభ్యులపై దారుణంగా మాట్లాడిస్తున్నారు. ఒక మహిళగా గత మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూసి సిగ్గుపడుతున్నాను. ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోతే రాష్ట్ర ప్రజలే కూటమికి తగిన బుద్ధి చెబుతారు.” వైయస్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేసిన మేరకు, సోషల్ మీడియా వేదికగా మహిళలు, కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను డీజీపీ కార్యాలయ అధికారులకు అందజేసి, పోలీసుల స్పందన కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. చర్యలు లేకుంటే న్యాయపోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.