పెరిగిన నిత్యావసరాల ధరలతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం

ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆకాశంలో నిత్యావసర వస్తు ధరలు

:2024కు ముందు, నేటి ధరలతో ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.

చంద్రబాబు రేపటి విజన్ పేరుతో కాలక్షేపం చేయడం మానుకోవాలి

నేడు పేదవాడి కడుపు నింపే ఆలోచన చేయాలి  

:హితవు పలికిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

ప్రభుత్వ అసమర్ధతపై ప్రజలు చైతన్యవంతులు కావాలి

పాలనా వైఫల్యాలపై ఓటుతో అసమ్మతి తెలియజేయాలి

:పిలుపునిచ్చిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం : కూటమి ప్రభుత్వం ఏర్పడినా తర్వాత రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు అసాధారణంగా పెరిగిపోయి, సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. శ్రీకాకుళం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ధరల పెరుగుదలను అదుపు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఆయన.. 2024కు ముందు ఉన్న నిత్యావసరాల  ధరలకు, నేటి మార్కెట్ ధరలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఆధారాలతో సహా వివరిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకవైపు మూడు లక్షలకు పైగా కోట్ల అప్పులు చేస్తూ, మరోవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంట్ ఛార్జీలు, స్కూల్ ఫీజుల భారంతో ప్రజలను దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. 
ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంకా ఆయన ఏమన్నారంటే..:

2050 విజన్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు:
ఒక రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందని నమ్మి 2024లో ప్రజలు అధికారం ఇస్తే, 2050 నాటికి రాష్ట్రాన్ని నాకున్న విజన్‌తో ప్రపంచంలోనే నెంబర్ వన్ చేస్తానని చంద్రబాబు చెప్పడం ప్రజలను మోసగించడమే. ఇలాంటి లాంగ్ టర్మ్ విజన్ గురించి చెప్పే ముందు, రాష్ట్రంలో ప్రజల సాధారణ జీవనం ఎలా నడుస్తుందో ప్రభుత్వం ఆలోచించాలి. ఒక సామాన్యుడు తన సంపాదనతో హాయిగా జీవించగలుగుతున్నాడా ? లేదా?, తన కష్టార్జితంతో కుటుంబ సభ్యుల కడుపు నింపగలుగుతున్నాడా? అన్నది పట్టించుకోవాలి. ఈనాడు రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు, కండక్టర్లు, తాపీ పనివారు, కలాసీలు, రైతు కూలీలు, రోజువారీ వేతనంపై బతికే కార్మికుల పరిస్థితి పూర్తిగా అధ్వానంగా మారింది. మార్కెట్‌కు వెళ్తే బియ్యం కొంటే చింతపండు కొనలేని, చింతపండు కొంటే నూనె కొనలేని దుస్థితి నెలకొంది.

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ఆధారాలతో నిలదీత:
2024లో ఈ ప్రభుత్వం అధికారం చేపట్టక ముందు ఉన్న ధరలకు, నేటి ధరలకు అసలు పొంతనే లేదు. బజారుకు వెళ్తే గుండె గుబేలుమనే రేట్లు కనిపిస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
 *గతంలో సూపర్ ఫైన్ బియ్యం కిలో రూ.50 ఉంటే, నేడు రూ.85కి చేరింది.
 * సాధారణ రకం బియ్యం రూ.45 నుంచి రూ.75కి పెరిగింది.
 * కందిపప్పు రూ.125 నుంచి రూ.180కి, మినప్పప్పు రూ.98 నుంచి రూ.160కి ఎగబాకింది.
 * శనగపప్పు రూ.69 నుంచి రూ.99కి, పెసరపప్పు రూ.90 నుంచి రెట్టింపై రూ.180కి చేరింది.
 * పంచదార రూ.44 నుంచి రూ.65కి, ఉల్లిపాయలు రూ.20 నుంచి రూ.90కి పెరిగాయి.
 * పామ్ ఆయిల్ రూ.90 నుంచి రూ.155కి, వేరుశనగ నూనె రూ.165 నుంచి రూ.190కి చేరి సామాన్యుడికి అందకుండా పోయాయి. పెరిగిన ఈ ధరలపై ప్రభుత్వం ఎప్పుడైనా రివ్యూ చేసిందా? ఆ పేదవాడి కన్నీరు తుడిచే ప్రయత్నం చేసిందా?

అప్పులు, భూముల దోపిడీతో కాలక్షేపం:
ప్రపంచ స్థాయి పెట్టుబడుల సదస్సుల పేరుతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు. విలువైన ప్రభుత్వ భూములను రూపాయికే కట్టబెడుతూ, వెనుక నుంచి ప్రతిఫలం పొందే దిగజారుడు పనులు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. ఒకవైపు మూడు లక్షలకు పైగా కోట్ల అప్పు చేశారు. రాష్ట్ర ప్రజలు ప్రతి ఏటా మూడు లక్షల కోట్ల బడ్జెట్‌కు నిధులు సమకూరుస్తున్నా సామాన్యుడి జీవనం మాత్రం సాఫీగా సాగడం లేదు. నేటి తరాలు లేని 2050లో రాష్ట్రం నెంబర్ వన్ అయితే ఎవరికి ప్రయోజనం?

ఇంధనం, కరెంట్, ఫీజులు, మద్యం భారంతో నడ్డి విరిచారు:
నిత్యావసరాలే కాకుండా అన్ని రంగాల్లోనూ ప్రజలపై విపరీతమైన భారం మోపారు. పెట్రోల్ ధర గతంలో రూ.109 నుంచి నేడు రూ.118కి, డీజిల్ రూ.97 నుంచి రూ.105కి, గ్యాస్ సిలిండర్ ధర రూ.855 నుంచి రూ.970కి పెరిగింది. గతంలో కరెంట్ ఛార్జీలు పెంచకుండా ఉంచితే, ఈ ప్రభుత్వం వచ్చాక మొదటిసారి హోటళ్లకు 50 శాతం పెంచింది. ట్రూ అప్ పేరుతో రూ.20 వేల కోట్ల భారం వేసింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలను వాస్తవ ధరల కంటే ఎక్కువగా పెంచేయడంతో భూములు అమ్మలేని, కొనలేని పరిస్థితి వచ్చింది. ప్రైవేట్ స్కూల్, కాలేజీ ఫీజులు 40 శాతం పెరిగిపోయినా పట్టించుకోవడం లేదు. ఇక మద్యం ధరలపై ఎన్నో కబుర్లు చెప్పిన ప్రభుత్వం, రెండున్నరేళ్లలో చీప్ లిక్కర్ ధరను రూ.180 నుంచి రూ.210కి పెంచింది. దానికి తోడు మద్యం షాపుల్లో అదనంగా మరో రూ.10 అనధికారికంగా వసూలు చేసుకునేలా మీ ప్రతినిధులకు లంచాల ద్వారాలు తెరిచారు.

ఓటు ద్వారానే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి:
ఈ నేపధ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న ఈ దోపిడీకి సామాన్య ప్రజలు గజగజలాడిపోతున్నారని ధర్మాన ప్రసాదరావు ఆక్షేపించారు. ఇంటిల్లిపాదికి భరోసా లేకుండా పోయిందని. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు భయపడేది ఒక్క ఓటుకు మాత్రమేనని స్పష్టం చేశారు. మాయమాటలతో మోసగించి, ట్రాక్ తప్పిన ఈ నిద్రపోతున్న ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓటు ద్వారానే మన అసమ్మతిని, అసంతృప్తిని తెలియజేయాలని,  శ్రీకాకుళం పౌరులతో పాటు రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలందరూ చైతన్యవంతులై ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి అని ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు.

Back to Top