నిస్సిగ్గుగా మరో క్రెడిట్‌ చోరీ 

చంద్రబాబుపై మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌ మండిపాటు 

ఏఈఐ ర్యాంకింగ్స్‌ను తన ఘనతగా చిత్రీకరించుకుంటూ బాబు అవాస్తవాల ప్రచారం  

వైయ‌స్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమం, సామాజిక భద్రత, ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చాం 

అందువల్లే మన రాష్ట్రం అనేక కీలక సూచీల్లో గణనీయమైన పురోగతి సాధించింది 

ఈ విషయాన్ని నేను ఎంతో గర్వంగా చెబుతున్నా..  

2024 ఏఈఐ నివేదికలో అన్ని సూచికలకు ఉపయోగించిన గణాంకాలు.. 2021–2023 మధ్య కాలానికి చెందినవే 

మా హయాంలో సాధించిన ఈ విజయాలను చంద్రబాబు తన ఘనతగా చెప్పుకుంటున్నారు 

బాబుకు ఏమాత్రం సంబంధం లేని విజయాన్ని సిగ్గూ ఎగ్గూ లేకుండా తన ఖాతాలో వేసుకుంటున్నారు

ఏపీ ఇంతటి పురోగతి సాధించిన 2019–24 కాలాన్ని.. ‘రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉన్న కాలం’ అంటూ బాబు అవమానిస్తున్నారు 

నిజానికి అదే కాలంలో ఆంధ్రప్రదేశ్‌ అనేక కీలక సూచీల్లో దేశంలో అగ్రస్థానాలకు చేరుకుందన్న వాస్తవాన్ని ఈ నివేదిక స్పష్టంగా వెల్లడిస్తోంది  

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి నిసిగ్గుగా క్రెడిట్‌ చోరీకి పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యాక్సెస్‌ (ఇన్‌) ఈక్వాలిటీ ఇండెక్స్‌ (ఏఈఐ) ర్యాంకింగ్స్‌ను చంద్రబాబు తన ఘనతగా చెప్పుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఈఐ  ర్యాంకింగ్స్‌లో ఏపీకి మూడో  స్థానం దక్కడం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఘనతేనని స్పష్టం చేశారు. కానీ, దీన్ని కూడా తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమం, సామాజిక భద్రత, ఆర్థికాభివృద్ధికి ఇచ్చిన ప్రాధాన్యం వల్లే మన రాష్ట్రం అనేక కీలక సూచీల్లో గణనీయమైన పురోగతి సాధించిందని స్పష్టం చేశారు. 

‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సాధించిన ఈ విజయాలను చంద్రబాబు నాయుడు ఏమాత్రం నైతికత లేకుండా తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. మరోవైపు, రాష్ట్రం ఇంతటి పురోగతిని సాధించిన 2019–24 కాలాన్ని... ‘రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉన్న కాలం’ అంటూ అవమానిస్తున్నారు. అదే కాలంలో ఆంధ్రప్రదేశ్‌ అనేక కీలక సూచీల్లో దేశంలో అగ్రస్థానాలకు చేరుకుందన్న వాస్తవాన్ని ఈ నివేదిక స్పష్టంగా తెలియజేస్తోంది. అయినా మరోసారి చంద్రబాబు క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారు’ అని మండిపడ్డారు. ఈమేరకు ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం తన ‘ఎక్స్‌’ ఖాతాలో వైఎస్‌ జగన్‌ ఆధారాలతో సహా పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే...  

సమగ్ర సూచీ (కాంపోజిట్‌ ఇండెక్స్‌) ప్రకారం రాష్ట్రాలకు ర్యాంకులు.. 
నారా చంద్రబాబునాయుడు గారూ..! మీకు ఏ మాత్రం సంబంధం లేని విజయాన్ని కూడా మరోసారి ఏమాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా మీ ఘనతగా చెప్పుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం సాధించిన పురోగతిని కూడా మీ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం? ‘ఓపీ జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్సిటీ’ (జేజీయూ), ‘సెంటర్‌ ఫర్‌ న్యూ ఎకనామిక్స్‌ స్టడీస్‌’ (సీఎన్‌ఈఎస్‌)తో కలిసి 2024లో ఒక నివేదిక ప్రచురించింది.

సామాజిక, మానవాభివృద్ధికి సంబంధించి అత్యంత కీలకమైన ఐదు ప్రధాన అంశాల ఆధారంగా ఆ నివేదిక తయారు చేసి రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయించింది. అంతేకాకుండా ఆ ఐదు అంశాలకు నిర్దిష్ట వెయిటేజీ (మార్కులు) కేటాయించి, వాటి ఆధారంగా రూపొందించిన సమగ్ర సూచీ (కాంపోజిట్‌ ఇండెక్స్‌) ప్రకారం రాష్ట్రాలకు ర్యాంకులు కూడా ఇచ్చింది. ఇదే యూనివర్సిటీ, అదే సీఎన్‌ఈఎస్‌తో కలిసి 2021లో కూడా అదే తరహా అధ్యయనం చేసి, అప్పుడు కూడా ఒక నివేదిక విడుదల చేసింది. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడక ముందు..  ఆ తర్వాత వచ్చిన మార్పులు 
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. 2021 ఏఈఐ నివేదికలో రాష్ట్రాల ర్యాంకింగ్స్‌ కోసం ఉపయోగించిన అత్యధిక సూచికలకు సంబంధించిన గణాంకాలు 2019కి ముందు కాలానికి చెందినవి. అదే 2024 ఏఈఐ నివేదికలో అన్ని సూచికలకు ఉపయోగించిన గణాంకాలు 2021 నుంచి 2023 మధ్య కాలానికి చెందినవి. అందువల్ల ఈ రెండు నివేదికలను పోల్చి చూస్తే, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడక ముందు..  ఏర్పడిన తర్వాత రాష్ట్ర సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులు స్పష్టంగా తెలుస్తాయి. 

నివేదికకు ఆధారమైన కీలకమైన ప్రధాన అంశాల్లో ఒకటైన ఆరోగ్య సూచీ (హెల్త్‌ ఇండెక్స్‌ స్కోర్‌)కి సంబంధించి చూస్తే.. 2021 నివేదికలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ 8వ స్థానంలో ఉంది. ఆ ర్యాంకు కోసం ప్రామాణికంగా తీసుకున్న గణాంకాల్లో అత్యధికం 2019కి ముందు కాలానికి చెందినవి. అదే 2024 నివేదికలో ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్య సూచీలో ఏకంగా 2వ స్థానానికి ఎగబాకింది. ఈ ర్యాంకు కోసం ప్రామాణికంగా తీసుకున్న గణాంకాలన్నీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ కాలానికి చెందినవే. 

ఇది మన రాష్ట్రం ఎంతో గర్వించదగ్గ విషయం... 
ఇక మరొక ప్రధాన అంశం సామాజిక, ఆర్థిక భద్రత సూచీకి సంబంధించి చూస్తే.. 2021 నివేదికలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో 11వ స్థానంలో ఉంది. ఈ ర్యాంకు కోసం ప్రామాణికంగా తీసుకున్న గణాంకాల్లో అత్యధికం 2019కి ముందు నాటివి. అదే 2024 నివేదికలో సామాజిక, ఆర్థిక భద్రత సూచీలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో ఏకంగా మొదటి స్థానానికి చేరుకుంది. ఈ ర్యాంకు కోసం ప్రామాణికంగా తీసుకున్న గణాంకాలన్నీ కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ కాలానికి చెందినవే. నిజంగా ఇది మన రాష్ట్రం ఎంతో గర్వించదగ్గ విషయం. ఈ విజయం యాదృచ్ఛికం కాదు.

సంక్షేమం, అభివృద్ధికి సరైన ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే ఇది సాధ్యమైంది. అత్యంత పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం.. కష్టకాలంలో ప్రజల వ్యక్తిగత అవసరాలు తీర్చడం.. ఆ దిశలో వారి కొనుగోలు శక్తి పెంచేలా తగిన చర్యలు చేపట్టడం.. ఇంకా 2019–24 మధ్య దక్షిణ భారత దేశంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధించేలా పరిశ్రమలు, తయారీ రంగాలకు మద్దతు ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు గణనీయంగా పెంచడం.. తద్వారా సామాజిక భద్రత మరింత మెరుగుపడేలా చేయడం.. వెరసి ఈ విజయానికి ప్రధాన కారణాలు. 

కాంపోజిట్‌ స్కోర్‌ గమనిస్తే వాస్తవాలు తెలుస్తాయి.. 
ఇక న్యాయపరమైన పరిష్కార మార్గాలకు సంబంధించిన సూచీ చూస్తే.. 2021 నివేదికలో ఆంధ్రప్రదేశ్‌ 15వ స్థానంలో ఉంది. ఆ ర్యాంకు కోసం తీసుకున్న గణాంకాల్లో అత్యధికం 2019కి ముందు కాలానికి చెందినవి. అదే 2024 నివేదికలో అదే సూచీలో ఆంధ్రప్రదేశ్‌ ఏకంగా 2వ స్థానానికి ఎగబాకింది. ఆ ర్యాంకు కోసం ప్రామాణికంగా తీసుకున్న గణాంకాలన్నీ వైయ‌స్సార్‌సీపీ ప్రభుత్వ కాలానికి చెందినవే. 

ఇంకా అన్ని అంశాలతో కూడిన ‘సమగ్ర సూచీ’ (ఓవరాల్‌ కాంపోజిట్‌ స్కోర్‌)ని గమనిస్తే, 2021 నివేదికలో ఆంధ్రప్రదేశ్‌ 10వ స్థానంలో ఉంది. ఆ ర్యాంకు కోసం తీసుకున్న గణాంకాల్లో అత్యధికం 2019కి ముందు కాలానికి చెందినవి. అదే 2024 నివేదికలో ‘సమగ్ర సూచీ’లో ఆంధ్రప్రదేశ్‌ ఏకంగా 3వ స్థానానికి దూసుకెళ్లింది. ఈ ర్యాంకు కోసం ప్రామాణికంగా పరిగణనలోకి తీసుకున్న గణాంకాలన్నీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనివే. 

నైతికత లేకుండా తమ ఘనతగా చెప్పుకుంటున్న చంద్రబాబు.. 
వాస్తవానికి 2024 ఏఈఐ నివేదిక ఆంధ్రప్రదేశ్‌ సాధించిన ఈ పురోగతిని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ‘అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ అత్యంత పురోగతిని సాధించింది. 10వ స్థానం నుంచి ఏకంగా 3వ స్థానానికి ఎగబాకింది’ అని ఆ నివేదిక ప్రత్యేకంగా పేర్కొంది. వైయ‌స్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమం, సామాజిక భద్రత, ఆర్థికాభివృద్ధికి ఇచ్చిన ప్రాధాన్యం వల్లే మన రాష్ట్రం అనేక కీలక సూచీల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని నేను ఎంతో గర్వంగా చెబుతున్నా.

అయితే, వైయ‌స్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సాధించిన ఈ విజయాలను చంద్రబాబు నాయుడు ఏమాత్రం నైతికత లేకుండా తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రం ఇంతటి పురోగతిని సాధించిన 2019–24 కాలాన్ని... ‘రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉన్న కాలం’ అంటూ అవమానిస్తున్నారు. నిజానికి అదే కాలంలో ఆంధ్రప్రదేశ్‌ అనేక కీలక సూచీల్లో దేశంలో అగ్రస్థానాలకు చేరుకుందన్న వాస్తవాన్ని ఈ నివేదిక స్పష్టంగా తెలియజేస్తోంది.  

Back to Top