దౌర్జన్యాలు, బెదిరింపులు లేకుండా గెలిచే సత్తా కూటమికి ఉందా..?

బేరసారాలు, ప్రలోభాలు,  వేలంపాటలు నిర్వహిస్తున్న బాబుకు గుణపాఠం చెప్పాలి

ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజం

తాడేపల్లి లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్ బాబు

చంద్రబాబు తన ఆరాచక పాలనతో రాష్ట్రాన్ని సౌత్ బీహర్ గా మార్చారు

సర్పంచ్ ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం జోక్యమా..?

టీజేఆర్ సుధాకర్ బాబు నిలదీత

బరితెగించి వ్యవహరిస్తున్న మంత్రి రాంప్రసాద్ ను భర్తరఫ్ చేయాలి

రామ్ ప్రసాద్ రౌడీయిజానికి సీసీటీవీ దృశ్యాలే సాక్ష్యాలు

మాజీ ఎమ్మెల్యే  సుధాకర్ బాబు మండిపాటు

పాలపాడు, రాయచోటి, శ్రీకాళహస్తి, కోనంపేట ఘటనలపై సమగ్ర విచారణ జరపాలి

నామినేషన్ పత్రాలను చించివేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ బాబు డిమాండ్

తాడేపల్లి: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం కనీసం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లోనైనా సరే దౌర్జన్యాలు, బెదిరింపులు లేకుండా  గెలిచే సత్తా ఉందా అని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు సవాల్ విసిరారు. నామినేషన్లు వేయనీయకుండా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు సాగిస్తూ,  పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్న చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. తాడేపల్లి లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో అడ్డగోలు గెలుపు కోసం  అభ్యర్థులతో బేరసారాలు, ప్రలోభాలు, వేలంపాటలు నిర్వహించడం చంద్రబాబు రాజకీయ దిగజారుడుతనానికి  నిదర్శనమని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు నాయుడు తన అరాచక పాలనతో రాష్ట్రాన్ని దక్షిణ బీహార్‌గా మార్చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారం కోసం ఎంతకైనా దిగజారే స్వభావంతో చంద్రబాబు,  బయటకు నీతులు చెబుతూ, లోపల ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి గ్రామస్థాయి సర్పంచ్ ఎన్నికల్లో కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రజలకు చంద్రబాబు  సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. 2024 ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేకపోయారని సుధాకర్ బాబు ఆక్షేపించారు. మరోవైపు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నవరత్నాలతో పాటు 38 రకాల సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలకు మేలు చేశారని గుర్తు చేసారు. ఆ పాలనతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని,  అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల తీర్పును ఎదుర్కొనే ధైర్యం లేక అధికార బలంతో ప్రతిపక్ష అభ్యర్థులను కనీసం పోటీ చేయనీయకుండా నామినేషన్ల పర్వంలోనే  అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.  చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులకు నిజంగా ప్రజలపై నమ్మకం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని, స్థానికంగా జరుగుతున్న ఎన్నికల్లో ఓటమిపై ఎందుకంత భయమని సుధాకర్ బాబు నిలదీసారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన ఇంకా ఏం మాట్లాడరంటే...  

- రాంప్రసాద్ రెడ్డికి మంత్రిగా కొనసాగే అర్హత లేదు  

అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి రామప్రసాద్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరం. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను స్వయంగా మంత్రి బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసు అధికారులను వెంటబెట్టుకుని గ్రామాల్లోకి వెళ్లి అభ్యర్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.  నాలుగు గ్రామాలకు చెందిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను మంత్రి స్వయంగా చించివేశారనే ఆధారాలు ఉన్నాయి.  అన్నమయ్య జిల్లా కోనంపేట నామినేషన్ కేంద్రానికి మంత్రి రామప్రసాద్ రెడ్డి వెళ్లిన ఘటనపై సీసీటీవీ దృశ్యాలు అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది. ఆ దృశ్యాలను తక్షణమే భద్రపరచాలి. మంత్రి హోదాలో ఉన్నంత మాత్రాన ఏదైనా చేయవచ్చనే ధోరణి సరికాదు. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలను తొలగించే ప్రయత్నాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల పత్రాలను చింపివేసే వ్యక్తి మంత్రిగా కొనసాగడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడం లేదు?  తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కూడా నామినేషన్ పత్రాలను చింపివేసిన ఘటన అత్యంత బాధాకరం.  పోలీసుల సమక్షంలోనే ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నా అధికారులు ప్రేక్షకపాత్ర వహించడం దురదృష్టకరం. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయి.

- నామినేషన్ల అడ్డగింత.. అభ్యర్థుల నిర్భంధం

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి కూడా ప్రతిపక్ష అభ్యర్థులు ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం, అభ్యర్థులను బెదిరించడం, దాడులు చేయడం, కిడ్నాప్‌లు చేయడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.  టీడీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసు వ్యవస్థను తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులను బెదిరించి పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.   పల్నాడు జిల్లాలోని పాలపాడులో వైఎస్సార్‌సీపీ నాయకులు సత్యనారాయణరెడ్డి, చంచిరెడ్డితో పాటు టీడీపీకి చెందిన స్వామిరెడ్డిని కూడా పోలీసులు రాత్రి సమయంలో తీసుకెళ్లారు. వారిని ఏ కారణంతో తీసుకెళ్లారో ఇప్పటివరకు సరైన సమాచారం లేదు. ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా పోలీసుల వ్యవహారశైలి కనిపిస్తోంది.

- వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు భరోసా

వైఎస్సార్‌సీపీ తరఫున సర్పంచ్‌లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. అధికార పార్టీ ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ప్రజాస్వామ్య పోరాటాన్ని కొనసాగించాలి.  వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు శాశ్వతంగా అధికారంలో ఉంటామని భ్రమపడకూడదు. ప్రజల తీర్పే అంతిమ తీర్పు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలను మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, న్యాయవాదులు, ప్రజా సంఘాలు ప్రశ్నించాలి. ప్రజల హక్కుల కోసం వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాడుతుందని టి.జె.ఆర్. సుధాకర్ బాబు స్పష్టం చేశారు.

Back to Top