విజయవాడ: పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి కూడా అభ్యర్థులకు స్వేచ్ఛ లేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, బెదిరింపులు, నామినేషన్ల అడ్డంకులు కొనసాగుతున్నా ఎన్నికల కమిషన్, పోలీసు యంత్రాంగం ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నాయని వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉన్న ఎస్ఈసీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా అని నిలదీశారు. కూటమి అరాచకాలకు అడ్డుకట్ట వేసి ప్రతి అభ్యర్థికి నామినేషన్ వేసే హక్కును కాపాడాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. అనంతరం అక్కడే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మనోహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వారు ఏమన్నారంటే.. - ఆధారాలతో ఎస్ఈసీకి ఫిర్యాదు చేశాం: మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలని ఎస్ఈసీ తిరుపతిలో 13, 14 జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు, డీఐజీలు, ఐజీలు, డీజీపీ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించింది. కానీ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. పల్నాడు, అన్నమయ్య, గుంటూరు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు వైయస్ఆర్‌సీపీ మద్దతుదారుల నామినేషన్లను అడ్డుకుంటున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. నామినేషన్లు వేయడానికి భద్రత కల్పించాలని పదేపదే కోరినా పరిస్థితి మారలేదు. ఈ ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సహా పూర్తి ఆధారాలతో ఎస్ఈసీకి ఫిర్యాదు చేశాం. - నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు భద్రత కల్పించాలి అన్నమయ్య జిల్లాలోని రాయచోటి మండలంలో ఒక్క సర్పంచ్ అభ్యర్థిని కూడా నామినేషన్ వేయనివ్వని పరిస్థితి ఉంది. రాయచోటి ప్రాంతంలో నామినేషన్ కేంద్రంపై దాడి, శ్రీకాళహస్తి, తొట్టంబేడు ప్రాంతాల్లో నామినేషన్ పత్రాలను లాక్కోవడం, చించేయడం, గుంటూరు జిల్లాలో నామినేషన్లు అడ్డుకోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. పెట్రోల్ బాంబులు, కర్రలతో దౌర్జన్యాలకు సిద్ధమవుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా వైయస్ఆర్‌సీపీ నేతలపై ఎదురుకేసులు పెట్టడం ఏమిటి? సర్పంచ్ అభ్యర్థులకు నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు పూర్తి భద్రత కల్పించాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు, పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా ఎస్ఈసీ, పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలి.” - నామినేషన్లను అడ్డుకుని ఏకగ్రీవాల కోసం కూటమి దౌర్జన్యాలు: మనోహర్‌రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నా కూటమి ప్రభుత్వం తన ఆధిపత్యం చాటుకోవడానికి మళ్లీ అక్రమాలకు తెరతీస్తోంది. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రాయచోటి, పులివెందుల, పుంగనూరు, చిత్తూరు, తిరుపతి, పల్నాడు ప్రాంతాల్లో నామినేషన్లు వేయనివ్వకుండా రౌడీలు, గూండాలను దించి ఏకపక్షంగా ఎన్నికలు జరిపించిన విధానాన్నే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగిస్తున్నారు. అభ్యర్థులను బెదిరించడం, అక్రమంగా పోలీసు కేసులు పెట్టడం, పెట్రోల్ బాంబులు, కర్రలతో భయభ్రాంతులకు గురిచేయడం జరుగుతోంది. రాయచోటి ప్రాంతంలో విద్యార్థులను జీపుల్లో తరలించి దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా ఉన్నాయి. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాల్సింది పోయి వైయస్ఆర్‌సీపీ నాయకులపైనే కేసులు పెడతామని బెదిరించడం దారుణం. హైకోర్టు ఆదేశాలను కూడా అమలు చేయకుండా రిజర్వేషన్ల విషయంలో నిబంధనలు మార్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ ఆధారాలతో ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లాం.” - ప్రతి అభ్యర్థికి నామినేషన్ హక్కు కల్పించాలి ఎన్నికల కమిషన్ తిరుపతిలో ఉన్నతాధికారుల సమావేశంలో గత ఎన్నికల్లో హింస, నామినేషన్ల అడ్డంకులు జరిగాయని స్వయంగా చెప్పింది. పంచాయతీ ఎన్నికల్లో అవి పునరావృతం కాకూడదని స్పష్టం చేసింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నరసరావుపేటలో గతంలో నామినేషన్లు వేయించేందుకు పోలీసు బందోబస్తుతో అభ్యర్థులను తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికలే జరగనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో కనీసం ఒక్క నామినేషన్ కూడా పడని ప్రాంతం ఉండకూడదు. ప్రతి అభ్యర్థికి స్వేచ్ఛగా నామినేషన్ వేసే అవకాశం కల్పించేలా ఎస్ఈసీ నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలని కోరాం. అవసరమైన చర్యలు చేపడతామని ఎన్నికల కమిషన్ హామీ ఇచ్చింది.