హామీలు అమలు చేయాలంటే కొడతారా? 

చంద్రబాబూ.. ఇది ప్రజాస్వామ్యమేనా?

ఉద్యోగుల పట్ల సర్కారు తీరుపై నిప్పులు చెరిగిన వైఎస్‌ జగన్‌

ఉద్యోగులకు ఐఆర్‌ లేదు.. పీఆర్సీ లేదు. 5 డీఏలు పెండింగ్‌.. మొత్తంగా రూ.40 వేల కోట్ల బకాయిలు 

మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే ఉద్యోగులురోడ్డెక్కుతున్నారు 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిరసన తెలపడం తప్పా? 

మహిళలని చూడకుండా గాయపరుస్తారా? ఈడ్చి పడేస్తారా? 

ఆందోళన చేస్తే ఈ రకంగా లాఠీలతో కొడతారా? 

శాంతియుత ఆందోళనలపై దాడులు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? 

ధర్నాకు రాకుండా ఉద్యోగులను అడ్డగోలుగా సస్పెండ్‌ చేయడం దారుణం కాదా?.. రోజురోజుకూ మీ నిరంకుశత్వం పెరిగిపోతోంది 

అధికారం ఉందికదా అని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనుకుంటే ఎలా? 

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై కక్షగట్టి వేధింపులు 

మనందరి ప్రభుత్వం తప్పక వస్తుంది.. న్యాయం జరుగుతుందని భరోసా

తాడేప‌ల్లి : ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగిన ఉద్యోగులపై చంద్రబాబు సర్కార్‌ పాశవికంగా దాడి చేయడం అమానుష చర్య అని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ‘ఐఆర్‌ లేదు.. పీఆర్సీ లేదు. మేం పీఆర్సీ చైర్మన్‌ను నియమిస్తే మీరు వెళ్లగొట్టారు. ఉద్యోగులకు హక్కుగా ఇవ్వాల్సిన 5 డీఏలు పెండింగ్‌. ఉద్యోగులు రోడ్డెక్కితే.. అప్పుడు అందులో రెండు డీఏలు ఇస్తానని ప్రకటించి, అరియర్స్‌ చెల్లింపునకు కూడా వాయిదాలు పెట్టారు. సరెండర్‌ లీవ్స్‌ పెండింగ్‌. ఉద్యోగులకు పెట్టిన బకాయిలు దాదాపు రూ.40 వేల కోట్లు. ఇవి ఇవ్వాలని అడిగిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై పోలీసులు లాఠీఛార్జి చేయడం అత్యంత తీవ్రమైన విషయం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వారి డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరపనప్పుడు, ప్రజాస్వామ్యయుతంగా వారి గొంతును వినిపించడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ‘ఆందోళన చేస్తే ఈ రకంగా లాఠీలతో కొడతారా? మహిళలని చూడకుండా గాయపరుస్తారా? ఈడ్చి పడేస్తారా? శాంతియుత ఆందోళనలపై దాడులు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? ధర్నా కోసం వస్తున్న వారిని అడ్డుకుని పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించి నరకయాతన పెడతారా? ధర్నా జరగనీయకుండా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను అడ్డగోలుగా సస్పెండ్‌ చేయడం దారుణం కాదా? చంద్రబాబూ.. ఇది ప్రజాస్వామ్యమేనా? రోజురోజుకూ మీ నిరంకుశత్వం పెరిగిపోతోంది? ఉద్యోగులకు వెన్నుపోటు పొడవడమే మీ లక్ష్యం. అధికారం చేతిలో ఉందికదా అని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటే ఎలా?’ అని నిలదీశారు. 

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులే కాదు.. ఇవాళ ఏ ఉద్యోగి అయినా రోడ్డెక్కుతున్నారంటే కారణం మేనిఫెస్టోలో మీరు హామీలు ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగులందరికీ వెన్నుపోటు పొడవటమే అన్నారు. మీరు అధికారంలోకి వస్తానే ఐఆర్‌ అన్నారు. పీఆర్సీ అన్నారు. తీరా చూస్తే ఏవీ లేవని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఉద్యోగులు ఆందోళన చేస్తున్న సమయంలో మహిళా ఉద్యోగిని పోలీసులు ఈడ్చుకెళ్తున్న ఫొటోను ట్యాగ్‌ చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సచివాలయ వ్యవస్థపై కక్ష 
మీరు సీఎం సీట్లోకి వచ్చిన తొలి రోజు నుంచే.. మేం దేశంలో ఎక్కడా లేని విధంగా, పరిపాలనలో విప్లవాత్మక చర్యగా తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలపై కక్షగట్టారు. గ్రామ స్థాయిలోనే 540కి పైగా సేవలందించిన, మా మానస పుత్రికలైన గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్థ నిర్వీర్యమే లక్ష్యంగా.. ఆ వ్యవస్థలపై నిరంతరం దాడి చేస్తూనే ఉన్నారు. గ్రామ స్వరాజ్యం కనబడకుండా చేసేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ఒకే నోటిఫికేషన్‌తో దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలను, వలంటీర్ల రూపంలో మరో 2.6 లక్షల ఉద్యోగాలను గ్రామ, వార్డు స్థాయిలో పారదర్శక పాలన కోసం మేం సృష్టించాం. 

హేతు బద్ధీకరణ పేరుతో మీరు శాశ్వతంగా 30 వేల ఉద్యోగాలకు ఎసరు పెట్టడమే కాకుండా, వలంటీర్లకు మేం ఇచ్చే రూ.5 వేల జీతాన్ని రూ.10 వేలు చేస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక వారికీ వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు వలంటీర్లు అందించే సేవలనూ సచివాలయాల ఉద్యోగుల నెత్తిమీద పెట్టి, మోయలేని పని భారాన్ని మోపారు. పారదర్శకతకూ, ఇంటి వద్దకే పాలనకూ తెరదించారు. మీరు పెడుతున్న కష్టాలు, వేధింపులు భరించలేక ఒత్తిడికి గురై కొందరు, బలవన్మరణానికి పాల్పడి మరికొందరు.. ఇలా ఈ రెండున్నరేళ్ల మీ దుర్మార్గ పరిపాలనలో ఏకంగా సుమారు 100 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. 

మరి ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు, వారి బాధలు వినాలనే ఉద్దేశం మీకు లేనప్పుడు, వారు శాంతియుత ఆందోళన ద్వారా తమ గొంతు వినిపించాలనుకోవడం తప్పు ఎలా అవుతుంది? ఈ లాఠీఛార్జి ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించడమే కాకుండా, ఉద్యోగులకు క్షమాపణ చెప్పండి. వారిపై విధించిన సస్పెన్షన్లను బేషరతుగా ఎత్తివేయండి’ అని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు.

గ్రామ–వార్డు సచివాలయాల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం 
ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు వారి జగనన్నగా నేను హామీ ఇస్తున్నాను. దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులతో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే గ్రామ–వార్డు సచివాలయాల వ్యవస్థను మునుపటి కంటే మరింత బలోపేతం చేస్తాం. తద్వారా గ్రామ స్వరాజ్యం మూడు పువ్వులు – ఆరుకాయలుగా వర్దిల్లుతుంది, మాట ఇస్తే, మాటమీద నిలబడే విశ్వసనీయ పాలన మళ్లీ ఉజ్వలిస్తుంది. 

ఉద్యోగులు తమ బాధ్యతలను గొప్పగా నిర్వర్తించేలా, ప్రజలకు అద్భుతమైన సేవలు మళ్లీ అందేలా, దేశం అంతా మన వైపు చూసేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రెండున్నరేళ్లు అయిపోయింది. ఇక మిగిలింది రెండున్నరేళ్లు మాత్రమే. కళ్లు మూసుకుంటే ఆ కాలం కూడా ఇట్టే గడిచి పోతుంది. మన అందరి ప్రభుత్వం తప్పక వస్తుంది. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది.

Back to Top