తాడేపల్లి : పేద, మధ్యతరగతి ప్రజలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకానికి కూటమి ప్రభుత్వం దారుణంగా వెన్నుపోటు పొడుస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) పేరుతో అంతులేని దోపిడీకి తెరలేపిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కేవలం 22 నెలల్లోనే ఏకంగా రూ.1,298 కోట్లను సీఎంఆర్ఎఫ్ కింద డ్రా చేసి.. ఇందులో రూ.1000 కోట్లు ఆరోగ్యశ్రీ పరిధిలోని వ్యాధులకే కేటాయించడం భారీ కుంభకోణమని తేల్చి చెప్పారు. ఒకవైపు నెట్‌వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన రీయింబర్స్‌మెంట్‌లో రూ.3,000 కోట్లకు పైగా బకాయిలు పెట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు అధికార కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి అనుయాయులకు చెందిన ఆసుపత్రులకు సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ నిధులను అడ్డగోలుగా దోచిపెడుతున్నారని ఆయన విమర్శించారు. లేని పేషెంట్లకు సైతం దొంగ ఎల్వోసీలు సృష్టించి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం పట్టించుకోకపోవడం ఆయన అవినీతి పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎంఆర్ఎఫ్ ద్వారా విడుదల చేసిన నిధులపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని, స్వతంత్ర సంస్థతో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే.. సీఎం రిలీఫ్ ఫండ్ డేటాను ఎందుకు దాస్తున్నారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఆసుపత్రికి ఎంత మొత్తం ఎల్వోసీలు (లెటర్ ఆఫ్ క్రెడిట్) ఇచ్చారు, ఎవరికి ఎంత రీయింబర్స్‌మెంట్ చేశారనే కీలక డేటాను పబ్లిక్ డొమైన్ నుంచి ఎందుకు తొలగించారు? ఏ జిల్లాలో ఏ ఆసుపత్రికి ఎంత బిల్లింగ్ చేశారు, ఏ వ్యాధికి ఎంత చెల్లించారనే వివరాలను ప్రజలకు తెలియకుండా గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారు? మీ ఎమ్మెల్యేలు, నాయకుల ప్రైవేటు ఆసుపత్రులకు నిధులు దోచిపెడుతున్న విషయం బట్టబయలవుతుందనే భయంతోనే ఈ వివరాలన్నింటినీ తొక్కిపెట్టారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేద రోగులకు కాకుండా కూటమి నేతల జేబుల్లోకి వెళ్తోంది. టీడీపీ ఎమ్మెల్యే ఆసుపత్రి కుంభకోణమే ప్రత్యక్ష నిదర్శనం.. నర్సరావుపేట టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుకు చెందిన ఆసుపత్రిలో జరిగిన సీఎంఆర్ఎఫ్ గోల్‌మాల్ వ్యవహారమే కూటమి ప్రభుత్వ అవినీతికి నిలువెత్తు నిదర్శనం. ఆ అక్రమాలు సాక్షాత్తు ప్రభుత్వ అనుకూల పత్రికల్లోనే ప్రముఖంగా వచ్చాయి. దళారులు టీడీపీ ఎమ్మెల్యేల ఖాళీ లెటర్ ప్యాడ్లపై సంతకాలు తీసుకుని, 10 నుంచి 20 శాతం వరకు కమీషన్లు దండుకుంటూ ఎల్వోసీలు తెచ్చుకుంటున్న ఆడియో రికార్డులు బయటపడ్డా ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఎమ్మెల్యే సొంత ఆసుపత్రి కాబట్టే కంటితుడుపుగా నోటీసులు ఇచ్చి కేసును తొక్కిపెట్టారు. ఇప్పటివరకు అసలైన దోషులపై ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోలేదు?. ఆరోగ్యశ్రీకి మంగళం.. సొంత ఆసుపత్రులకు అదనపు చెల్లింపులు. వైఎస్ రాజశేఖరరెడ్డి గారు పేదల కోసం తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా చంపేసింది. రూ.3,000 కోట్లకు పైగా బకాయిలు పెట్టడంతో నెట్‌వర్క్ ఆసుపత్రులు మూడుసార్లు సమ్మె చేశాయి. హాస్పిటల్స్ నుంచి బ్యాంక్ గ్యారెంటీలు తీసుకుని రూ.1,000 కోట్లు ఇచ్చి, ఆ తర్వాత చేతులెత్తేశారు. మరోపక్క ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యే ప్రొసీజర్లకు కూడా నిబంధనలకు విరుద్ధంగా సీఎంఆర్ఎఫ్‌లో లక్షలు చెల్లిస్తున్నారు. ఉదాహరణకు ఆర్థోపెడిక్ ACL రీకన్‌స్ట్రక్షన్ సర్జరీకి ఆరోగ్యశ్రీలో రూ.53,500 ఇస్తుంటే, అదే సర్జరీకి తమకు కావాల్సిన ఆసుపత్రులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.70,509 చొప్పున అదనంగా రూ.20 వేలు చెల్లించి దోచిపెడుతున్నారు. 22 నెలల్లో రూ.1,298 కోట్ల విడుదల- భారీ దోపిడీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు పదేళ్ల కాలంలో 23 జిల్లాలకు కలిపి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఖర్చు చేసింది రూ.758 కోట్లు మాత్రమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2019–2024 మధ్య ప్రాణాంతక కరోనా మహమ్మారి సంక్షోభం ఎదురైనా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఖర్చు చేసింది రూ.897 కోట్లు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కేవలం 22 నెలల్లోనే ఏకంగా రూ.1,298 కోట్లను సీఎంఆర్ఎఫ్ కింద డ్రా చేశారు. ఇందులో రూ.1,000 కోట్లకు పైగా సొమ్ము ఆరోగ్యశ్రీ పరిధిలోని వ్యాధులకే చెల్లించడం విడ్డూరం. రాష్ట్రంలోని కేవలం 10 నుంచి 15 శాతం ఉన్న కూటమి పెద్దల ఆసుపత్రులకే ఈ వేల కోట్ల నిధులను మళ్లించారు. సర్కారీ దవాఖానాలు భూత్ బంగ్లాలు.. లోకేష్‌కు పీఆర్ పిచ్చి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం రోగులకు మందులు కూడా దొరకని దుస్థితి నెలకొంది. అద్దంకి నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలిస్తే 50 పడకలు కూడా సరిగ్గా లేవు, అది ఒక భూత్ బంగ్లాలా మారింది. డాక్టర్లు కష్టపడుతున్నా ప్రభుత్వం కనీస మౌలిక వసతులు కల్పించడం లేదు. పేదల ప్రాణాల కంటే మంత్రి నారా లోకేష్‌కు పీఆర్ పబ్లిసిటీయే ముఖ్యమైపోయింది. సోషల్ మీడియాలో నెలకో నాలుగైదు ట్వీట్లు పెట్టించి, వెంటనే రియాక్ట్ అయినట్లు బిల్డప్ ఇస్తూ తమ పార్టీ కార్యకర్తలకు, అనుకూల వర్గాలకే లబ్ధి చేకూరుస్తున్నారు. ఇతర పార్టీల వారైనా, తటస్థులైనా.. పేదలైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వరా?. వైఎస్సార్సీపీ సూటి డిమాండ్లు.. ఈ నేపధ్యంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా పేదల ప్రాణాలతో చెలగాటమాడటం ఆపాలని, 2024 నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన ప్రతీ సీఎంఆర్ఎఫ్ నిధులపై తక్షణమే శ్వేతపత్రం (White Paper) విడుదల చేయడంతో పాటు, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధి పొందిన ఆసుపత్రులు, ఎల్వోసీలు, రీయింబర్స్‌మెంట్లపై స్వతంత్ర సంస్థతో ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని డాక్టర్ అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. దీంతోపాటు రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన పేదలకు నేరుగా సహాయం అందేలా 'డైరెక్ట్ బెనిఫిషియరీ సిస్టమ్', ప్రతి దరఖాస్తును ప్రజలు చూసుకునేలా పబ్లిక్ డొమైన్‌లో ట్రాకింగ్ వ్యవస్థను వెంటనే అమలు చేయాలన్నారు.