కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి పెను ముప్పు

మాజీ మంత్రి సాకే శైలజానాథ్ స్పష్టీకరణ.

ఆర్టికల్ 324ను కాలరాసి వన్ మ్యాన్ ఆటోక్రసీ నడుపుతున్నారు:

కమిషనర్ల 14 అభ్యంతరాలను తొక్కిపెట్టిన సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలి

మాజీ మంత్రి సాకే శైలజానాధ్ డిమాండ్

తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్. 

రెండు గంటల్లో 17 లక్షల ఓట్లు ఎలా పోలయ్యాయి?

వీవీప్యాట్ స్లిప్పులను హడావుడిగా ఎందుకు కాల్చేశారు?:

ఎన్నికల వ్యవస్ధలో లోపించిన పారదర్శకత 

ఎన్నికల నిర్వహణపై ప్రజాస్వామ్యవాదుల్లో భయాందోళనలు

తేల్చి చెప్పిన సాకే శైలజానాధ్

తాడేపల్లి:ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికల సంఘం పనితీరు, దాని పారదర్శకతపై తీవ్రస్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘం నిర్ణయాలు, ఈసీఐనెట్ (ECINet) నిర్వహణ, ఓటర్ల జాబితాలపై తోటి ఎన్నికల కమిషనర్లే పలుమార్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు రావడం యావత్ దేశ ప్రజల్లో అనేక సందేహాలను రేకెత్తిస్తోందని తెలిపారు. 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ రోజు నమోదైన శాతానికి, ఆ తర్వాత నాలుగు రోజులకు ఈసీ అధికారికంగా ప్రకటించిన శాతానికి మధ్య అనూహ్యమైన భారీ వ్యత్యాసం ఉండటం ట్యాంపరింగ్ అనుమానాలకు బలం చేకూరుస్తోందని ఆయన స్పష్టం చేశారు. కమిషనర్ల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలపై ప్రజలకు తగిన వివరణ ఇవ్వాలని, గత ఎన్నికల్లో జరిగిన గణాంకాల తేడాలు, వ్యవస్థాగత లోపాలపై విస్తృత చర్చ జరిగి సమగ్ర రీ-ఎగ్జామినేషన్ నిర్వహించాలని, అప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థపై పౌరులకు సంపూర్ణ నమ్మకం కలుగుతుందని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంకా ఆయన ఏమన్నారంటే...

రాజ్యాంగ విరుద్ధంగా వన్ మ్యాన్ ఆటోక్రసీ.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘంలోని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), మిగతా ఇద్దరు కమిషనర్లు సమానమైన హోదా, అధికారాలు కలిగిన వ్యక్తులు. సీఈసీ మొదటి వాడే కావచ్చు కానీ అందరికంటే అధికుడు కాదు. ఎలాంటి నిర్ణయాలైనా మెజారిటీ అభిప్రాయం లేదా ఏకగ్రీవంగా జరగాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది. కానీ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తోటి కమిషనర్ల అభిప్రాయాలను బేఖాతరు చేస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. తోటి కమిషనర్లు 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోకుండా, ఎన్డీయే కూటమికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు. రాజ్యాంగ నిబంధనలను కాలరాసి వన్ మ్యాన్ ఆటోక్రసీ నడుపుతున్న సీఈసీని కేంద్ర ప్రభుత్వం తక్షణమే పదవి నుంచి తప్పించాలి..

రెండు గంటల 15 నిమిషాల్లో 17 లక్షల ఓట్లు ఎలా పోలయ్యాయి?.

2024 మే 13న ఏపీలో పోలింగ్ ముగిసిన రోజు రాత్రి 11:45 గంటలకు 76.50 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) స్వయంగా వెల్లడించారు. తీరా మే 17 నాటికి అది 81.66 శాతానికి ఎలా పెరిగింది? పోలింగ్ ముగిసిన రోజు రాత్రి 11:45 నుండి అర్ధరాత్రి 2 గంటల మధ్య—కేవలం 2 గంటల 15 నిమిషాల వ్యవధిలోనే రాకెట్ కంటే వేగంగా 17,19,482 ఓట్లు ఎలా ఈవీఎంలలో నమోదయ్యాయి? సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల మధ్య పోలింగ్ శాతం కేవలం 0.08 శాతంగా ఉంటే, అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా ఓట్లు కుప్పలుతెప్పలుగా ఎలా వచ్చిపడ్డాయి? ఈ లెక్కలపై ఇప్పటివరకు రాష్ట్ర సీఈఓ గానీ, కేంద్ర ఎన్నికల సంఘం గానీ స్పష్టమైన వివరణ ఎందుకు ఇవ్వలేదు?.

వీవీప్యాట్ స్లిప్పుల దహనం.. వీడియో ఫుటేజీల దాపరికం ఎందుకు?

ఏపీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై విచారణకు అవకాశం లేకుండా హడావుడిగా వీవీప్యాట్ స్లిప్పులను ఎందుకు కాల్చేశారు? పోలింగ్ కేంద్రాల్లో రికార్డైన వెబ్‌కాస్టింగ్ వీడియో క్లిప్పింగులను బహిర్గతం చేయమంటే ఈసీ ఎందుకు వెనుకాడుతోంది? కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్ష వైఖరి, అనుమానాస్పద విధానాల వల్ల అత్యధికంగా నష్టపోయింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే. ప్రజల్లో నెలకొన్న ఈ తీవ్రమైన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై లేదా?.

నియామక చట్టంపై పునఃసమీక్ష జరగాలి..

మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా.. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో పారదర్శకత కనిపించాలి. 2023 నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్ల నియామక చట్టాన్ని కేంద్రం పునఃసమీక్షించాలి. ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI), లోక్‌సభ ప్రతిపక్ష నేత (LoP)లతో కూడిన తటస్థ కమిటీని తిరిగి పునరుద్ధరించాలి. పరీక్ష రాసే విద్యార్థే పరీక్షకుడిని ఎంపిక చేసుకునే విధానం ఉంటే నిష్పాక్షికత ఉండదు. స్వతంత్ర కమిటీ ఉంటేనే రాజ్యాంగ సంస్థలపై గౌరవం, విశ్వాసం పెరుగుతాయి.

ఓటర్ల జాబితాల తొలగింపు.. కుట్రపూరిత వైఖరి.

ఓట్ల తొలగింపు, చేర్పుల ప్రక్రియను పూర్తిగా ఢిల్లీ స్థాయిలోనే కేంద్రీకరించి లోపభూయిష్టంగా మార్చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయి. బతికున్న పౌరుల పేర్లను తొలగించి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. మాజీ మంత్రినైన నాకు, నా భార్యకు కూడా పేర్లలో అనుమానాలున్నాయంటూ నోటీసులు ఇచ్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పేదలు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల ఓటు హక్కును హరించే కుట్ర జరుగుతోంది. ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) మరియు స్థానిక సంస్థల డివిజన్ల పునర్విభజనలో అధికార కూటమి చేసిన దుర్వినియోగంపై మేం చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోలేదు.

పాత జాబితాలతో స్థానిక సంస్థల ఎన్నికలా?.

రాష్ట్రంలో లక్షలాది డబుల్ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు ఉన్న పాత ఓటర్ల జాబితాతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టుకు చెప్పడం అత్యంత దారుణం. చనిపోయిన వ్యక్తుల పేర్లతో నామినేషన్లు వేస్తే అంగీకరిస్తారా? ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉండేలా ఎన్నికలు నిర్వహిస్తారా? ఇలాంటి అక్రమాలను అరికట్టి, తప్పులను సరిదిద్దే వరకు ప్రజాక్షేత్రంలో, న్యాయస్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుందని సాకే శైలజానాధ్ స్పష్టం చేశారు.

Back to Top