మ‌ద్యం దందాపై ప్ర‌శ్నిస్తే అక్ర‌మ అరెస్టులా? 

గుండా సురేంద్ర ఫైర్‌

పార్టీ కేంద్ర  కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు గుండా సురేంద్ర 

ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా న‌కిలీ మ‌ద్యం గుట్టుర‌ట్టు 

అందుకే మంగ‌ళ‌గిరిలో గిరిజ‌న యువ‌కుడు అరెస్టు 

ఎమ్మార్పీ క‌న్నా అధిక ధ‌ర‌ల‌కు మ‌ద్యం విక్ర‌యం 

సోష‌ల్ మీడియాలో పోస్టు చేసినందుకు హైద‌రాబాద్‌లో అరెస్టు చేసిన పోలీసులు 

ఆ యువ‌కుల ఆచూకీని త‌క్ష‌ణం త‌ల్లిదండ్రుల‌కు వెల్ల‌డించాలి

గుండా సురేంద్ర డిమాండ్‌

తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రశ్నించే గొంతులను అణచివేయడమే ఏకైక అజెండాగా పాలన సాగిస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ  ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు గుండా సురేంద్ర మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మార్కెట్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యాన్ని అమ్ముతున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన మహేశ్వర్ రెడ్డి అనే యువకుడిని ప్రభుత్వం రాత్రికి రాత్రే హైద‌రాబాద్‌లో అరెస్ట్ చేసి రహస్య ప్రాంతంలో నిర్బంధించార‌ని, క‌నీసం తల్లిదండ్రుల‌కు కూడా అత‌డి ఆచూకీ చెప్ప‌కుండా వేధించ‌డం దారుణమని గుండా సురేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో ఘ‌ట‌న‌లో మంగ‌ళ‌గిరికి చెందిన ఒక గిరిజ‌న యువ‌కుడు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా న‌కిలీ మ‌ద్యం గుట్టును ర‌ట్టు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు అరెస్టు చేశార‌ని ఆరోపించారు. వారిద్ద‌రి ఆచూకీపై వారి త‌ల్లిదండ్రుల‌కు త‌క్ష‌ణం స‌మాచారం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. మంగ‌ళగిరిలో అరెస్ట్ అయిన గిరిజన యువ‌కుడికి ఏదైనా జ‌రిగితే చూస్తూ ఊరుకునేది లేద‌ని, దానికి ఎమ్మెల్యే నారా లోకేష్ బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని సురేంద్ర హెచ్చ‌రించారు. మద్యం వ్యవహారంలో ఆరోపణలు వస్తున్న సమయంలో వాటిపై విచారణ చేయకుండా ప్రశ్నించిన వారిని అరెస్టులు, కేసులతో భయపెట్టడం ప్రభుత్వ వైఫల్యంగా భావించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

మంత్రి నారా లోకేష్‌దే బాధ్య‌త 

కూటమి ప్రభుత్వం ఏర్ప‌డిన నాటి నుంచి ప్రజాస్వామ్యానికి సరికొత్త నిర్వచనం చెబుతూ, ప్రశ్నించే గొంతులను అణచివేయడమే ఏకైక అజెండాగా పాలన సాగిస్తా ఉంది. డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేయకపోతే సీబీఐ విచారణ జరిపించాలని, సంబంధిత మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ నిరసన చేపడితే అక్ర‌మ కేసులతో వేధిస్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యాన్ని అమ్ముతున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన మహేశ్వర్ రెడ్డి అనే యువకుడిని ప్రభుత్వం రాత్రికి రాత్రే హైదరాబాద్ వెళ్లి మ‌రీ అరెస్ట్ చేసి రహస్య ప్రాంతంలో నిర్బంధించి, కనీసం తల్లిదండ్రులకు కూడా అతడి ఆచూకీ చెప్పకుండా వేధించడం దారుణం. మ‌రో ఘ‌ట‌న‌లో ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా నకిలీ మద్యం గుట్టును రట్టు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు మంగళగిరికి చెందిన ఒక గిరిజన యువకుడిని కూడా అరెస్ట్ చేశారు. వారిద్దరి ఆచూకీపై వారి తల్లిదండ్రులకు తక్షణం సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మంగళగిరిలో అరెస్ట్ అయిన ఆ గిరిజన యువకుడికి ఏదైనా జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని, దానికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేషే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం.

న‌కిలీ మ‌ద్యంపై ఎల్లో మీడియా క‌థ‌నాలు 

రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపుల్లో కల్తీ మద్యం దందా జోరుగా సాగుతున్నా పట్టించుకోని ఈ ప్రభుత్వం, నిజాన్ని నిలదీసిన వారిని మాత్రం అక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తోంది. అధిక ధరల మద్యంలో తక్కువ ధరల మద్యం కలపడం, తక్కువ ధరల మద్యంలో నీళ్లు కలపడం వంటి ఆరోపణలు వస్తున్నప్పటికీ, సంబంధిత మంత్రులు గానీ అధికారులు గానీ ప్రజలకు సమాధానం చెప్పడం లేదు. విశాఖపట్నంలో 143 వైన్‌షాపుల్లో కల్తీ మద్యం దందా జరుగుతోందని పచ్చ మీడియాయే కథనాలు ఇస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నాం. గతంలో చంద్రబాబు జే-బ్రాండ్ అంటూ మాపై నిరాధార ఆరోపణలు చేశారు. కానీ, నేడు సొంత పార్టీ నేతల కుటీర పరిశ్రమల ద్వారా నకిలీ మద్యం సప్లై అవుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారు? మద్యం వ్యవహారంలో ఆరోపణలు వస్తున్న సమయంలో విచారణ జరపకుండా, ప్రశ్నించిన వారిని అరెస్టులు, కేసులతో భయపెట్టడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. గిరిజన యువకుల గొంతు నొక్కే కుట్రలను మాని, రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యం దందాలపై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ కమిటీని వేసి వాస్తవాలను ప్రజల ముందుంచాలని గుండా సురేంద్ర డిమాండ్ చేశారు.

Back to Top