అనపర్తి/తాడేపల్లిగూడెం: వాయుగుండం, తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాల్లో వైయస్ఆర్‌సీపీ నేతలు పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. అనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అనపర్తి గ్రామంలోని షారోన్‌పురం, వెంకటరత్నాపురం ప్రాంతాలతో పాటు కొత్తూరు వెళ్లే మార్గాలను పరిశీలించారు. దుప్పలపూడి నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బాధితులకు కనీసం ఆహారం, అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి వడ్డి రఘురామ్ నాయుడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జగన్నాథపురం తదితర ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహించడంతో నీటమునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంట నష్టంతో పాటు సాగు కోసం చేసిన పెట్టుబడులు కూడా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ముంపు బాధితులు, పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకుని అవసరమైన సహాయం అందించాలని వడ్డి రఘురామ్ నాయుడు కోరారు.