తిరుపతి: రాష్ట్రంలో ముందుచూపు లేకుండా ప్రాజెక్టులు ప్రకటించడం, ఆ తర్వాత వాటిని మొదలు పెట్టలేక అర్ధరాత్రి జీవోలతో హఠాత్తుగా రద్దు చేయడం కూటమి ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని మూడు గ్రామాల పరిధిలో 18 నెలల క్రితం ప్రతిపాదించిన పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టును అర్ధాంతరంగా రద్దు చేస్తూ జీవో ఇవ్వడం ఏంటని భూమన ప్రశ్నించారు. అప్పట్లో పర్యావరణహిత ప్రాజెక్టుగా దీన్ని చెప్పుకున్న సీఎం చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం అదే పర్యావరణ సమస్యల పేరు చెప్పి రద్దు చేయడం వెనుక కుట్ర దాగుందన్నారు. ఆ మతలబు ఏంటో బయటపెట్టాలని భూమన కరుణాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్లో భూమన కరుణాకర్ రెడ్డి ఇంకేమన్నారంటే.. చంద్రబాబు మార్క్ పారిశ్రామిక విధానం రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక విధానం తెచ్చినట్లు కనిపిస్తోంది. ఆర్బాటంగా పరిశ్రమ వస్తుందని ఓ ప్రకటన ఇవ్వడం, చివరికి రద్దు చేయడం టీడీపీ ప్రభుత్వ కొత్త పెట్టుబడి విధానంలా కనిపిస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఎప్పుడూ, ఎక్కడా లేని విధంగా ఈ కొత్త విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తోంది. సరిగ్గా 18 నెలల క్రితం ఈ ప్రభుత్వం.. 10,300 కోట్ల తో అన్నమయ్య జిల్లా నందలూరు మండలం చింతకుంట పాలెం, మంటపం పల్లె, కొమ్మూరు గ్రామాల్లో పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు గతేడాది ఫిబ్రవరి 7న జీవో ఇచ్చింది. దీని ద్వారా దాదాపు 3 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని, పర్యావరణ సహిత విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది. కానీ నిన్న అర్ధరాత్రి ఈ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు ఓ జీవో విడుదల చేసింది. అంటే 10, 300 కోట్ల ప్రతిపాదిత ప్రాజెక్టును రద్దు చేస్తూ అర్ధరాత్రి 2 గంటలకు చీకటి జీవో ఇచ్చారు. గతంలో మొదటి జీవో ఇచ్చినప్పుడు రాయలసీమకు తలమానికమని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు మాత్రం అర్ధరాత్రి ఈ ప్రాజెక్టును మాయం చేసింది. పర్యావరణ సమస్యలు ఉన్నాయి, టైగర్ జోన్ సున్నిత ప్రాంతం కాబట్టి సమస్యలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఈ ప్రాజెక్టు రద్దు చేశారు. కుందేళ్లు కూడా తిరగని చిట్టడవి, తొండలు, పావురాళ్లకు ఆవాసమైన ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ఉంది. అనుమతులు ఇచ్చినప్పుడు ఈ ప్రాజెక్టు పర్యావరణ సమతౌల్యం దెబ్బతీస్తోందని తెలియదా ? పోలవరం, శ్రీశైలం, భాక్రా నంగల్ వంటి ప్రాజెక్టులే అన్ని అనుమతులతో నిర్మించారు. కానీ పర్యావరణ సమతౌల్యత లేదని తెలిసినా ప్రాజెక్టు మొదలుపెట్టి చివరికి రద్దు చేసింది. ఇదేనా మీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ ? స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సృష్టికర్త లోకేష్ పాలసీల వల్ల రాష్ట్రానికి నష్టమే జరుగుతోంది, వారి విధానాల వల్ల రాష్ట్రం నుంచి కంపెనీలు తరలిపోతున్నాయి. ఈ ఏడాది జూన్, జూలైలో టాటా ఇంగాట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టు ఒడిశాకు తరలిపోయింది. వెబ్ సోల్ అనే కంపెనీ పశ్చిమ బెంగాల్ కు తరలిపోయింది. ఇంకా ఎన్నో కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. మీ అనాలోచిత నిర్ణయాల వల్లే కంపెనీలు ఇతర రాష్ట్రాలు తరలిపోతున్నాయి. ఇవన్నీ మీ కమిషన్లకు భయపడి తరలిపోతున్నాయా లేక ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా తేలాల్సి ఉంది. విశాఖలో జరిగిన పార్ట్ నర్ షిప్ సమ్మిట్ లో పత్రికా ప్రకటనలు, రీల్స్ కోసమే పనికొస్తున్నాయే తప్ప ఆచరణలో ఏ భారీ ప్రాజెక్టూ రావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల ఆకర్షణ కోసమంటూ లోకేష్ విదేశాల్లో తిరగడం, భారీ ప్రాజెక్టులు తరలివస్తున్నాయని చెప్పడం చూస్తున్నాం. కానీ అన్నమయ్య జిల్లాలో గతంలో తెస్తామని చెప్పిన పంప్డ్ హైడ్రో ప్రాజెక్టును ఎందుకు రద్దు చేశారో అసలు కారణాలు చెప్పాలి. ఇది దేశంలోనే గొప్ప ప్రాజెక్టు, 3 వేల ఉద్యోగాలు తెస్తామని గొప్పలు చెప్పి ఇప్పుడు ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది. అంటే ప్రాజెక్టు ప్రకటనకు ముందుగా పూర్తి వివరాలు ప్రజల ముందు పెట్టాలన్న ఇంగితం మీకు లేకుండా పోతోంది. సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా, పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టులు మొదలుపెట్టడం, ఇలా మూలనపడేయడం సర్వసాధారణంగా మారుతోంది. దీని వెనుక ఉన్న మతలబు ఏంటో చాలా అనుమానాలు ఉన్నాయి, కాబట్టి ప్రభుత్వం ఆ మతలబు ఏంటో బయటపెట్టాలి. కుందేళ్లు తిరిగే ఈ చిట్టడవిలో పులుల సంచారం ఉందంటూ మీరు అబద్ధాలు చెప్తున్నారంటే, అసలు కారణాలు వేరే ఉన్నాయని ఇట్టే అర్దమవుతోంది. దాదాపు 2 వేల మెగావాట్ల సామర్ధ్యంతో ఈ ప్రాజెక్టు తెస్తున్నామని పెద్ద పెద్ద ప్రకటనలు చేసిన చంద్రబాబు, లోకేష్ ఇప్పటికైనా వాస్తవాలు బయటపెట్టాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.