దౌర్జన్యాలు కొనసాగితే రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదు

వైయస్సార్‌సీపీ నాయకుల హెచ్చరిక

అర్ధరాత్రి అక్రమ అరెస్టులు ఇకనైనా ఆపండి 

వైయస్సార్‌సీపీ నాయకుల డిమాండ్‌

విజయవాడలో శాప్‌ ఆఫీస్‌ వద్ద ఈనెల 21న నిర్వహించిన శాంతియుత నిరసన కార్యక్రమంలో పాల్గొన్న 
వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడంతో పాటు, అరెస్టుల పర్వంపై విజయవాడ 
పోలీస్‌ కమిషనర్‌ (సీపీ) వినతిపత్రం ఇచ్చేందుకు పార్టీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు 
వెళ్లారు.

ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రూహుల్లా, మురుగుడు హన్మంతరావు, కల్పలతారెడ్డి, ఏసురత్నం, మాజీ మంత్రులు 
అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాస్, విడదల రజిని, సాకె శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, 
మొండితోక జగన్‌మోహన్‌రావు, సింహాద్రి రమేష్, నల్లగట్ల స్వామిదాసు, పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు 
దొంతిరెడ్డి వేమారెడ్డి, వరికూటి అశోక్‌ బాబు, దేవభక్తుని చక్రవర్తి, డైమండ్‌ బాబు, నూరి ఫాతిమా, అంబటి మురళి, పీట మోహన్‌కృష్ణ, ఎన్టీఆర్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్, విజయవాడ మాజీ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి తదితరులు సీపీ ఆఫీస్‌కు వెళ్లారు.

ముందుగా సమాచారం ఇచ్చినప్పటికి సీపీ అందుబాటులో లేకపోవడంతో, డీసీపీకి వినతి పత్రం ఇచ్చిన వారు, 
అక్కడే ఆఫీస్‌ వద్ద మీడియాతో మాట్లాడారు.

నిరుద్యోగుల గొంతు నొక్కడం అత్యంత హేయం

అయినా వైయస్సార్‌సీపీ ఎప్పటికీ భయపడపోదు

విపక్ష నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు..

ఇంకా అర్ధరాత్రి అరెస్టులతో ప్రజాస్వామ్యం ఖూనీ

పోలీసుల తప్పుడు కేసులు. అరాచకాల పర్వం

వాటిని న్యాయస్థానంలో ఎదుర్కొంటాం

వైయస్సార్‌సీపీ నాయకుల స్పష్టీకరణ

విజయవాడ:     డీఎస్సీ అక్రమాలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా.. ప్రశ్నిస్తున్న వారిని కేసులు, అరెస్టులతో గొంతు నొక్కాలని చూస్తోందని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆక్షేపించారు. అక్రమ అరెస్టులతో తమ పార్టీ నాయకులపై జరుగుతున్న అణచివేత, అక్రమ అరెస్టులపై వారు ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థ చట్టప్రకారం వ్యవహరించాలని, డీఎస్సీ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వెన్నుపోటు పార్టీ కనుసన్నల్లోనే పోలీస్‌ యంత్రాంగం రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, అర్ధరాత్రి పూట ఇళ్లలోకి వెళ్లి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు.
    తమ పార్టీ నిర్వహించే శాంతియుత నిరసనలకు అనుమతి నిరాకరించి, టీచర్ల ముసుగులో వచ్చిన గూండాలకు ఎలా అనుమతించారని పోలీసులను ప్రశ్నించారు. అదే విధంగా బందర్‌ రోడ్డులో పర్మిషన్‌ లేదంటూనే టీడీపీ, జనసేన పార్టీ ర్యాలీలకు ఎలా అనుమతులిస్తున్నారని నిలదీశారు. తమ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు, దివ్యాంగులపై దాడులు జరిగాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని డీసీపీని కోరినట్లు చెప్పారు. 
    మరోవైపు తమ పార్టీ వారిపై సెక్షన్‌–307తో పాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి అరెస్టులు, పోలీస్‌ స్టేషన్లలో తీసుకుంటున్న చర్యలు ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధమని గుర్తు చేశారు. అధికార పార్టీ నాయకుల అండతో శాంతిభద్రతలను కాలరాస్తున్న పోలీసుల వైఖరిని ప్రజల ముందటే నిలదీస్తామని, చట్టాన్ని ఉల్లంఘించే అధికారులకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కేసుల విషయంలో పునరాలోచన చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని విజయవాడ సీపీ ఆఫీస్‌ వద్ద మీడియాతో మాట్లాడిన వైయస్సార్‌సీపీ నాయకులు స్పష్టం చేశారు. 
ఈ సందర్భంగా ఎవరెవరు ఏమేం మాట్లాడారంటే..:

లేళ్ల అప్పిరెడ్డి. ఎమ్మెల్సీ:
– డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై మేము ఆధారాలతో ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పోలీసులను అడ్డం పెట్టుకుని కేసులు, అర్ధరాత్రి అరెస్టులతో నాయకులు, కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. మొన్న 21వ తేదీన శాంతియుతంగా ర్యాలీ చేయడానికి మేము అనుమతి అడిగితే తిరస్కరించారు, కానీ మరోవైపు అంతమంది టీచర్లను ఏ అనుమతితో లోపలికి తీసుకెళ్లారో చెప్పాలి. వారికి రక్షణగా 300 మంది కర్రలు, రాడ్లతో ఉండేలా ఎందుకు అనుమతించారో కూడా పోలీసులు సమాధానం చెప్పాలి. వైఎస్సార్సీపీ  కార్యకర్తలు వందల సంఖ్యలో వస్తారని తెలిసినప్పటికీ రెండు వర్గాలు ఎదురెదురుగా వచ్చే పరిస్థితిని పోలీసులు ఎందుకు నివారించలేక పోయారో చెప్పాలి. ఈరోజు జరిగిన ప్రతి ఘటన మీడియా, డ్రోన్లు, వందలాది కెమెరాల్లో రికార్డు అవుతోందని, ఆ ఆధారాల నుంచి ఎవరూ తప్పించుకోలేరని గుర్తుంచుకోవాలి. రాజకీయ పార్టీలను కాపాడే ప్రయత్నంలో పోలీసులు తమ విధి నిర్వహణలో తప్పులు చేసి ఉచ్చులో పడవద్దని నేను పోలీసు సోదరులను కోరుతున్నాను. 307, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ చట్టాలను చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ఉపయోగించి, యూనిఫామ్‌ వేసుకుని చేసిన ప్రమాణాన్ని గుర్తుంచుకుని విధి నిర్వహించాలని కోరుతున్నాను.’’ 

ఏసురత్నం. ఎమ్మెల్సీ:
– మేము శాంతియుతంగా ర్యాలీ చేయడానికి అనుమతి అడిగితే తిరస్కరించారు. కానీ అంతమంది టీచర్లను ఏ అనుమతితో లోపలికి తీసుకెళ్లారో చెప్పాలి. వారికి రక్షణగా 300 మంది కర్రలు, రాడ్లతో ఉండటానికి ఎవరు అనుమతి ఇచ్చారో కూడా పోలీసులు సమాధానం చెప్పాలి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు వందల సంఖ్యలో వస్తున్నారని తెలిసి కూడా రెండు వర్గాలు ఎదురెదురుగా వచ్చే పరిస్థితిని పోలీసులు ఎందుకు నివారించలేకపోయారు. ఈరోజు ఏం జరిగినా మీడియా, డ్రోన్లు, కెమెరాల్లో రికార్డు అవుతుందని, ఆ ఆధారాల నుంచి ఎవరూ తప్పించుకోలేరని గుర్తుంచుకోవాలి. ఏదో ఒక రాజకీయ పార్టీని కాపాడే ప్రయత్నంలో పోలీసులు తాము ఉచ్చులో పడకూడదని నేను పోలీసు సోదరులను కోరుతున్నాను. 307, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలను ఎప్పుడు ఉపయోగించాలో పోలీసులకు తెలియదా అని ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి కానీ యూనిఫామ్‌ వేసుకున్న పోలీసులు తమ విధి నిర్వహణలో తప్పులు చేయకుండా చట్ట ప్రకారం వ్యవహరించాలి.

అంబటి రాంబాబు. మాజీ మంత్రి:
– డీఎస్సీ నిరసన అనంతరం మా నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడంతో పాటు కేసులు పెట్టి, రాత్రిపూట ఇళ్లకు వెళ్లి భయభ్రాంతులకు గురిచేసి అరెస్టులు చేస్తున్న పరిస్థితిపై పోలీస్‌ కమిషనర్‌ను కలసి ఫిర్యాదు చేయడానికి వచ్చాం. 300 మంది మీద కేసులు పెట్టామని చెబుతున్న నేపథ్యంలో వారి జాబితా ఇస్తే మేమంతా స్వయంగా పోలీస్‌ స్టేషన్లకు వచ్చి హాజరవుతాం, కానీ ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను భయపెట్టవద్దని కోరుతున్నాం. ఆయుధాలు లేని, గాయాలు లేని ఘటనలో 307 కేసు ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నాం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడంపైనా సమాధానం చెప్పాలి. మాపై దాడులు జరిగిన సందర్భాల్లో కేసులు పెట్టకుండా, మాపైనే కేసులు పెట్టడం ద్వారా పోలీసులు ఒకే వైపు వ్యవహరిస్తున్నారని మేము ఆరోపిస్తున్నాం. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లోనై తప్పుడు కేసులు పెడుతున్నారని, రాష్ట్రంలో పోలీసింగ్‌ తీరును సరిచేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నాం. మా మీద పెట్టిన కేసులు, అరెస్టుల విషయంలో పునరాలోచన చేయకపోతే వందలాది మంది నాయకులు, కార్యకర్తలతో కలిసి పోలీస్‌ స్టేషన్లు, కమిషనరేట్‌ వద్దకు వచ్చి అరెస్టులకు సిద్ధంగా ఉంటాం. చట్ట ప్రకారం పోలీసులు వ్యవహరించకపోతే ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లి, న్యాయపరంగా కూడా ఈ కేసులను ఎదుర్కొంటామని స్పష్టం చేస్తున్నాం. 

సాకె శైలజానాథ్‌. మాజీ మంత్రి:
– డీఎస్సీ విషయంలో ప్రభుత్వం తప్పు చేసిందని, అనేక మందికి అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు ఇచ్చిన విషయం బయటపడిందని మేము చెబుతున్నాం. జరిగిన విషయాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి, బాధ్యత తీసుకోవాలి. ఈ వ్యవహారంలో ఎవరైతే భాగస్వాములయ్యారో సంబంధిత శాఖ మంత్రి బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకోవాలని మేము డిమాండ్‌ చేస్తున్నాం. మా డిమాండ్‌కు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సరైన స్పందన ఇవ్వలేదు. డీఎస్సీ విషయంలో జరిగిన అక్రమాలపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కాబట్టి డీఎస్సీ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించి, జరిగిన తప్పులకు బాధ్యత వహించాలి. 

మల్లాది విష్ణు. మాజీ ఎమ్మెల్యే:
– డీఎస్సీ నిరసన కార్యక్రమానికి మేము ముందుగానే పోలీసుల అనుమతి కోరినా మాకు అనుమతి నిరాకరించారు. మేము శాంతియుతంగా అర్జీ ఇవ్వడానికి వస్తున్నామని తెలిసిన తర్వాత శాప్‌ కార్యాలయంలోకి సుమారు 300 మందిని ఏ అనుమతితో తీసుకెళ్లారో పోలీసులు చెప్పాలి. అక్కడ టీడీపీ కార్యకర్తల సహకారంతో మా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దివ్యాంగుల విభాగంపై దాడి జరిగిన దశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి. మమ్మల్ని తీసుకెళ్లి సంబంధిత అధికారులతో మాట్లాడే అవకాశం కల్పించాల్సిన పోలీసులు ఆ పని చేయలేదు. దళితులు, మహిళలు, విద్యార్థులు, ఆడిటర్లు, డాక్టర్లపై కూడా అక్రమ కేసులు పెట్టి, అర్ధరాత్రి అరెస్టులు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నాం. పోలీస్‌ స్టేషన్లలో ఫోటోలు, వేలిముద్రలు తీసి, అర్ధరాత్రి కోర్టులకు తీసుకెళ్లడం ప్రజాస్వామ్య పద్ధతి కాదు. అమాయకులపై కేసులు పెట్టే విధానం ఆపకపోతే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టాల్సి వస్తుంది.

దేవినేని అవినాష్‌. ఎన్టీఆర్‌ జిల్లా వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు:
– డీఎస్సీలో జరిగిన అక్రమాలపై శాంతియుతంగా నిరసన తెలిపిన మా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, నిరుద్యోగులు, దివ్యాంగులపై  దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డీసీపీ గారిని కోరాం. మా కార్యక్రమానికి ముందుగానే అనుమతి కోరినా తిరస్కరించారు, కానీ జనసేన, టీడీపీ పార్టీ ర్యాలీలకు బందర్‌ రోడ్డుపై ఎలా అనుమతి ఇచ్చారో పోలీసులు సమాధానం చెప్పాలి. పోలీసుల సహకారంతో ఒక వర్గానికి టెంట్లు, కుర్చీలు, మైకులు ఏర్పాటు చేసి, మేము వస్తున్నామని తెలిసినా అక్కడ పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చేలా వ్యవహరించారు. ఇతర పార్టీల ర్యాలీలకు లేని ఆంక్షలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులపైనే ఎందుకు పెట్టారో చెప్పాలి. మా నాయకులు, కార్యకర్తలపై 307, ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి అర్ధరాత్రి అరెస్టులు చేయడం కక్షపూరిత రాజకీయాల్లో భాగమని మేము భావిస్తున్నాం. మా నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం ఆపకపోతే మేమంతా స్వయంగా పోలీస్‌ స్టేషన్లకు వచ్చి అరెస్టులకు సిద్ధంగా ఉంటాం. డీఎస్సీపై జరిగిన అక్రమాలకు సమాధానం చెప్పకుండా తప్పుడు కేసులు, తప్పుడు అరెస్టులు చేస్తే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భయపడదు.

Back to Top