విజయవాడ : డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ప్రశ్నిస్తున్న వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులపై అక్రమ కేసులు, అర్ధరాత్రి అరెస్టులతో అణచివేతకు పాల్పడుతోందని వైయస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. విజయవాడలోని సీపీ కార్యాలయానికి వెళ్లి డీసీపీ సరితకు వినతిపత్రం అందజేశారు. కేసుల్లో ఉన్న వారి జాబితా ఇస్తే తామే స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్లకు వచ్చి అరెస్టులకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వైయస్ఆర్సీపీ శాంతియుత నిరసనలకు అనుమతులు నిరాకరించి, టీడీపీ, జనసేన ర్యాలీలకు ఎలా అనుమతులు ఇస్తున్నారని ప్రశ్నించారు. పోలీసుల తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులను న్యాయస్థానంలో ఎదుర్కొంటామని, దౌర్జన్యాలు కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అంబటి రాంబాబు, మాజీ మంత్రి డీఎస్సీ నిరసన అనంతరం మా నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి రాత్రిపూట ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను భయపెట్టి అరెస్టులు చేస్తున్న పరిస్థితిపై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం. 300 మందిపై కేసులు పెట్టామని చెబుతున్న నేపథ్యంలో వారి జాబితా ఇస్తే మేమంతా స్వయంగా పోలీస్ స్టేషన్లకు వచ్చి హాజరవుతాం. ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను భయపెట్టవద్దు. కేసులు, అరెస్టుల విషయంలో పునరాలోచన చేయకపోతే పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలతో పోలీస్ స్టేషన్లకు వచ్చి అరెస్టులకు సిద్ధంగా ఉంటాం. చట్టపరంగా ఈ కేసులను ఎదుర్కొంటాం. దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా నిరసన తెలిపిన నాయకులు, నిరుద్యోగులు, దివ్యాంగులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డీసీపీని కోరాం. మా కార్యక్రమానికి అనుమతి నిరాకరించి, టీడీపీ, జనసేన ర్యాలీలకు ఎలా అనుమతులు ఇచ్చారో పోలీసులు సమాధానం చెప్పాలి. నాయకులు, కార్యకర్తలపై 307, ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి అర్ధరాత్రి అరెస్టులు చేయడం కక్షపూరిత రాజకీయాల్లో భాగం. మా నాయకులను ఇబ్బంది పెట్టడం ఆపకపోతే మేమంతా స్వయంగా పోలీస్ స్టేషన్లకు వచ్చి అరెస్టులకు సిద్ధంగా ఉంటాం. మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే డీఎస్సీ నిరసనకు ముందుగానే అనుమతి కోరినా తిరస్కరించారు. అదే సమయంలో శాప్ కార్యాలయంలోకి వందల మందిని ఏ అనుమతితో తీసుకెళ్లారో పోలీసులు చెప్పాలి. మా దివ్యాంగుల విభాగంపై దాడి జరిగిన దృశ్యాలు వీడియోల్లో ఉన్నాయి. దళితులు, మహిళలు, విద్యార్థులు, డాక్టర్లపై కూడా కేసులు పెట్టి అర్ధరాత్రి అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య పద్ధతి కాదు. అమాయకులపై కేసులు పెట్టే విధానం ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతాం. ఏసురత్నం, ఎమ్మెల్సీ మా శాంతియుత ర్యాలీకి అనుమతి నిరాకరించి, మరోవైపు వందలాది మందిని లోపలికి ఎలా అనుమతించారో పోలీసులు చెప్పాలి. రెండు వర్గాలు ఎదురెదురుగా వచ్చే పరిస్థితిని ఎందుకు నివారించలేకపోయారు? జరిగిన ప్రతి ఘటన మీడియా, డ్రోన్లు, కెమెరాల్లో రికార్డయింది. రాజకీయ పార్టీలను కాపాడే ప్రయత్నంలో పోలీసులు తమ విధి నిర్వహణలో తప్పులు చేయకూడదు. చట్ట ప్రకారం వ్యవహరించాలి. సాకే శైలజానాథ్, మాజీ మంత్రి డీఎస్సీ విషయంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలి. అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు ఇచ్చిన అంశంపై ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ వ్యవహారంలో సంబంధిత శాఖ మంత్రి బాధ్యత తీసుకుని పదవి నుంచి తప్పుకోవాలి. మా డిమాండ్లపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదు. డీఎస్సీ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి. లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలపై ఆధారాలతో ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా కేసులు, అర్ధరాత్రి అరెస్టులతో భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. వైయస్ఆర్సీపీ ర్యాలీకి అనుమతి నిరాకరించి, మరోవైపు ఇతరులకు ఎలా అనుమతి ఇచ్చారో చెప్పాలి. 307, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలను చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగానే ఉపయోగించాలి. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా విధులు నిర్వహించాలి.