కొత్తపేట: వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కోరారు. వీఆర్ఏల దీక్ష 11వ రోజుకు చేరుకున్న సందర్భంగా కొత్తపేట మెయిన్ సెంటర్లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. నాలుగు మండలాలకు చెందిన వీఆర్ఏలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎండ, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా 11 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ పరిపాలన, సంక్షేమ కార్యక్రమాల అమలులో వీఆర్ఏలు కీలకంగా సేవలందిస్తున్నారని చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. కరోనా, తుపాన్లు, వరదల సమయంలోనూ ప్రజలకు సేవలందించిన వీఆర్ఏలకు న్యాయమైన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయడంతో పాటు అర్హులైన నామినీలను రెగ్యులరైజ్ చేయాలని, అర్హత కలిగిన వారికి ప్రమోషన్ అవకాశాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే వీఆర్ఏ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని, వారి పోరాటానికి వైయస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని చిర్ల జగ్గిరెడ్డి స్పష్టం చేశారు.