నాడు బషీర్‌బాగ్‌లో గుర్రాలతో తొక్కించారు..

నేడు సచివాలయ ఉద్యోగులపై లాఠీలతో విరుచుకుపడుతున్నారు:

చంద్రబాబు తీరుపై టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజం

తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీ జే ఆర్ సుధాకర్ బాబు.

సచివాలయ ఉద్యోగులపై కూటమి సర్కార్ ఉక్కుపాదం అత్యంత దుర్మార్గం: 

వెన్నుపోటుపార్టీ కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజం

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని చంద్రబాబు భ్రష్టుపట్టించారు..

సచివాలయ ఉద్యోగుల పోరాటానికి వైయ‌స్ఆర్‌సీపీ  సంపూర్ణ మద్దతు!

స్పష్టం చేసిన టీజేఆర్ సుధాకర్ బాబు.

డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నించిన ప్రజాప్రతినిధులపై రౌడీషీట్లా?

అధికార దుర్వినియోగానికి పరాకాష్ట: ఆగ్రహం వ్యక్తం చేసిన టీజేఆర్ సుధాకర్ బాబు. 

గ్రూపింగ్ పేరుతో 30 వేల ఉద్యోగాల తొలగింపునకు కూటమి సర్కార్ కుట్ర..

హక్కుల కోసం పోరాడితే ఉక్కుపాదమా?: సూటిగా ప్రశ్నించిన టిజేఆర్ సుధాకర్ బాబు. 

తాడేపల్లి: తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన బాట పట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం పోలీసుల సాయంతో ఉక్కుపాదం మోపడాన్ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు.. నాడు ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఉద్యమంపై బషీర్‌బాగ్‌లో గుర్రాలతో తొక్కించి కాల్పులు జరిపించిన చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు, నేడు అదే రీతిలో తమ హక్కుల కోసం ధర్నా చౌక్‌లో గళమెత్తిన సచివాలయ ఉద్యోగులను పోలీసులతో తొక్కించి అణచివేస్తున్నారని మండిపడ్డారు. సర్ప్లస్ ఎంప్లాయ్‌మెంట్ అనే తప్పుడు వాదనతో గ్రూపింగ్ వ్యవస్థ పేరు తెచ్చి దాదాపు 30 వేల మంది సచివాలయ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన ధ్వజమెత్తారు. మెరిట్‌తో ఉద్యోగాలు సాధించిన విద్యావంతులను నడిరోడ్లపైకి ఈడ్చి లాఠీఛార్జ్ చేయించడం ప్రభుత్వానికే సిగ్గుచేటని.. గ్రామ, వార్డు ఉద్యోగుల్లో నెలకొన్న తొలగింపు భయాన్ని ప్రభుత్వం తక్షణమే తొలగించి,  వారి న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే...

ధర్నా చౌక్‌లో ఉద్యోగుల గొంతు నొక్కడం హేయం..

రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా తమ సమస్యలను చెప్పుకోవడానికి విజయవాడ ధర్నా చౌక్‌కు వచ్చిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేయించడం అత్యంత దారుణం. మహిళా ఉద్యోగులని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. అక్రమంగా నిర్బంధించిన వందలాది మంది సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే బేషరతుగా విడుదల చేయాలి. సమస్యలు చెప్పుకోవడానికి వస్తే చర్చలు జరపాల్సింది పోయి, డీజీపీ స్థాయి నుంచి ఎస్పీలకు ఆదేశాలిచ్చి ఉద్యోగులు రాకుండా అడ్డుకుంటారా? ఇదేమైనా నియంతృత్వ రాజ్యమా?.

గ్రామ స్వరాజ్యాన్ని చిందరవందర చేశారు..

గ్రామాల్లోని పేద ప్రజలు ఏ పనికోసమైనా మండల, జిల్లా కేంద్రాల చుట్టూ తిరగకూడదనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 15,004 సచివాలయాలను ఏర్పాటు చేసి, 540 ప్రభుత్వ సేవలను ప్రజల గుమ్మం ముంగిటకే డోర్ డెలివరీ చేయించారు. దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన ఆ అద్భుత వ్యవస్థను చంద్రబాబు సర్వనాశనం చేశారు. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు పొందిన వారిని సమర్థిస్తూ, వారికి అండగా నిలబడుతున్న ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులపై మాత్రం ఎందుకు కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తోంది? తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినవారు నిజాయితీగా ఉంటే విచారణకు భయపడాల్సిన అవసరం ఏముంది?  15,004 సచివాలయాలను 7,715 గ్రూపులుగా మార్చేసి, ఉద్యోగుల కేటాయింపులను కిచిడీ చేశారు. రెండు మూడు గ్రామాలకు ఒకరే పనిచేయాలంటూ విపరీతమైన పని ఒత్తిడి తెస్తున్నారు. ఆదివారాలు కూడా సెలవులు లేకుండా వేధిస్తూ, సాధారణంగా రావాల్సిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పెండింగ్‌లో పెట్టారు. గ్రామస్థాయిలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన సచివాలయ ఉద్యోగులపై పనిభారం పెంచడం, మరోవైపు వారిపై పోలీసు చర్యలకు దిగడం ఏ విధమైన పరిపాలనా విధానం? 

30 వేల ఉద్యోగాలను తొలగించే కుట్ర..

సర్ ప్లస్ ఎంప్లాయ్‌మెంట్ అనే తప్పుడు వాదన తెరపైకి తెచ్చి, గ్రూపింగ్ వ్యవస్థ పేరుతో దాదాపు 30 వేల మంది సచివాలయ ఉద్యోగులను తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. మెరిట్ ఆధారంగా పోటీపడి, పీహెచ్‌డీలు, ఎంటెక్‌లు, బీటెక్‌లు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతను నడిరోడ్ల మీదికి లాగడం ప్రభుత్వానికే సిగ్గుచేటు. ఉద్యోగుల గొంతుపై కత్తిపెట్టే జీవో నెం. 11ను, అనుచిత విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళన, భయాలను ప్రభుత్వం వెంటనే నివృత్తి చేయాలి.

రక్షక భటులను రాక్షస భటులుగా మార్చారు..

"నాడు బషీర్‌బాగ్‌లో విద్యుత్ ఛార్జీల ఉద్యమంపై గుర్రాలతో తొక్కించి కాల్పులు జరిపించిన చరిత్రే నేడు చంద్రబాబు పాలనలో పునరావృతమవుతోంది. డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నించిన మా కార్యకర్తలపై పోలీసులతో దాడి చేయించి దళిత నేత కాకుమాను రాజశేఖర్ మృతికి కారణమయ్యారు. రాజశేఖర్ మరణానికి నారా లోకేష్, చంద్రబాబు, పోలీసు ఉన్నతాధికారులే పూర్తి బాధ్యులు. వారిపై సుమోటోగా కేసులు నమోదు చేయాలి. చంద్రబాబు పాలనలో పోలీసులు రక్షక భటుల హోదా నుంచి టీడీపీ తొత్తులుగా, రాక్షస భటులుగా మారిపోయారు.

సచివాలయ ఉద్యోగులకూ, డిఎస్సీ ఉద్యోగులకు వేర్వేరు రూల్సా..?

గ్రామస్థాయిలో ప్రజలకు 550కి పైగా సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు టెన్త్‌ నుంచి పీహెచ్‌డీ వరకు కష్టపడి చదివి, రాత పరీక్షల్లో మెరిట్‌, ర్యాంకులు సాధించి ఉద్యోగాలు పొందినవారు. ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం, ఆర్బీకేలు, డిజిటల్‌ లైబ్రరీలు, గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలందిస్తున్న ఈ ఉద్యోగులపై ఈరోజు పోలీసులతో దాడులు చేయించడం ఎందుకు? అదే సమయంలో స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాల్లో అనర్హులకు, తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మాత్రం టెంట్లు, డీజేలు, మైకులు, భోజనాలు, ఏసీ బస్సులు, దర్శనాలతో ప్రత్యేకంగా చూసుకోవడం ఏమిటి? చదువుకున్న సచివాలయ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌ పౌరులు కాదా? వారికి రాజ్యాంగపరమైన హక్కులు లేవా? వారి సమస్యలను ప్రశ్నించే హక్కు లేదా? మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అవమానించేలా మాట్లాడితే వారిపై చర్యలు తీసుకోకుండా, ప్రశ్నించే సచివాలయ ఉద్యోగులపైనే పోలీసు కేసులు, దాడులు చేయడం ఎందుకని చంద్రబాబు నాయుడును ప్రశ్నిస్తున్నాను.

ప్రజాప్రతినిధులపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తారా?..

శాప్ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డిలపై రౌడీషీట్లు తెరుస్తామనడం అధికార అహంకారానికి నిదర్శనం. ప్రజాప్రతినిధులు రౌడీషీటర్లైతే.. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా రౌడీషీటర్లే అవుతారు. రాష్ట్రంలో చంద్రబాబు ఒక రాజులా, లోకేష్ యువరాజులా, పవన్ కళ్యాణ్ దత్తత యువరాజులా వ్యవహరిస్తూ నియంత పాలన సాగిస్తున్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తే చూస్తూ ఊరుకోం.

సచివాలయ ఉద్యోగులకు వైయ‌స్ఆర్‌సీపీ అండ..

ప్రాణాంతక కరోనా సంక్షోభ సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి లక్షలాది మంది ప్రజలను కాపాడిన చరిత్ర సచివాలయ ఉద్యోగులదని సుధాకర్ బాబు గుర్తు చేశారు.  అలాంటి ఉద్యోగులను ఈరోజు నడిరోడ్లపైకి ఈడ్చి కొట్టిస్తారా? అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అమరావతి పేరుతో 13 ఏళ్లలో ఒక్క శాశ్వత భవనం కట్టకుండా కేవలం మట్టి తరలింపు దోపిడీ వ్యాపారం చేస్తున్న బాబు సర్కార్‌కు ఉద్యోగుల సంక్షేమం ఎందుకు పట్టదని నిలదీశారు. ఈ నేపధ్యంలో సచివాలయ ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సంపూర్ణ మద్దతిస్తుందని స్పష్టం చేసిన ఆయన... రానున్నది వైయస్.జగన్ ప్రభుత్వమేనని.. ఉద్యోగులెవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

Back to Top