తాడేపల్లి: రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమరోత్సాహంతో సమాయత్తం కావాలని పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ల కీలక సమావేశంలో దిశానిర్దేశం చేసినట్లు మాజీ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో, ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు పోలీసు వ్యవస్థను, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అభ్యర్థులను ప్రలోభపెట్టడం, రెడ్ బుక్ రాజ్యాంగంతో బెదిరింపులకు పాల్పడటం వంటి అడ్డదారులు తొక్కే ప్రమాదం ఉందని, ఆ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టేలా పార్టీ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వైయస్. జగన్ హెచ్చరించినట్లు తెలిపారు. చంద్రబాబు అబద్ధాలు, విషప్రచారంలో గోబెల్స్‌నే మించిపోయారని దుయ్యబట్టిన ఆయన, డీఎస్సీ అక్రమాలపై నిరసన తెలిపిన ప్రజాప్రతినిధులపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తామంటూ హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడటం సిగ్గుచేటని, 90 కేసులు ఉన్న టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు హిమాలయాల నుంచి వచ్చిన సాధువులా అని సూటిగా ప్రశ్నించారు. తుఫానుతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతుంటే విపత్తు నిర్వహణను గాలికొదిలేసిన హోంమంత్రి కేవలం జగన్ గారిపై బురదజల్లడానికే పరిమితమయ్యారని విమర్శించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే జర్నలిస్టుల సంక్షేమాన్ని, ఆరోగ్యశ్రీ కార్డులను రద్దు చేసి, ప్రజాధనంతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు పారితోషకాలు ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం చంద్రబాబు ప్రచార పిచ్చికి నిదర్శనమని కన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే.. స్థానిక ఎన్నికలకు సమర శంఖారావం – గ్రౌండ్ లెవల్ నుంచే అభ్యర్థుల ఎంపిక. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్లతో అత్యంత కీలకమైన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. స్థానికంగా ప్రజల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉండి, పార్టీకి విధేయతతో నిలబడే నాయకులందరినీ సమగ్రంగా పరిశీలించాలని ఆయన ఆదేశించారు. స్థానిక ఎన్నికల్లో మనం తీసుకునే నిర్ణయాలే రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను కూడా ప్రభావితం చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఏకపక్ష నిర్ణయాలకు తావులేకుండా రీజనల్ కోఆర్డినేటర్లు నేరుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వెళ్లి స్థానిక నేతలు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోవాలి. అవసరమైతే కనీసం మూడు దఫాలు ఆయా ప్రాంతాలను సందర్శించి ప్రజాప్రతినిధులతో మాట్లాడాలి. రిజర్వేషన్లు ఇంకా ఖరారు కానప్పటికీ, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా బలమైన అభ్యర్థుల గుర్తింపును ఇప్పటి నుంచే ప్రారంభించాలని సూచించారు. పార్టీని ఏకతాటిపైకి తెచ్చి అందరినీ కలుపుకుపోవడమే కోఆర్డినేటర్ల బాధ్యత. ఎన్నికల ప్రక్రియ కోసం తాను 24 గంటలూ అందుబాటులో ఉంటానని జగన్ మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచే వైఎస్సార్సీపీ ఎన్నికల కసరత్తుకు శ్రీకారం చుట్టింది. చంద్రబాబు అధికార జులుంను తిప్పికొడతాం.. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైంది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో బాండ్లు రాసిచ్చి, సంతకాలు పెట్టి ప్రజలను, ఉద్యోగులను చంద్రబాబు నిలువునా మోసం చేశారు. తన వైఫల్యాలు, బలహీనతలు చంద్రబాబుకు తెలుసు కాబట్టి అధికార బలం, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి జులుం ప్రదర్శించే అవకాశం ఉంది. అడ్డదారుల్లో చంద్రబాబు చేసే ప్రతి కుట్రను, బెదిరింపులను తిప్పికొట్టడానికి వైఎస్సార్సీపీ శ్రేణులు సమాయత్తం కావాలని వైయ్. జగన్ సూచించారు. అభ్యర్థులను ఖరారు చేశాక 'రెడ్ బుక్ రాజ్యాంగం'తో భయపెట్టాలని చూస్తారు, కార్యకర్తలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల అధికారులు, పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారకుండా పారదర్శకంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గోబెల్స్‌ను మించిన అబద్ధాల ఫ్యాక్టరీ చంద్రబాబు.. ప్రజలను మోసం చేయడంలో, అబద్ధాలు ప్రచారం చేయడంలో చంద్రబాబు గోబెల్స్‌ను ఎప్పుడో దాటిపోయారు. రోజుకో అబద్ధాన్ని తయారు చేసి ప్రచారం చేయడమే కూటమి ప్రభుత్వ నైజం. బెంగళూరులో కూర్చుని జగన్ గారు విధ్వంసం సృష్టిస్తున్నారంటూ క్యాబినెట్లో సైతం అబద్ధాలు మాట్లాడుతున్నారు. తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రచారం చేశారు. చివరకు నిజం నిలకడ మీద తేలింది, నెయ్యిలో ఎలాంటి కొవ్వులు లేవని కేంద్ర నివేదికలు స్పష్టం చేశాయి. 2019 నుంచి 2023 వరకు చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్‌లోనే మకాం వేశారు తప్ప ఏనాడైనా ప్రజల మధ్య ఉన్నారా? ప్రజల కోసం నిరంతరం క్షేత్రస్థాయిలో పోరాడుతున్న జగన్ గారిపై బురదజల్లడమే వీరి పనిగా మారింది. విపత్తును వదిలేసి విషం కక్కుతున్న హోంమంత్రి అనిత.. రాష్ట్రంలో గత రెండు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి, తుఫానుతో ప్రజలు అల్లాడుతుంటే విపత్తు నిర్వహణ బాధ్యత ఉన్న హోంమంత్రి అనిత గారు ప్రజలను ఎలా ఆదుకుంటున్నారో చెప్పాల్సింది పోయి, గంటసేపు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్సార్సీపీపై విషం కక్కారు. హోంమంత్రిలా కాకుండా పార్టీ అధికార ప్రతినిధిలా ఆమె మాట్లాడుతున్నారు. జగన్ నామస్మరణ చేయకుండా కూటమి ప్రభుత్వానికి రోజూ తెల్లారదు. విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్‌పై సుప్రీంకోర్టు 'డీజీపీ నిద్రపోతున్నారా' అని చీవాట్లు పెడితే హోంమంత్రి వద్ద సమాధానం లేదు. కొడుకు బూడిదైనా ఇవ్వండని ఓ తల్లి అల్లాడుతుంటే కులం రంగు పులిమారు. క్రాంతికుమార్ అనే యువకుడు పోలీసు వేధింపులతో చనిపోతే ఆయన కుటుంబాన్ని, విశాఖలో చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలను జగన్ గారు స్వయంగా వెళ్లి పరామర్శించి రూ.7 లక్షల ఆర్థిక సాయం చేస్తే.. పరామర్శించిన వాళ్లంతా రౌడీషీటర్లని మాట్లాడటం అనిత గారి దిగజారుడుతనానికి నిదర్శనం. డీఎస్సీపై ప్రశ్నిస్తే రౌడీషీట్లా? 90 కేసులున్న టీడీపీ నేతలు సాధువులా? డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనలో జరిగిన అక్రమాలపై నిరసన తెలపడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, కార్యకర్తలపై హోంమంత్రి రౌడీషీట్లు ఓపెన్ చేస్తామంటున్నారు. మా కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి రౌడీషీటర్లని ముద్ర వేస్తున్నారు. టీడీపీలో 90 కేసులు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్లేమైనా హిమాలయాల నుంచి దిగొచ్చిన సాధువులా, ఋషిపుంగవులా? నారా లోకేష్‌ను ఏమైనా అంటే చంపేస్తామని శాప్ వద్ద బెదిరింపులకు దిగిన టీడీపీ గూండాలపై ఏం చర్యలు తీసుకున్నారు? నాడు వ్యవసాయ విద్యుత్ ఉద్యమంలో రైతుల చేతులకు బేడీలు వేయించి, బషీర్‌బాగ్, కల్దారిల్లో కాల్పులు జరిపించి రైతులను పొట్టనబెట్టుకున్న చంద్రబాబు చరిత్ర ప్రజలకు గుర్తుంది. ఇన్ఫ్లుయెన్సర్లకు ప్రజాధనం కట్టబెట్టడం పబ్లిసిటీ పిచ్చికి పరాకాష్ట.. నిన్నటి కేబినెట్ భేటీలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలు, పారితోషకాలు ఇస్తామని నిర్ణయం తీసుకోవడం చంద్రబాబు ప్రచార పిచ్చికి పరాకాష్ట.వైయస్. జగన్ హయాంలో పేదలకు, రైతులకు, మహిళలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించేందుకు కేబినెట్లో క్యాలెండర్ ఆమోదించేవారు. కానీ చంద్రబాబు ప్రజల పన్నుల డబ్బుతో టీడీపీ ప్రచారం చేసుకోవడానికి, వైఎస్సార్సీపీ నేతల వ్యక్తిత్వ హననం చేయడానికి పథకం వేశారు. రెండేళ్లలో కొత్తగా ఒక్క రేషన్ కార్డు, పెన్షన్, ఇళ్ల స్థలం ఇవ్వని ప్రభుత్వం, ఆర్బీఐ దగ్గర అప్పులు తెచ్చి పబ్లిసిటీకి తగలేస్తోంది. క్షేత్రస్థాయిలో రాత్రింబవళ్లు పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వరు, ఫీజు రాయితీలు ఇవ్వరు, చివరకు ఆరోగ్యశ్రీ కార్డులు కూడా లాగేసుకున్నారు. ఈ నేపధ్యంలో జర్నలిస్టుల సంక్షేమాన్ని తుంగలో తొక్కి, సోషల్ మీడియా రీల్స్ చేసుకునే వారికి ప్రజాధనం దోచిపెడతారా? అని వెన్నుపోటు పార్టీ కూటమిని కన్నబాబు సూటిగా ప్రశ్నించారు. పోలవరం ఎత్తు తగ్గించడంపై, విశాఖ భూములను 99 పైసలకు రాసివ్వడంపై, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడంపై ఇన్ఫ్లుయెన్సర్లతో సమాధానం చెప్పించగలరా? అని నిలదీశారు. వైయస్.జగన్ ది బటన్ నొక్కి నిశ్శబ్దంగా మేలు చేసిన సింప్లిసిటీ పాలనైతే, చంద్రబాబుది అబద్ధాలు ప్రచారం చేసుకునే పబ్లిసిటీ పాలన అని తేల్చి చెప్పారు.