అనంతపురం జిల్లా: తాడిపత్రి మున్సిపాలిటీలో నామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్సీపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని వైయస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపించాయి. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరిస్తున్నట్లు పేర్కొన్నాయి. 24వ వార్డు అభ్యర్థి కోట్ల షఫీ ఇంటిపై దాడి చేసి, ఫర్నీచర్ ధ్వంసం చేశారని ఆరోపణలు వచ్చాయి. మొదటి వార్డు అభ్యర్థి మహమ్మద్ జాఫర్‌ను జేసీ వర్గీయులు కిడ్నాప్ చేసినట్లు వైయస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపించాయి. ఈ పరిణామాలతో అభ్యర్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయని పేర్కొన్నాయి. జేసీ వర్గీయుల బెదిరింపులు, దౌర్జన్యాల కారణంగా ఐదు వార్డుల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారని పార్టీ శ్రేణులు తెలిపాయి. ఎన్నికల్లో పోటీ చేసే హక్కును అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంటూ, ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అభ్యర్థులకు రక్షణ కల్పించాలని కోరాయి.