ఉత్తరాంధ్రపై కూటమి ప్రభుత్వం వివక్ష.. 

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా సైనికులకు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పిలుపు

విజయనగరం: కూటమి ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సమర్థవంతంగా వినియోగించడంలో విఫలమైందని, ప్రజా ప్రయోజనాల కంటే స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ వైయ‌స్ఆర్‌సీపీ, పార్టీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తోందని శాసన మండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం ప్రదీప్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య స్వగృహంలో జిల్లా సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సోషల్ మీడియా సమావేశం, శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి తట్టుకోలేకే ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలకు దిగుతున్నాయని, జగన్ ప్రజల్లోకి వెళ్లినప్పుడు లభిస్తున్న అపార స్పందనే ఇందుకు నిదర్శనమని తెలిపారు. సోషల్ మీడియా కేవలం పోస్టులు పెట్టే వేదిక కాదని, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే శక్తివంతమైన సాధనమని, సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చేరవేసే బాధ్యత సోషల్ మీడియా సైనికులపై ఉందని పేర్కొన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ ఎదుగుదలలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించిందని, ముఖ్యంగా 2019 ఎన్నికల్లో పార్టీ విజయానికి బలమైన ఆయుధంగా నిలిచిందని గుర్తుచేశారు.

విజయనగరం జిల్లా రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని, ఇక్కడ జరిగే ప్రతి అంశం రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపుతుందని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉత్తరాంధ్రపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా మరింత సమర్థవంతంగా పనిచేసి వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కూటమి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో, సృజనాత్మకంగా పనిచేస్తూ ప్రజలతో అనుసంధానం పెంచుకోవాలని సూచించారు. డా. బొత్స అనూష, డా. బొత్స సందీప్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా కీలక వేదికగా నిలుస్తోందని, వాస్తవాలను ప్రజలకు చేరవేస్తూ సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎంపీ, పీఏసీ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు), మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, రాజాం నియోజకవర్గ పరిశీలకుడు కె.వి.సూర్యనారాయణ రాజు, చీపురుపల్లి యూత్ వింగ్ అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు వై.వాసునాయుడు, ఎస్‌.కోట యూత్ వింగ్ అధ్యక్షుడు వాకాడ సతీష్ దొర, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాసరావు, కెల్ల సురేష్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, మండలాల సోషల్ మీడియా సైనికులు పాల్గొన్నారు.

 

Back to Top