నెల్లూరు: డీఎస్సీ 2025 నియామకాల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో సహా నిరూపితమైనా కూటమి ప్రభుత్వం ఇంకా బుకాయించడం సిగ్గుచేటని వైయస్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డిఎస్సీ కుంభకోణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ల ప్రత్యక్ష పాత్ర ఉందని స్పష్టం చేశారు. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యమంత్రి పరిధిలోనే ఉన్నందున, క్రీడల కోటాలో పోటీ పరీక్ష లేకుండా సర్వీస్ నిబంధనలను సవరిస్తూ జీవో ఇవ్వడం వెనుక సీఎం బాధ్యత కాదనలేనిదని గుర్తుచేశారు. అధికారులు ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చిన వివరణలతోనే డిఎస్సీలో అక్రమాలు వాస్తవమేనని తేలిపోయిందని, ఆధారాలు బయటకు వచ్చాక ఇప్పుడు విచారణ చేస్తామనడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు. తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు కట్టబెట్టి అమాయక నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే.. అధికారుల వివరణతోనే అక్రమాలు బట్టబయలు. మొదట్లో డిఎస్సీలో ఎలాంటి లోపాలు జరగలేదని బుకాయించిన ప్రభుత్వం, ఆ తర్వాత స్వరం మార్చి విచారణ చేస్తామని రోజుకో నాటకం ఆడుతోంది. అధికారులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే అక్రమాలు జరిగాయని చెప్పకనే చెప్పారు. ఆధారాలతో సహా తప్పులు బహిర్గతమైన తర్వాత కూడా ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు తొలి సంతకం అంటూ ఊదరగొట్టి చివరికి నిరుద్యోగుల గొంతు కోశారు. సీఎం, మంత్రి లోకేష్ కి బాధ్యత లేదా?.. స్పోర్ట్స్ కోటాలో అసలు పోటీ పరీక్షే నిర్వహించాల్సిన అవసరం లేదంటూ సర్వీస్ రూల్స్‌ను సవరించింది సాధారణ పరిపాలన విభాగం. ఈ శాఖ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిధిలోనే ఉంటుంది. ఫైల్‌పై సీఎం సంతకం లేకుండానే జీవోలు వెలువడ్డాయా? అవినీతికి తెరతీసేందుకే ఉద్దేశపూర్వకంగా ఆ జీవో తీసుకొచ్చారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యత నుంచి ఎలా తప్పించుకుంటారు? ఈ స్కామ్‌లో వీరిద్దరి ప్రత్యక్ష పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఆధారాలతో సహా కర్నూలు ప్రభాకర్ ఉదంతం.. కర్నూలు జిల్లాలో ఎంపికైన ప్రభాకర్ కేసే ఇందుకు పెద్ద ఉదాహరణ. బీసీ కోటాలో 75 మార్కులు వస్తేనే ఎస్జీటీ ఉద్యోగానికి అర్హత కాగా, నాలుగు సార్లు రాసిన పరీక్షల్లో అత్యధికంగా 65 మార్కులే వచ్చాయి. ఉద్యోగం ఇచ్చే ముందు అర్హత చూడకుండా, ఉద్యోగం ఇచ్చేశాక త్రిసభ్య కమిటీతో విచారణ జరుపుతామనడం హాస్యాస్పదం. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల విషయంలోనూ అభ్యర్థుల అర్హతను, సర్టిఫికెట్ల జెన్యూనిటీని ఏమాత్రం పట్టించుకోకుండా పోస్టులు కట్టబెట్టారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్ల పేరుతో భారీ దగా.. క్రీడల కోటాలో ఇచ్చిన సర్టిఫికెట్లపై ప్రభుత్వం స్వతంత్ర క్రాస్ వెరిఫికేషన్ చేయలేదని అధికారులే చెబుతున్నారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై ప్రభుత్వం ఇచ్చిన జీవోలే అక్రమాలకు తలుపులు తెరిచాయి. సర్టిఫికెట్ల జెన్యూనిటీని స్వతంత్రంగా క్రాస్ వెరిఫికేషన్ చేయకుండా ఉద్యోగాలు ఎలా ఇచ్చారు? . ఏ అసోసియేషన్, ఏ ఫెడరేషన్ సర్టిఫికెట్ ఇచ్చింది? సంతకం ఎవరిది? అసలు ఆ టోర్నమెంట్ జరిగిందా? అభ్యర్థులు పాల్గొన్నారా? ఇవేమీ ముందుగా ఎందుకు పరిశీలించలేదు?, జూడో సహా అనుమానాస్పద సర్టిఫికెట్లపై ప్రభుత్వం ఇప్పుడు విజిలెన్స్ విచారణ అంటోంది. సర్టిఫికెట్లు నిజమైనవేనని క్లీన్‌చీట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? టోర్నమెంట్లు జరగలేదని, అభ్యర్థులు పాల్గొనలేదని ఆధారాలు బయటపడిన తర్వాత విచారణ చేస్తామనడం ఎందుకు?. నియామకాలకు ముందే ఈ వెరిఫికేషన్ ఎందుకు చేయలేదు?. కబడ్డీ సహా అన్ని స్పోర్ట్స్ సర్టిఫికెట్లను పూర్తిగా పరిశీలించాలి. అక్రమాలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుని, మోసపోయిన నిరుద్యోగులకు న్యాయం చేయాలి. జూడో, కబడ్డీ, బాక్సింగ్ వంటి క్రీడల్లో అభ్యర్థులు లేకుండానే సర్టిఫికెట్లు తెచ్చుకుంటే వాటిని మానవ తప్పిదాలంటూ అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ట్రేసబిలిటీ లేదు.. పారదర్శకత అసలే లేదు. డిజిటలైజేషన్ సరిగ్గా జరగలేదని, భవిష్యత్తులో స్కిల్ టెస్టులు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. అంటే ప్రస్తుతం జరిగిన డిఎస్సీలో ఎలాంటి పారదర్శకత, ట్రేసబిలిటీ లేదని ప్రభుత్వమే స్వయంగా అంగీకరించినట్లయింది. ఏడాది సమయం తీసుకుని హడావిడిగా నియామకాలు పూర్తి చేయడం వెనుక అనర్హులతో కుమ్మక్కై కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్నది నిజం కాదా?. ప్రశ్నిస్తే అణచివేత.. డైవర్షన్ పాలిటిక్స్. బాధిత నిరుద్యోగుల తరఫున వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పోరాడుతుంటే ప్రభుత్వం పోలీసులతో అణచివేసే చర్యలకు దిగుతోంది. తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. సమాధానం చెప్పలేక సోమిరెడ్డి లాంటి నేతలతో అడ్డగోలుగా మాట్లాడిస్తూ వ్యక్తిగత విమర్శలు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎంతమంది విమర్శలు చేసినా నిరుద్యోగుల పక్షాన పోరాడే వైయస్ఆర్‌సీపీ వెనకడుగు వేయదు. సీబీఐ విచారణ జరపాలి.. లోకేష్ రాజీనామా చేయాలి. ఈ నేపధ్యంలో డిఎస్సీ 2025లో శాఖాపరంగా, ప్రభుత్వపరంగా తీవ్రమైన అక్రమాలు జరిగాయన్నది తేటతెల్లమైందన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే డిఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణకు ఆదేశించడంతో పాటు .... విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యతగా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు.