విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 6.20 లక్షల పెన్షన్లను అన్యాయంగా రద్దు చేసిందని, గత 26 నెలలుగా ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయకుండా పేదలను మోసం చేసిందని మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఆశచూపి గద్దెనెక్కిన చంద్రబాబు, తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న పెన్షన్లను ఊడగొట్టారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను మభ్యపెట్టేందుకే ఇప్పుడు కొత్త పెన్షన్ల దరఖాస్తులంటూ సరికొత్త నాటకానికి తెరతీశారని, ఎన్నికల కోడ్ రాగానే ఆంక్షల సాకుతో తప్పించుకునే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించలేక, ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేక చతికిలబడ్డ చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే... 26 నెలలుగా నిద్రపోయి.. ఇప్పుడు 7 రోజుల గడువా?. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటింది. 26 నెలలుగా ఏ ఒక్క కొత్త పెన్షన్‌ను మంజూరు చేయలేదు. ఎన్నికల ముందు వయోపరిమితిని 10 ఏళ్లు తగ్గించి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. తీరా చూస్తే 50 ఏళ్ల మాట దేవుడెరుగు.. గతంలో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన 60 ఏళ్ల నిబంధన ప్రకారం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికీ కొత్త పెన్షన్ ఇవ్వలేదు. గత 26 నెలలుగా పోర్టల్‌ను మూసేసి, ఇప్పుడు హడావుడిగా కేవలం ఏడు రోజులు మాత్రమే దరఖాస్తులకు సమయం ఇవ్వడం ఎంతవరకు న్యాయం? దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని నిరంతరం కొనసాగించాలి. లక్షలాది పెన్షన్ల తొలగింపు దుర్మార్గం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 66,34,372 మందికి పెన్షన్లు అందించాం. సహజంగా ప్రతి ఏటా పెన్షన్ల సంఖ్య పెరిగి నేటికి 70 లక్షలు దాటాలి. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ల సంఖ్యను అంచలంచలుగా తగ్గించి 60,13,609కి కుదించింది. అంటే ఏకంగా 6,20,000 మంది నిరుపేదల పెన్షన్లను అన్యాయంగా ఎగ్గొట్టారు. వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్లను సైతం తొలగించే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో సంతృప్త స్థాయిలో సంక్షేమం.. 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మాట ప్రకారం వయోపరిమితిని 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించి, ఒకే విడతలో 10,60,208 మందికి నూతన పెన్షన్లు మంజూరు చేశారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో అందరికీ అందించాం. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి ఒకటో తేదీ ఉదయం 5 గంటలకే లబ్ధిదారుల గుమ్మం వద్దకే వెళ్లి గౌరవంగా పింఛన్ అందించిన ఘనత వైఎస్సార్సీపీదే. ఇప్పుడు కలెక్టర్లు, ఎంపీడీవోల అధికారాలను లాగేసుకుని, పెన్షన్ల మంజూరును తమ గుప్పిట్లో పెట్టుకుని జన్మభూమి కమిటీల తరహాలో సొంత పార్టీ కార్యకర్తలకే ఇచ్చేందుకు తెరవెనుక కుట్రలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కొత్త డ్రామా.. త్వరలో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నటిస్తున్నారు. దరఖాస్తులు తీసుకున్నాక ఎన్నికల షెడ్యూల్ రాగానే ఈసీ నిబంధనలు అడ్డువచ్చాయంటూ ప్రజలను నిలువునా ముంచేసే కుట్ర ఇది. చంద్రబాబు నాయుడు మాయమాటలను, మోసపూరిత ప్రకటనలను ప్రజలు గమనించాలి. ఎన్నికల హామీలు అటకెక్కాయి.. ధరలు ఆకాశాన్నంటాయి.. ఎన్నికల సమయంలో వెన్నుపోటు కూటమి పార్టీ ఇంటింటికీ తిరిగి ఇచ్చిన బాండ్లకు విలువ లేకుండా పోయింది. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు.. ఇవ్వకపోతే నెలకు రూ. 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఏమైంది? 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 1500 ఇస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు సహా ఊరూరా తిరిగి ప్రచారం చేశారు, ఆ డబ్బులు ఎవరి ఖాతాలో వేశారు? ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం అని చెప్పి అరకొరగా ఒక్క సిలిండర్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పెంచిన రూ. 1,000 పింఛన్ ఏ మూలకూ సరిపోవడం లేదు. నిత్యావసర ధరల రెక్కలు విరుస్తామన్న చంద్రబాబు పాలనలో కందిపప్పు, నూనె, పంచదార, బియ్యం, కరెంట్ ఛార్జీలు, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుడి నడ్డి విరిగింది. చంద్రబాబు వస్తే కరువే.. అన్నదాతలకు తీరని అన్యాయం.. చంద్రబాబు పాలన ఎప్పుడు వచ్చినా రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుందనడానికి నేటి పరిస్థితులే నిదర్శనం. గతంలో 2002లోనూ ఇలాగే వర్షాలు లేక రైతులు అల్లాడిపోయారు. ఇప్పుడు కూడా సెప్టెంబర్ వచ్చినా వర్షాలు లేక పంటలు, నారుమడులు ఎండిపోతున్నాయి. ఆర్బీకేలలో సిబ్బందిని తగ్గించి రైతులకు విత్తనాలు, ఎరువులు కూడా సక్రమంగా అందించడం లేదు. వైఎస్సార్, వైఎస్ జగన్ పాలనలో రైతన్నలు సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం కరువు పరిస్థితులు నెలకొన్నందున బ్యాంకులు, సహకార సంఘాల్లో రైతులు తీసుకున్న పంట పెట్టుబడి అప్పులన్నింటినీ ప్రభుత్వం వెంటనే పూర్తిగా మాఫీ చేయాలి. ఆరుతడి పంటల కోసం రైతులకు ఉచితంగా విత్తనాలు, పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలి. నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి రాజీనామా చేయాలి.. వైఎస్సార్సీపీ హయాంలో డీబీటీ ద్వారా ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించడంతో పాటు, బడులు, ఆస్పత్రులను నాడు-నేడు ద్వారా తీర్చిదిద్దాం. కానీ ఈ కూటమి సర్కారు ఏకంగా రూ. 3.56 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి ఒక్క సంక్షేమ పథకాన్నీ సరిగ్గా అమలు చేయకుండా దోపిడీ చేస్తోంది. పేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయడంతో పాటు... ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేక, ప్రజలకు సమాధానం చెప్పలేక రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు నాయుడకి తన పదవిలో కొనసాగే హక్కు లేదు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణకు భయమెందుకు? నిజాలు బయటపెట్టే దమ్ముందా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డీఎస్సీ అవకతవకలపై ప్రశ్నిస్తే వెన్నుపోటు కూటమి పార్టీ వైయస్. జగన్ గారి గురించి మాట్లాడుతున్నారని.. దమ్ముంటే డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని బూడి మత్యాలనాయడు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలోని ఏపీపీఎస్సీ వ్యవహారాలపైనా ఆరోపణ చేస్తున్న నేపధ్యంలో దానిపై కూడా సీబీఐ విచారణ చేయించాలన్నారు. డీఎస్సీలో అవకతవకలు జరగకపోతే సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ఆయన నిలదీశారు.