మున్సిపల్‌ ఎన్నికలకు వైయ‌స్ఆర్‌సీపీ సమరసన్నద్ధం

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై పార్టీ శ్రేణుల‌కు ఉషశ్రీ చరణ్ దిశానిర్దేశం

 పెనుకొండ: రానున్న మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పెనుకొండ పట్టణ వైయ‌స్ఆర్‌సీపీలో ఎన్నికల కసరత్తు వేగం పుంజుకుంది. కౌన్సిలర్‌ స్థానాల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్న నాయకులు, కార్యకర్తలు తమ రాజకీయ అనుభవం, పార్టీ కోసం చేసిన సేవలు, ప్రజలతో ఉన్న అనుబంధం తదితర వివరాలతో కూడిన బయోడేటాలను శ్రీ సత్యసాయి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్‌కు సమర్పించారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయానికి వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్‌ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న పలువురు నాయకులు తరలిరావడంతో కార్యాలయంలో సందడి నెలకొంది.

ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్‌ అభ్యర్థుల వివరాలను స్వీకరిస్తూ వార్డు స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజల సమస్యలను నిరంతరం తెలుసుకుంటూ వారి పక్షాన నిలవడం, కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుని ఐక్యంగా ముందుకు సాగడంపై దృష్టి సారించాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలను కలుపుకుని బూత్‌ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయాలని తెలిపారు. యువత, మహిళలు, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ స్థానిక సమస్యలపై ప్రజలతో కలిసి పనిచేయాలని, మున్సిపల్‌ ఎన్నికల సన్నాహాలను మరింత వేగవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
 

Back to Top