స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగరేస్తాం

 ప్రజల సమస్యలపై పోరాడుతూ పార్టీని బలోపేతం చేయాలి

: డా. సాకే శైలజానాథ్‌, అనంత వెంకటరామిరెడ్డి

అనంత‌పురం: శింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో వైయ‌స్ఆర్‌సీపీ నూతన పార్టీ కార్యాలయాన్ని నియోజకవర్గ సమన్వయకర్త డా. సాకే శైలజానాథ్‌, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. సాకే శైలజానాథ్‌ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం పదవుల కోసం జరిగే ఎన్నికలు కాదని, గ్రామాల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, జగనన్న తోడు, బీమా, పెన్షన్‌ వంటి పథకాల ద్వారా వివిధ వర్గాలకు నేరుగా ప్రయోజనం అందిందని తెలిపారు. రోడ్లు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్య రంగం, సాగునీటి అంశాల్లో చేపట్టిన పనులను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, ప్రతి గ్రామంలో రైతులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రజల పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను, ప్రస్తుత ప్రభుత్వ పాలనలో అమలవుతున్న పథకాలు, వాటి ప్రయోజనాలను వాస్తవాలతో ప్రతి ఇంటికీ వివరించాలని సూచించారు. రైతుకు నీరు, యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు నాణ్యమైన విద్య, మహిళలకు ఆర్థిక భరోసా, వృద్ధులకు గౌరవప్రదమైన పెన్షన్‌తో పాటు గ్రామాలకు రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కోసం వైయ‌స్ఆర్‌సీపీ ప్రజల పక్షాన నిలబడుతుందని తెలిపారు. కార్యకర్తలు ఐక్యంగా, క్రమశిక్షణతో ప్రజల్లో పనిచేస్తే పార్టీ మరింత బలోపేతమవుతుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయానికి ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్లమెంట్‌ పరిశీలకుడు బి. నరేష్‌కుమార్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు ఎల్‌.ఎం. మోహన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఖాదర్‌వలి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

 

Back to Top