ప్రతి గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ జెండా బలంగా ఎగరాలి

మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

ప‌ల్నాడు జిల్లా: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు, పార్టీ ఐక్యత, బలోపేతం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై శావల్యాపురం మండల వైయ‌స్ఆర్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలో చర్చించారు. వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికలే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని, ప్రతి గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ జెండా బలంగా ఎగరాలని పిలుపునిచ్చారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో శావల్యాపురం మండల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలే పార్టీకి నిజమైన బలమని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం ప్రజల తరఫున పోరాడాలని సూచించారు.

కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అభివృద్ధి కంటే శిలాఫలకాలకే పరిమితమయ్యారని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. డీఎస్సీపై ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీల నేతలపై అధికార పార్టీ నాయకులు దాడులకు పాల్పడటం సరికాదని పేర్కొన్నారు. తనపై అక్రమ కేసు పెట్టి 14 రోజులు రిమాండ్‌కు పంపినా తాను ఎలాంటి ఒత్తిడికీ భయపడలేదని, స్థానిక ఎన్నికల సమయంలో శావల్యాపురం మండలంలోని ప్రతి గ్రామానికి, ప్రతి గడపకు తానే స్వయంగా వస్తానని చెప్పారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు, అవసరమైతే కోర్టులో ప్రైవేట్ కేసులు వేస్తామని తెలిపారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ గుర్తింపు కార్డులను అందజేశారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
 

Back to Top