నిరుద్యోగ యువ‌త‌కు కూట‌మి ప్ర‌భుత్వం తీర‌ని ద్రోహం 

నాడు జ‌గ‌న్ గారు ఇచ్చిన పోస్టుల‌కు పాసింగ్ అవుట్ పరేడ్లు

మాజీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ స్ప‌ష్టీక‌ర‌ణ 

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర  కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన పార్టీ అధికార ప్ర‌తినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌

20 ల‌క్ష‌ల ఉద్యోగాల పేరుతో ఎన్నిక‌ల్లో ప‌చ్చి ద‌గా 

నిరుద్యోగుల‌కు నిర‌స‌న తెలిపే హ‌క్కును కూడా కాల‌రాస్తున్నారు 

జ‌గ‌న్ గారు ఇచ్చిన ఉద్యోగాల‌తో కూట‌మి ప్ర‌భుత్వం ప‌బ్లిసిటీ

సొమ్మొక‌డిది, సోకు ఇంకొకడిది అన్న‌ట్టు ప్ర‌భుత్వ వ్య‌వ‌హారం

క‌నీసం వ‌యోప‌రిమితి పెంపు ఆలోచ‌న కూడా చేయ‌డం లేదు  

గోరంట్ల మాధ‌వ్ ఆగ్ర‌హం 

తాడేపల్లి: డిసెంబర్ 2023 నాటికి రాష్ట్రంలో 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా స్వయంగా ప్రకటించిన హోంమంత్రి అనిత‌... నేడు కేవలం 1600 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగ యువతను మోసగించడమేనని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వైయ‌స్ఆర్‌సీపీ హయాంలోనే ఏకంగా 6,100 కానిస్టేబుల్, 411 ఎస్‌ఐ పోస్టులతో కలిపి 6,511 పోలీసు పోస్టుల నియామక ప్రక్రియ చేపట్టిన విష‌యాన్ని గుర్తు చేశారు. పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించి, నేడు శిక్షణ దశకు చేరుకున్న ఘనత నాటి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈరోజు ట్రైనింగ్ అవుతున్న కానిస్టేబుళ్ళు అందరూ వైఎస్ జగన్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారానే వచ్చారని చెబుతూ, సొమ్మొక‌రిది సోకొక‌రిది అన్న‌ట్టు పాసింగ్ అవుట్ పరేడ్‌లు నిర్వ‌హిస్తూ కూట‌మి ప్ర‌భుత్వం క్రెడిట్ తీసుకోవ‌డం స‌రికాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గరిష్ట వయోపరిమితిని మరో ఐదేళ్లు పెంచాలని డిమాండ్ చేసిన నారా లోకేష్... నేడు అధికారంలోకి వచ్చాక అదే వయోపరిమితి పెంపును నిరుద్యోగ యువతకు ఎందుకు వర్తింపజేయలేదని, దీనిపై ఆయన నోరు ఎందుకు మూగబోయిందని గోరంట్ల మాధ‌వ్ నిలదీశారు. కూట‌మి ప్ర‌భుత్వంలో ఉద్యోగాలు రాక, మోసపోయామని భావించి శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులు, నిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం అణచివేత ధోరణిని అవలంబిస్తోందని మాధవ్ విమర్శించారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు చేసుకునే ప్రాథమిక హక్కులను కాలరాస్తూ, ప్రజాస్వామ్య గొంతుకలను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

 నిరుద్యోగులపై అణచివేత

ఉద్యోగాలు, డీఎస్సీ, పోలీసు నియామకాల్లో తమ సమస్యలను ప్రశ్నిస్తూ నిరసన తెలిపే నిరుద్యోగ యువతను ప్రభుత్వం అణచివేయడం సరికాదు. తమకు జరిగిన అన్యాయాన్ని సభలు, సమావేశాలు, ర్యాలీలు, మీడియా, సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసే హక్కు నిరుద్యోగులకు ఉంది. నిరుద్యోగ యువతతో పాటు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై కేసులు పెట్టడం అప్రజాస్వామిక చర్య. తమ సమస్యలను ప్రశ్నించినందుకు యువతపై కేసులు పెట్టడం ద్వారా వారి గొంతును అణచివేయాలని చూడటం సరికాదు. 

 ఉద్యోగాలకు వ‌యోప‌రిమితిని పెంచాలి

పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ నాలుగేళ్ల విరామం తర్వాత వచ్చిందని, వయోపరిమితి నిబంధనల వల్ల అనేక మంది అభ్యర్థులు అర్హత కోల్పోతున్నారని 2022లో లోకేష్ పేర్కొంటూ.. తెలంగాణ తరహాలో ఏపీలోనూ గరిష్ట వయోపరిమితిని ఐదేళ్లు సడలించాలని కోరాడు. 
అలాగే, అప్పటి నిరుద్యోగుల విజ్ఞప్తుల నేపథ్యంలో వైఎస్ జగన్ గారి ప్రభుత్వం కానిస్టేబుల్ నియామకాల్లో వయోపరిమితిని రెండేళ్లు సడలించింది. 6,100 కానిస్టేబుల్, 411 ఎస్‌ఐ పోస్టులతో కలిపి 6,511 పోలీసు పోస్టుల నియామక ప్రక్రియ చేపట్టింది. ఇప్పుడు అధికారంలో ఉన్న లోకేష్‌.. తాను నాడు డిమాండ్ చేసిన ఐదేళ్ల వయో పరిమితి సడలింపును నిరుద్యోగ యువతకు ఎందుకు అమలు చేయించడం లేదు? 2026లో విడుదలైన తాజా పోలీసు కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో సాధారణ కానిస్టేబుల్ పోస్టులకు వయోపరిమితి 18 నుంచి 23 ఏళ్లుగా ఉంది. మరి నాడు ఐదేళ్ల సడలింపు కోరిన లోకేష్.. ఇప్పుడు అధికారంలో ఉండి ఎందుకు మౌనం వహిస్తున్నారు? 

 కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసు వ్యవస్థ దిగజారింది

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయి. నిజాయితీగా, క్రమశిక్షణతో పనిచేస్తున్న పోలీసు అధికారులు చాలా మంది ఉన్నారు. అయితే కొందరు అధికారులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై కేసులు పెట్టడం, రౌడీషీట్లు పెట్టడం, వేధింపులకు పాల్పడటం వంటి చర్యలకు పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసు వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది.
పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా తమ విధులను నిర్వహించాలి. తమ ఉద్యోగ ధర్మాన్ని, నిజాయితీని కాపాడుకోవాలి.

 ప్రభుత్వం సమాధానం చెప్పాలి

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేయాలి. ఉద్యోగాల భ‌ర్తీకి వయోపరిమితిని పెంచాలి. నిరసన తెలిపే హక్కును కాపాడాలి. పోలీసు వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లకు దూరంగా ఉంచాలి. ఈ అంశాలన్నింటిపై ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలి. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం తెలంగాణకు వలస వెళ్లే పరిస్థితి రాకుండా రాష్ట్రంలోనే వారికి తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. పోలీసు శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసి మన రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. యువత సమస్యలను ప్రభుత్వం అణచివేయడం కాదు, వారి సమస్యలకు పరిష్కారం చూపాలి. నిరుద్యోగ యువత గొంతుకను వినాలి. వారికి న్యాయం చేయాలని గోరంట్ల మాధ‌వ్ డిమాండ్ చేశారు. 
  

Back to Top