టెక్కలి: ఇటీవల జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన గిరిజన విద్యార్థుల కుటుంబాలను మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ పరామర్శించారు. టెక్కలి మండలం ముఖలింగాపురం పంచాయతీ డమర గ్రామంలో మృతి చెందిన గంగువాడ నాగరాజు కుమారుడు విశాల్, జన్ని రాము కుమారుడు దిలీప్ కుటుంబ సభ్యులను, మేఘవరం పంచాయతీ చిన్న భీంపురం గ్రామానికి చెందిన జన్ని శరత్‌కుమార్ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. బాధిత కుటుంబాలకు వైయస్ఆర్‌సీపీ తరఫున ఒక్కొక్కరికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడిన ఘటన అత్యంత విషాదకరమని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. పేద గిరిజన కుటుంబాలకు జరిగిన ఈ నష్టం తీరని విషాదమని, వసతి గృహాల్లో విద్యార్థుల భద్రతకు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే విషయంలో, సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం తగిన విధంగా స్పందించలేదని కుటుంబ సభ్యులు తమ ఆవేదనను వ్యక్తం చేశారని చెప్పారు. గిరిజన విద్యార్థుల కుటుంబాల పరిస్థితి చూస్తే ఎంతో బాధ కలిగిందని, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.