వైయస్ఆర్ జిల్లా: కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి వేంపల్లి, చక్రాయపేట మండలాల్లో పర్యటించి పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. వేంపల్లి మండలం నాగూరు గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి నాగేల్ల రాంప్రసాద్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి తెలిపారు. ఆప్తుడిని కోల్పోయిన కుటుంబానికి ధైర్యం చెబుతూ, కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనారోగ్యంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న తువ్వపల్లి వెంకటనారాయణరెడ్డిని ఎంపీ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చక్రాయపేట మండలం కుప్పం గ్రామానికి చెందిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్త వెంకటరామిరెడ్డి కుమారుడు, బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న భరత్‌కుమార్‌రెడ్డి వారం రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ, అధైర్యపడవద్దని, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.